బాలుడి గొంతులో ఇరుక్కున్న రూపాయి బిళ్ల.. ఏడేండ్ల తర్వాత తొలగించిన వైద్యులు
తెలిసీతెలియని వయసులో పిల్లలు తమ చేతుల్లో, తమకు కనిపించిన వస్తువులను అమాంతం మింగేస్తుంటారు. దాంతో కొన్ని వస్తువులు కడుపులోకి వెళ్లిపోతుంటాయి. మరికొన్ని గొంతు వద్దనే ఆగిపోతుంటాయి. అలా గొంతులో ఇరుక్కున్న వస్తువులను తొలగించేందుకు పేరెంట్స్ వైద్యులను సంప్రదిస్తుంటారు.

లక్నో : తెలిసీతెలియని వయసులో పిల్లలు తమ చేతుల్లో, తమకు కనిపించిన వస్తువులను అమాంతం మింగేస్తుంటారు. దాంతో కొన్ని వస్తువులు కడుపులోకి వెళ్లిపోతుంటాయి. మరికొన్ని గొంతు వద్దనే ఆగిపోతుంటాయి. అలా గొంతులో ఇరుక్కున్న వస్తువులను తొలగించేందుకు పేరెంట్స్ వైద్యులను సంప్రదిస్తుంటారు. మొత్తానికి ఏదో ఒక రకంగా గొంతులో, కడుపులో ఉన్న వస్తువులను తొలగిస్తారు. అయితే ఓ బాలుడికి రూపాయి బిళ్ల అతని గొంతులో ఇరుక్కుపోవడంతో.. ఏడేండ్ల పాటు నరకయాతన అనుభవించాడు. ఎట్టకేలకు ఆ బాలుడికి ఇటీవలే వైద్యులు సర్జరీ నిర్వహించి, రూపాయి బిళ్లను తొలగించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి పరిధిలోని మురళీపూర్వ గ్రామానికి చెందిన అంకుల్ అనే బాలుడు.. తనకు ఐదేండ్ల వయసున్నప్పుడు రూపాయి బిళ్లను మింగేశాడు. ఏప్రిల్ మొదటి వారంలో అతనికి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించగా, వైద్యుల సూచన మేరకు మెడిసిన్స్ వాడడంతో నొప్పి తగ్గిపోయింది. మళ్లీ జూన్ 4వ తేదీన అతని గొంతులో తీవ్రమైన నొప్పి వచ్చింది. బాలుడి బాధను చూడలేక.. జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా, స్కానింగ్ నిర్వహించారు.
బాలుడి గొంతులో రూపాయి బిళ్ల ఇరుక్కున్నట్లు స్కానింగ్‌లో తేలింది. టెలిస్కోప్ పద్దతిని ఉపయోగించి సర్జరీ చేసిన వైద్యులు రూపాయి బిళ్లను తొలగించారు. ఏడేళ్ల పాటు బాలుడి గొంతులోనే నాణేం ఇరుక్కుపోయి ఉందని, ఇలాంటివి చూడటం చాలా అరుదని, ఇది బాలుడి ఎదుగుదలను మాత్రమే కాకుండా అతని శారీరక ఎదుగుదలను కూడా ప్రభావితం చేసింది. పిల్లాడు 12 ఏళ్ల వయస్సున్న పిల్లాడిలా లేడని డాక్టర్ వివేక్ సింగ్ చెప్పారు. ఇలాంటి కేసుల్లో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ అని, తొలగించిన తర్వాత కూడా అబ్బాయికి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దీంతో రెగ్యులర్ చెకప్‌కి రావాలని కుటుంబ సభ్యులకు సూచించినట్లు వెల్లడించారు.