ఎగ్జిట్‌పోల్స్‌కు అందని ఫలితాలు

ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమవుతాయా? తప్పుతాయా? అన్న చర్చ ఈనాటిది కాదు. తాజాగా ఐదు రాష్ట్రాల పోలింగ్‌ అనంతరం విడుదలైన ఎగ్జిట్‌పోల్స్‌పైనా అలాంటి చర్చలే నడుస్తున్నాయి

ఎగ్జిట్‌పోల్స్‌కు అందని ఫలితాలు
  • ఒక్క తెలంగాణ, రాజస్థాన్‌లోనే సఫలం
  • అందులోనూ చాలా వైరుధ్యాలు

విధాత: ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమవుతాయా? తప్పుతాయా? అన్న చర్చ ఈనాటిది కాదు. తాజాగా ఐదు రాష్ట్రాల పోలింగ్‌ అనంతరం విడుదలైన ఎగ్జిట్‌పోల్స్‌పైనా అలాంటి చర్చలే నడుస్తున్నాయి. ఇందులో ఎక్కువ సర్వేలు ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని పేర్కొన్నాయి. కానీ.. వాటి అంచనాలను పటాపంచలు చేస్తూ అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఒక విధంగా ఎగ్జిట్‌పోల్స్‌ గందరగోళాన్ని సృష్టించాయి. ఎగ్జిట్‌పోల్స్‌లో ప్రముఖ సంస్థలైన యాక్సిస్‌ మై ఇండియా, సీవోటర్‌ చెరొక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.

రాజస్థాన్ విషయంలో పది సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ ప్రకటించగా.. అందులో ఏడు బీజేపీ గెలుస్తుందని చెప్పాయి. మధ్యప్రదేశ్ విషయంలో పది ఏజెన్సీలు ప్రకటించగా.. అవి నిట్టనిలువునా చీలిపోయాయి. సగం బీజేపీ గెలుస్తుందంటే.. సగం కాంగ్రెస్‌ గెలుపును అంచనా వేశాయి. ఛత్తీస్‌గఢ్‌లో పది ప్రముఖ ఏజెన్సీల్లో తొమ్మిది ఏజెన్సీలు కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పినా.. ఫలితం తిరగబడింది. తెలంగాణ బీఆరెస్‌ ఓటమిని ఏడు ఏజెన్సీలు అంచనా వేస్తే.. మూడు మాత్రం ఆ పార్టీ గెలుస్తుందని పేర్కొన్నాయి. మిజోరం ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. ఇక్కడ హంగ్‌ వస్తుందని ఎక్కువ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 

నిజానికి ఎగ్జిట్‌పోల్స్‌తో అయోమయ పరిస్థితి నెలకొన్నది. దేన్ని నమ్మాలో, దేన్ని నమ్మలేమో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. వాస్తవ ఫలితాలతో పోల్చితే ఏ ఒక్కటో దరిదాపుల్లో ఉంటున్నాయి. అది కూడా సమగ్రంగా కానేకాదు. సాధారణంగా ఎగ్జిట్‌పోల్స్‌లో ఓటు షేర్‌ ఆధారంగా సీట్ల వాటాను అంచనా వేస్తారు. అది పూర్తిగా తప్పని తేలిపోయింది.