తన గౌరవాన్ని కాపాడుకునే బాధ్యత సుప్రీంకోర్టుదే

ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు సమర్పించేందుకు ఎస్‌బీఐ గడువు కోరడాన్ని పిల్ల చేష్టగా రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌ అభిర్ణించారు

తన గౌరవాన్ని కాపాడుకునే బాధ్యత సుప్రీంకోర్టుదే

ఎలక్టోరల్‌ బాండ్ల వివరాల సమర్పణకు ఎస్‌బీఐ గడువు కోరడంపై సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌

న్యూఢిల్లీ: ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు సమర్పించేందుకు ఎస్‌బీఐ గడువు కోరడాన్ని పిల్ల చేష్టగా రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌ అభిర్ణించారు. తన గౌరవాన్ని కాపాడుకునే బాధ్యత సుప్రీంకోర్టుదేనని చెప్పారు. రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించిన తర్వాత బ్యాంకు విజ్ఞప్తిని ఆమోదించం అంత సులభం కాదని అన్నారు. ఎలక్టోరల్‌ బాండ్ల వివరాల సమర్పణకు గడువు కావాలని ఎస్‌బీఐ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. గతంలో పిటిషనర్ల తరఫున వాదించిన సిబల్‌.. ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు బహిర్గతం చేయడానికి కొన్ని వారాలు పడుతుందని ఎస్‌బీఐ చెప్పడాన్ని గమనిస్తే.. ఎవరో ఎవరినో కాపాడటానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఒక వార్తా సంస్థకు ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రభుత్వాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఎస్‌బీఐ ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతున్నదని సిబల్‌ చెప్పారు. ఏప్రిల్‌-మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగబోతుంటే.. జూన్‌ 30 వరకు గడువు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేయడం అందుకేనని అన్నారు.


గత నెలలో ఎలక్టోరల్‌ బాండ్ల స్కీంను రద్దు చేసిన సుప్రీంకోర్టు.. రాజకీయ పార్టీలు ఎన్‌క్యాష్‌ చేసుకున్న ప్రతి ఒక్క ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను సమర్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే.. తక్కువకాలంలో ఆ వివరాలు బయటపెట్టడం సాధ్యం కాదని ఎస్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించనున్న నేపథ్యంలో సిబల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎస్‌బీఐపై కోర్టు ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్‌పైనా సోమవారం విచారణ జరుగనున్నది.

ఏప్రిల్‌- మే నెలల్లో ఎన్నికలు జరుగనున్న రీత్యా ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను బహిర్గతం చేస్తే.. ప్రజల్లో ఆ అంశంపై చర్చ జరుగుతుందని ఎస్‌బీఐకి తెలుసని సిబల్‌ అన్నారు. ‘వారు సమయం కోరుతున్నారు. అందుకు కారణాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. వాటన్నింటినీ కోర్టు పరిశీలిస్తుందని నేను నమ్ముతున్నాను. ఫైళ్లన్నింటినీ పరిశీలించి ఎవరు ఎవరికి డబ్బులు ఇచ్చారో అప్పుడు తేల్చుతామని ఎస్‌బీఐ చెప్పడం పిల్ల చేష్ట. ఇది 21వ శతాబ్దం. మన ప్రియతమ ప్రధాని అన్నింటా డిజిటలైజేషన్‌ గురించి మాట్లాడుతుంటారు’ అని సిబల్‌ అన్నారు.