ఆ కుటుంబాలకు 30 లక్షల పరిహారం.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు

- డ్రైనేజీ క్లీన్ చేస్తూ చనిపోయినవారి
- కుటుంబాలకు చెల్లించాలి
- ఆరోగ్యం దెబ్బతిన్నవారికి 20 లక్షలు
విధాత: మురుగునీటి డ్రైనేజీలు శుభ్రం చేసే క్రమంలో చనిపోయినవారి కుటుంబాలకు 30 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. డ్రైనేజీలు శుభ్రం చేసే సమయంలో అస్వస్థతకు గురై శాశ్వత వైకల్యాల బారినపడినవారికి కనీస పరిహారం కింద 20 లక్షల రూపాయల చొప్పున చెల్లించాలని జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
దేశంలో పారిశుధ్య కార్మికుల దీన స్థితిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. మనుషులు అశుద్ధాలను తొలగించే పద్ధతిని శాశ్వతంగా నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ధర్మాసనం పేర్కొన్నది. ఇతరత్రా అనారోగ్యానికి గురైన పారిశుధ్య కార్మకులకు పది లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
ఈ మేరకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వ సంస్థలు సమన్వయం చేసుకోవాలని ఆదేశించింది. పారిశుధ్య కార్మికుల మరణాలకు సంబంధించిన కేసులలో పర్యవేక్షణకు హైకోర్టులు చొరవచూపాలని పేర్కొన్నది. ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో సుప్రీం కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
అయితే.. పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉన్నది. గడిచిన ఐదేళ్లలో దేశంలో 347 మందికిపైగా పారిశుధ్య కార్మికులు డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేస్తున్న సమయంలో అస్వస్థతకు గురై చనిపోయారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీల్లోనే 40శాతం మంమది చనిపోయారని 2022 జూలైలో లోక్‌సభకు సమర్పించిన వివరాలను బట్టి తెలుస్తున్నది.