Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు..!

మద్యంపాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది.

Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు..!

నాలుగో సారైనా విచారణకు వెళ్తారా..?

Arvind Kejriwal | ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లు జారీ చేసింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేతకు ఈడీ సమన్లు జారీ చేయడం ఇది నాలుగోసారి. ఈ నెల 18న తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించింది. ఇదిలా ఉండగా.. ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమని పేర్కొన్న ఆయన మూడుసార్లు ఈడీ విచారణకు హాజరుకాలేదు. తొలిసారిగా ఈడీ ఆయనకు నవంబర్‌ 2న నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత డిసెంబర్‌ 21, జనవరి 3న విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయగా.. ఆయన హాజరయ్యేందుకు నిరాకరించారు.


ఈ కేసుకు సంబంధించి ఆప్ చీఫ్‌ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఏప్రిల్‌లో ప్రశ్నించింది. ఈ కేసులో సీబీఐ ఆయనను నిందితుడిగా ఆ చేర్చలేదు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మొదటి సమన్లు జారీ చేసినప్పటి నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రిని ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతున్నది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నేతలను ఈడీ అరెస్టు చేసింది. మాజీ మంత్రులు మనీష్‌ సిసోడియా, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఈ పరిమాణాలను నిశితంగా పరిశీలిస్తున్నది.


ఒక వేళ అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేస్తే ముఖ్యమంత్రిగా అరవింద్‌ కేజ్రీవాల్‌ కొనసాగాలని.. జైలు నుంచే తన పని తాను చేయాలని పార్టీ నిర్ణయానికి నిర్ణయించింది. ఎక్సైజ్‌ పాలసీని రూపొందించడంలో మద్యం కంపెనీల ప్రమేయం ఉందని సీబీఐ ఆరోపించింది. సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆప్‌ గుజరాత్‌ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారాన్ని వినియోగించిందని.. దాంతో 12.91శాతం ఓట్లు పొందిన జాతీయ పార్టీగా మారిందని బీజేపీ ఆరోపిస్తున్నది. అయితే, ఈ కేసు 2021-22లో ఎక్సైజ్ పాలసీకి సంబంధించింది కాగా.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అమలుపై సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. 2022లో వచ్చిన ఆరోపణలతో ఆప్‌ ప్రభుత్వం మద్యం పాలసీని రద్దు చేసింది. ఈ కేసులో ప్రస్తుతం మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్టు కావడంతో జైలులో ఉన్నారు. మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గత ఏడాది ఫిబ్రవరిలో అరెస్టు చేయగా.. మనీలాండరింగ్ కేసులో అక్టోబర్ 4న సంజయ్ సింగ్ అరెస్టయ్యారు.