ప్రచారంలో కులమతాల ప్రస్తావన వద్దు.. బీజేపీ, కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం సూచన

కులం, మతం, భాష, కమ్యూనిటీ అంశాలను ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ, కాంగ్రెస్‌కు సూచించింది.

ప్రచారంలో కులమతాల ప్రస్తావన వద్దు.. బీజేపీ, కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం సూచన

న్యూఢిల్లీ : కులం, మతం, భాష, కమ్యూనిటీ అంశాలను ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ, కాంగ్రెస్‌కు సూచించింది. ఈ ఎన్నికల్లో భారతదేశ సాంఘిక, సాంస్కృతిక వాతావరణానికి హానికలుగకుండా చూడాలని కోరింది. రాజస్థాన్‌లోని బన్స్వారాలో ప్రధాని నరేంద్రమోదీ విద్వేషపూరిత ప్రసంగం చేశారన్న ప్రతిపక్షం ఆరోపణలపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నోటీసు జారీ చేసిన నెల రోజులకు తాజాగా ఈసీ ఈ మార్గదర్శకాలు జారీ చేసింది.

మోదీ వ్యాఖ్యలను నడ్డా సమర్థించుకోవడాన్ని తిరస్కరించింది. కుల, మత అంశాలపై ప్రచారం చేయకుండా తమ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్లను నిరోధించాలని సూచించింది. సమాజాన్ని చీల్చే ప్రసంగాలను ఆపాలని బీజేపీని కోరింది. నడ్డాతోపాటు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా ఈసీ నోటీసు జారీ చేస్తూ.. ఖర్గే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ దాఖలు చేసిన ఫిర్యాదులకు స్పందన తెలియజేయాలని కోరింది.

ఖర్గే సమర్థనలను కూడా తిరస్కరించిన ఈసీ.. రక్షణ దళాలను రాజకీయం చేయవద్దని స్పష్టంచేసింది. రాజ్యాంగాన్ని రద్దు చేస్తారనో, లేదా అమ్మేస్తారనో తప్పుడు అభిప్రాయం కలిగించేలా స్టేట్‌మెంట్లు ఇవ్వకుండా తమ పార్టీ ప్రచారకులను, అభ్యర్థులను నిరోధించాలని కోరింది. వారి ప్రసంగాలు సరిదిద్దుకునేలా, మర్యాదను కాపాడేలా రెండు పార్టీల అధ్యక్షులు తమ నేతలకు సూచనలు చేయాలని విజ్ఞప్తి చేసింది.