FIR ON NIRMALA SEETHARAM । ఎలక్టోరల్ బాండ్ల పేరిట నిర్బంధ డబ్బు వసూళ్లు.. నిర్మలా సీతారామన్‌పై ఎఫ్‌ఐఆర్
నిర్మల, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక బీజేపీ మాజీ అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్, బీవై యడ్యూరప్ప, ఈడీ ప్రతినిధులు తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నది. ఐటీ, ఈడీ తనిఖీలు నిర్వహించి, వారి నుంచి డబ్బు వసూళ్లు చేసేందుకు కుట్ర చేశారని ఫిర్యాదులో ఆరోపించింది.

FIR ON NIRMALA SEETHARAM । ఎలక్టోరల్ బాండ్ల (electoral bonds) విషయంలో ఎంత రచ్చ జరిగిందో దేశం చూసింది. సుప్రీంకోర్టు వాటిని రాజ్యాంగ వ్యతిరేకమంటూ రద్దు చేసింది. ఈడీ దర్యాప్తు ఎదుర్కొన్న చాలా సంస్థలు బీజేపీకి ఎలక్టోరల్ బాండ్ల పేరిట దక్షిణలు సమర్పించుకున్న అంశాలు బయటకు వచ్చాయి. ఎలక్టోరల్ బాండ్లపేరుతో బీజేపీ దోచుకున్నదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయికూడా. ఇదిలా ఉంటే.. ఎలక్టోరల్ బాండ్ల పేరుతో తమ నుంచి బలవంతంగా డబ్బు వసూలు చేశారని దాఖలైన ఫిర్యాదులో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్, మరికొందరిపై కేసు నమోదైంది. ఎలక్టోరల్ బాండ్ల ముసుగులో సీతారామన్, మరికొందరు నిర్బంధ డబ్బు వసూళ్లకు పాల్పడ్డారంటూ ఆదర్శ్ అయ్యర్ (Adarsh Iyer) అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా నిర్మలపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని ప్రత్యేక కోర్టు బెంగళూరు పోలీసులను ఆదేశించింది. నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఎలక్టోరల్ బాండ్ల పేరుతో నిర్మలా సీతారామన్, ఆమె శాఖ నిర్బంధంగా డబ్బు వసూలు చేశారని జనాధికార సంఘర్ష సంఘటనె (Janaadhikara Sangharsha Sanghatane) కు చెందిన ఆదర్శ్ అయ్యర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసును విచారించిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు (The Special Court for People’s Representatives).. నిర్మలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని తిలక్ నగర్ పోలీసులను ఆదేశించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆమె పార్టీకి లాభం కలిగించేలా నిర్మలా సీతారామన్ తన ఆర్థిక శాఖను (finance minister) దుర్వినియోగం (misusing) చేశారని అయ్యర్ ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్ల పథకమే పెద్ద కుంభకోణమని ఆయన న్యూస్18కు చెప్పారు. డబ్బు వసూళ్లు ఎలా సాగాయో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అప్‌లోడ్ చేసిన వివరాలు స్పష్టంగా చెబుతున్నాయని అయ్యర్ అన్నారు. తాము వివిధ పోలీస్ స్టేషన్లలో 15, 16 ఫిర్యాదులు దాఖలు చేశామని, ప్రస్తుతానికి ఒక కేసును ఫాలోఅప్ చేస్తున్నామని అయ్యర్ తెలిపారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ దాఖలుకు తిలక్ నగర్ పోలీసులను కోర్టు ఆదేశించిందని చెప్పారు.
ఎలక్టోరల్ బాండ్ల రాజ్యాంగ వ్యరేకమని తేల్చి చెబుతూ 2024 ఫిబ్రవరిలో దానిని సుప్రీంకోర్టు (Supreme Court) రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎలక్టోరల్ బాండ్లు ఎవరు ఎవరికి ఇచ్చారనే విషయాలు బయటపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పుడు ఎస్‌బీఐ (State Bank of India) దానిని సాగదీసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అప్పటికి లోక్‌సభ ఎన్నికలు ముందుకు వచ్చాయి. ఆ ఎన్నికలు పూర్తయ్యాక ఆ వివరాలు ఇస్తామని చెప్పి తప్పించుకునేందుకు ఎస్‌బీఐ ప్రయత్నించినా.. సుప్రీంకోర్టు ససేమిరా అనడంతో వివరాలు బయటపెట్టాల్సి వచ్చింది. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, ఈడీ దర్యాప్తును ఎదుర్కొన్న కంపెనీలు, వ్యక్తుల నుంచి బీజేపీ పెద్ద మొత్తంలో బాండ్లు వెళ్లాయి. విరాళం ఇచ్చిన వ్యక్తి లేదా సంస్థ పేరు బాండ్లతో బయటకు రాదు. దీంతో రాజకీయాల్లో కార్పొరేట్ శక్తుల జోక్యం, ప్రభావంపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
తాజాగా నిర్మలా సీతారామన్‌పై ఎఫ్‌ఐఆర్‌కు దారి తీసిన ఈ ఫిర్యాదును జేఎస్‌పీ 2024 ఏప్రిల్‌లోనే బెంగళూరులోని 42వ ఏసీఎంఎం కోర్టులో సమర్పించింది. నిర్మల, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక బీజేపీ మాజీ అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్, బీవై యడ్యూరప్ప, ఈడీ ప్రతినిధులు తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నది. ఐటీ, ఈడీ తనిఖీలు నిర్వహించి, వారి నుంచి డబ్బు వసూళ్లు చేసేందుకు కుట్ర చేశారని ఫిర్యాదులో ఆరోపించింది.