Faridabad Explosives | ఫరీదాబాద్‌లో భారీ పేలుడు పదార్థాల స్వాధీనం

ఫరీదాబాద్‌లో జమ్మూ–కాశ్మీర్‌, హర్యానా పోలీసులు సంయుక్తంగా చేసిన దాడిలో 2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం. ఇద్దరు వైద్యులు సహా ఏడుగురు అరెస్టు. జైష్‌ సంబంధాలపై విచారణ.

Faridabad Explosives | ఫరీదాబాద్‌లో భారీ పేలుడు పదార్థాల స్వాధీనం

Explosives, Guns Recovered From J&K Doctors in Faridabad

  • వైద్యుల ఇళ్లలో పేలుడు సామగ్రి నిల్వ
  • జమ్మూ–కాశ్మీర్‌, హర్యానా పోలీసుల సంయుక్త దాడి

హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌ లో జమ్మూ–కాశ్మీర్‌ పోలీసులతో కలిసి హర్యానా పోలీసులు చేసిన సంయుక్త దాడిలో దేశ భద్రతకు పెనుముప్పు తప్పింది. రెండు వేర్వేరు ఇళ్లలో నుంచి మొత్తం 2,900 కిలోల పేలుడు పదార్థాలు, ఆయుధాలు, టైమర్లు, డిటొనేటర్లు, రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ పదార్థాలు దేశ వ్యాప్తంగా ఉగ్ర దాడుల కోసం సిద్ధం చేయబడ్డాయని దర్యాప్తు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

జమ్మూ–కాశ్మీర్‌లో గత నెలలో జైష్‌-ఎ-మొహమ్మద్‌ (JeM) ఉగ్ర సంస్థ తరఫున వెలసిన పోస్టర్లు ఈ కేసుకు మూలం అయ్యాయి. ఆ పోస్టర్లపై జరిగిన దర్యాప్తులో ఒక వైద్యుడి పేరు బయటపడటంతో పోలీసులు ఫరీదాబాద్‌కు చేరుకుని చేపట్టిన సంయుక్త ఆపరేషన్​లో సంచలన అంశాలను బయటపెట్టారు.

వైద్యుల ఇళ్లలో ‘బాంబ్‌ ఫ్యాక్టరీ’ — 2,900 కిలోల పేలుడు పదార్థాల స్వాధీనం

స్టెతస్కోపు, పక్కన ఏకే47 – విచిత్రమైన కలయిక. ఒకటి ప్రాణం పోసేది, ఇంకోటి ప్రాణం తీసేది

దర్యాప్తు ప్రకారం, డాక్టర్‌ ముజమ్మిల్ షకీల్‌ అనే వైద్యుడు ఫరీదాబాద్‌లోని అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీ లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అక్కడే పోలీసులు 350 కిలోల అమోనియం నైట్రేట్, రైఫిల్‌, పిస్టల్స్‌, కార్ట్రిడ్జ్‌లు, టైమర్లు, రసాయనాలు ఇంకా ఇతర సామగ్రిని కనుగొన్నారు.

డాక్టర్​ ఇచ్చిన సమాచారంతో పోలీసులు మరో ఇంటిపై దాడి చేసి 2,563 కిలోల పేలుడు పదార్థాలు కనుగొన్నారు. మొత్తం 2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వీటిని మూడు భారత నగరాలలో పెను విధ్వంసం సృష్టించడానికి వాడుదామనుకున్నట్లు ప్రాథమిక సమాచారం. పోలీసులు ముజమ్మిల్‌తో పాటు మరికొందరిని అరెస్ట్‌ చేశారు. వీరిలో లక్నోకు చెందిన మహిళా వైద్యురాలు డాక్టర్‌ షాహీన్‌, మరో వైద్యుడు డాక్టర్‌ అదీల్‌ రాథర్, కాశ్మీర్‌కు చెందిన ఇమామ్‌ మౌల్వీ ఇర్ఫాన్‌, అలాగే ముగ్గురు యువకులు — అరిఫ్‌ నిసార్‌ దార్, యాసిర్‌ అష్రఫ్, మక్సూద్‌ అహ్మద్‌ దార్ ఉన్నారు.

పోలీసులు వీరిని విచారించగా, విదేశీ హ్యాండ్లర్ల సూచనల మేరకు నిధులు సమీకరించి, పేలుడు పదార్థాలు సేకరించారని తేలింది. ఈ హ్యాండర్లు సుమారు 4 వేల వరకు ఉన్నట్లు తెలియడంతో నిఘావర్గాలు నివ్వెరపోయాయి.

జైష్‌, అన్సార్‌ ఘజ్వత్‌ ఉల్‌ హింద్‌ లింకులు — “విద్యావంతుల ఉగ్రవాదం” కొత్త ముప్పు

J&K Police Crack Transnational Terror Network, 2,900 Kg Explosives Recovered in Faridabad

పోలీసుల కథనం ప్రకారం, ఈ మాడ్యూల్‌ జైష్‌-ఎ-మొహమ్మద్‌ (JeM) మరియు అన్సార్‌ ఘజ్వత్‌ ఉల్‌ హింద్‌ (AGH) సంస్థలతో నేరుగా సంబంధం కలిగిఉంది. వీరు వైద్యులు, అధ్యాపకులు, విద్యార్థులు వంటి విద్యాధికుల నెట్‌వర్క్‌ను ఉపయోగించి నిధులు సమీకరించారు. “సామాజిక సేవ, దాతృత్వ కార్యక్రమాల” పేరుతో నిధులు  సేకరించి, వాటిని ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లించినట్టు విచారణలో తేలింది.

పోలీసులు దీనిని “వైట్‌ కాలర్‌ టెర్రర్‌ మాడ్యూల్‌” అని పేర్కొన్నారు. అంటే.. వృత్తినిపుణులు, విద్యావంతులు, సమాజంలో పేరున్న వ్యక్తులు ఉగ్ర నెట్‌వర్క్‌లకు కవర్‌గా పనిచేసే కొత్త విధానం. ఈ మాడ్యూల్‌ ద్వారానే పేలుడు పదార్థాల సరఫరా, రిక్రూట్‌మెంట్‌, నిధుల మార్పిడి, ఆన్‌లైన్‌ కమ్యూనికేషన్‌ అన్నీ జరిగాయని పోలీసులు తెలిపారు.

పోలీసులు అనేక రాష్ట్రాల్లో, శ్రీనగర్‌, అనంతనాగ్‌, గాండర్‌బల్‌, షోపియన్‌, సహారన్‌పూర్‌, ఫరీదాబాద్‌ వంటి ప్రాంతాల్లో ఒకేసారి దాడులు నిర్వహించారు. దాదాపు 15 రోజుల ఆపరేషన్‌ తర్వాత ఈ మొత్తం మాడ్యూల్‌ బయటపడింది. ఒక చిన్న సమాచారం ద్వారా ఇంత పెద్ద టెర్రర్​ నెట్​వర్క్​ను పోలీసులు బట్టబయలు చేయగలిగారు.

దేశ భద్రతా యంత్రాంగంలో అప్రమత్తత

Massive Cache of Arms, Ammunition Found in Faridabad — Terror Links Under Probe

ఈ ఘటనతో ఢిల్లీ–ఎన్‌సీఆర్ పరిసరాల్లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం అయ్యాయి. ఫోరెన్సిక్‌ నిపుణులు స్వాధీనం చేసిన పేలుడు పదార్థాలను పరీక్షిస్తున్నారు. పోలీసులు డిజిటల్‌ పరికరాలు, ఫోన్‌ డేటా, ల్యాప్‌టాప్‌ల నుంచి చాట్‌ లాగ్స్‌, ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ వివరాలను విశ్లేషిస్తున్నారు.

కేసు ప్రస్తుతం Unlawful Activities (Prevention) Act (UAPA) చట్టం, Explosive Substances Act, Arms Act కింద నమోదు అయింది. జమ్మూ–కాశ్మీర్‌ పోలీసులు, ఇంటెలిజెన్స్‌ బ్యూరో (IB), హర్యానా పోలీసులు కలిసి విచారణ కొనసాగిస్తున్నారు.

ఫరీదాబాద్‌ ఘటనతో దేశ భద్రతా సంస్థలు పెద్ద ముప్పును తప్పించాయి. వైద్యులు, అధ్యాపకులు వంటి వృత్తినిపుణులు కూడా ఉగ్రవాద నెట్‌వర్క్‌లలో పాల్గొనడం ఆందోళన కలిగించే విషయం. పోలీసులు ఈ మాడ్యూల్‌కు సంబంధించిన నిధుల మార్గాలు, విదేశీ సంబంధాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.