నేను.. జెన్ జీ అంటూ ఆర్మీకి యువతి బెదిరింపు..వైరల్ వీడియో !

లద్దాఖ్‌ మీనామార్గ్‌ చెక్‌పోస్టు వద్ద ఆర్మీ సిబ్బందితో ‘నేను జెన్‌ జీ’ అంటూ ఓ యువతి వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్‌గా మారింది. ఘటనపై వీకే సింగ్‌, ఒమర్‌ అబ్దుల్లా స్పందించారు.

లద్దాఖ్ మీనామార్గ్ చెక్ పోస్టులో భద్రతా సిబ్బందిలో ఓ యువతి నేను జెన్ జీ అంటూ బెదిరింపులతో వాగ్వివాదానికి దిగిన వీడియో వైరల్ గా మారింది. మీనా మార్గ్ చెక్ పోస్టు వద్ద గంటల పాటు వాహనాలను భద్రతా సిబ్బంది నిలిపివేశారు. ఓ యువ పర్యాటకురాలు వాహనాలు ఎందుకు గంటల పాటు నిలిపివేశారని..దీంతో కుటుంబాలు, చిన్న పిల్లలతో ప్రయాణిస్తున్న వారు ఇబ్బంది పడుతున్నారని వాగ్వివాదానికి దిగారు. తాము ‘జెన్‌ జీ’తరానికి చెందిన వారమని, ఇలాంటి పరిస్థితులను అస్సలు సహించబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం భద్రతాధికారుల కాన్వాయ్‌ అక్కడికి రావడంతో, ఆమెను రోడ్డు పక్కకు వెళ్లాలని భద్రతా సిబ్బంది సూచించారు. రహదారిని కేవలం వీఐపీ కాన్వాయ్‌ కోసమే మూసివేశారని సదరు పర్యాటకురాలు ఆరోపించినట్లు సమాచారం. అయితే ఆ ఆరోపణలు ఎంత వరకు నిజమనేది తెలియారాలేదు. అయితే మీనామార్గ్‌-జోజిలా మార్గంలో భద్రత, ప్రతికూల వాతావరణం, రోడ్డు పరిస్థితుల కారణంగావాహనాల రాకపోకలను నియంత్రించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

ఈ ఘటనపై ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ వీకే సింగ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. భద్రతా సిబ్బందిపై విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. దేశాన్ని కాపాడే రక్షణ కవచంగా సాయుధ బలగాలు పనిచేస్తున్నాయని,సైనికులను అన్యాయంగా నిందించడం, నిరాధార ఆరోపణల చేయడం సరికాదన్నారు. దేశం కోసం త్యాగాలు చేస్తున్న సైనికులకు తాము అండగా ఉంటామని చెప్పారు. మరోవైపు ఆర్మీ సిబ్బందిని తాను జెన్ జీ అంటూ ఓ యువతి బెదిరించిన వైరల్ వీడియోపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఘాటుగా స్పందించారు. ఇదో కొత్త రకం బెదిరింపు అని వ్యాఖ్యానించారు. పాత రోజుల్లో కొందరు రాజకీయ నాయకుల పిల్లలు ‘నా తండ్రి ఎవరో నీకు తెలుసా? అంటూ బెదిరింపులకు దిగేవారని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ ‘మేము జెన్-జీ’ అనేది ఒక కొత్త రకం బెదిరింపుగా మారిందని ఎద్దేవా చేశారు.

Latest News