జనవరి 1 నుంచి పూరీ జగన్నాథ్ ఆలయ దర్శనానికి నిబంధనలు

- ఆలయ కమిటీ తీర్మానం
విధాత: భువనేశ్వర్: ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒడిశాలోని పూరీ జగన్నాథ దేవాలయం గురించి తెలియని వారు లేరు. నిత్యం లక్షల్లో భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. అయితే.. ఇకపై కొన్ని నిబంధనలను పాటించిన వారికి మాత్రమే ఆలయంలో ప్రవేశం ఉంటుంది. ఈ మేరకు ఆలయ కమిటీ తీర్మానం చేసింది. 2024 జనవరి 1 నుంచి పూరీ దేవాలయం దర్శనానికి భక్తులు సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించి రావాలని ఆలయ కమిటీ ఒక ప్రకటనలో తెలియజేసింది.
ఈ మధ్యకాలంలో కొంతమంది భక్తులు జగన్నాథ మందిరంలోకి అభ్యంతరకరమైన దుస్తులు ధరించి ప్రవేశించడం కనిపించింది. నీతి సబ్ కమిటీ వీటిని పరిశీలించింది. తక్షణమే సమావేశమై, ఇటువంటి అభ్యంతరకర దుస్తులతో ఆలయ ప్రవేశాన్ని అరికట్టాలని నిర్ణయించింది. 12వ శతాబ్దానికి చెందిన పూరి జగన్నాథ దేవాలయంలోకి భక్తులు తప్పకుండా సాంప్రదాయ దుస్తుల నియమాన్నిపాటించాలని దేవాలయ కమిటీ కోరింది.
శ్రీ జగన్నాథ మందిర్ కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ చీఫ్ రంజన్ కుమార్ దాస్ మాట్లాడుతూ కొంతమంది భక్తులు దురదృష్టవశాత్తు ఇతరుల అభిప్రాయాలను, మతానికి సంబంధించిన సంప్రదాయాలను పట్టించుకోకుండా, లెక్కచేయకుండా ఇటువంటి అభ్యంతరకరమైన దుస్తులు ధరించి మందిర్ లోకి ప్రవేశించడం ద్వారా మందిర్ ప్రతిష్ట, పవిత్రత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయన్నారు. వీటిని కాపాడటానికి గాను డ్రెస్ కోడ్ అమల్లోకి తేవాల్సిన బాధ్యత తమపై ఉన్నదని చెప్పారు. జనవరి ఒకటి నుండి ఎటువంటి దుస్తులు ధరించాలనే విషయాన్ని త్వరలో కమిటీ నిర్ణయిస్తుందని వివరించారు.
సింహ ద్వారం దగ్గర సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేస్తారు. వాళ్లు డ్రెస్ కోడ్ ఉన్న వారిని మాత్రమే మందిర్‌లోకి అనుమతిస్తారు. దేవాలయంలో ప్రవేశించిన తర్వాత కూడా ప్రతిహారి సేవకులు అవసరమైన బాధ్యతలతో ప్రవేశించిన వారి యొక్క డ్రెస్ కోడ్ను పర్యవేక్షిస్తారు. మందిరం దేవాలయం యొక్క నిర్ణయాలకు భిన్నంగా ఉన్న వారిని వారు చెక్ చేసి అవసరమైన నిర్ణయాలు తీసుకోవటానికి వారిని భక్తులను ఎల్లవేళలా పరిశీలిస్తూ ఉంటారు. భక్తులు షాట్స్, చినిగిన జీన్స్, స్కర్టులు, స్లీవ్ లెస్ డ్రెస్‌లు వంటివి ధరించి ఉంటే వారిని దేవాలయంలోకి అనుమతించరు.