సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ అమలు: ధరలు తగ్గేవి, పెరిగేవి ఇవే…
జీఎస్టీ కొత్త స్లాబులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న నాలుగు స్లాబులు ఇక నుంచి రెండు స్లాబులుగా మారాయి

విధాత: జీఎస్టీ కొత్త స్లాబులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న నాలుగు స్లాబులు ఇక నుంచి రెండు స్లాబులుగా మారాయి. గతంలో 5 , 12, 18, 28 శాతం జీఎస్టీ వసూలు చేసేవారు. సోమవారం నుండి (సెప్టెంబర్ 22) నుంచి 5, 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. లగ్జరీ వస్తువులపై 40 శాతం జీఎస్టీ విధిస్తారు. జీఎస్టీ స్లాబుల్లో మార్పులతో నిత్యావసర సరుకులు, మెడికల్, వైద్య పరికరాలు, ఏసీలు, టీవీల వంటి ధరలు తగ్గుతాయి. దుస్తులు, 350 సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైకుల ధరలు కూడా తగ్గుతాయి. లగ్జరీ కార్ల ధరలు పెరుగుతాయి. ఇతర కార్ల ధరలు తగ్గుతాయి. జీఎస్టీ రేట్లు తగ్గే అవకాశం ఉన్నందున గత రెండు వారాలుగా అమ్మకాలు తగ్గిపోయాయని వ్యాపారులు అంటున్నారు.ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, పరికరాలు, వంటగదిలో ఉపయోగివంచే సరుకులు, వస్తువుల మందులు సహా దాదాపు 375 వస్తువులు చౌకగా లభిస్తాయి.
ధరలు తగ్గేవి ఇవే….
పాలు, కాఫీ, కండెన్స్‌డ్ మిల్క్, బిస్కెట్లు, వెన్న, తృణధాన్యాలు, కార్న్ ఫ్లేక్స్, 20-లీటర్ బాటిళ్లలో ప్యాక్ చేసిన తాగునీరు, డ్రై ఫ్రూట్స్, పండ్ల గుజ్జు లేదా పండ్ల రసం, నెయ్యి, ఐస్ క్రీం, జామ్ పండ్ల జెల్లీలు, కెచప్, , పన్నీర్, , సాసేజ్,మరియు మాంసం, ఆఫ్టర్-షేవ్ లోషన్, ఫేస్ క్రీమ్, ఫేస్ పౌడర్, హెయిర్ ఆయిల్, షాంపూలు, షేవింగ్ క్రీమ్, టాల్కమ్ పౌడర్, టూత్ బ్రష్, టాయిలెట్ సబ్బు బార్‌లు వంటి ఇతర రోజువారీ వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది.
ఎలక్ట్రానిక్స్‌లో ఎయిర్ కండిషనర్లు , డిష్‌వాషర్లు, టెలివిజన్లు,వాషింగ్ మెషీన్లు ఉన్నాయి. మందుల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయి. డయాగ్నోస్టిక్ కిట్లు, గ్లూకోమీటర్లు వంటి వైద్య పరికరాలపై జీఎస్టీ 5 శాతానికి తగ్గింది. దీంతో వీటి ధరలు కూడా తగ్గుతాయి. అందం కోసం ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులపై కూడా జీఎస్టీ తగ్గింది. బార్బర్ దుకాణాలు, ఫిట్ నెస్ సెంటర్లు, హెల్త్ క్లబ్ లలో ఉపయోగించ వస్తువులపై జీఎస్టీ తగ్గించారు. దీంతో వీటి సేవలు కూడా తగ్గుతాయయి. సిమెంట్ పై ఉన్న 28 శాతం జీఎస్టీ 18 శాతానికి తగ్గింది. దీంతో సిమెంట్ ధరలు తగ్గుతాయి. తద్వారా నిర్మాణ రంగం మరింత ఉపాధికి ఛాన్స్ ఉంది. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తర్వాత కొన్ని సంస్థలు ముందుగానే తమ సరుకులు, వస్తువుల ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. హార్లిక్స్, లక్స్, లైఫ్ బాయ్ , కిసాన్ జామ్, డవ్ వంటి ప్రముఖ బ్రాండ్లను తయారు చేసే హిందూస్తాన్ యూనిలీవర్ సంస్థ తమ వస్తువులను ధరలను తగ్గించనున్నట్టు తెలిపింది. 340 ఎం.ఎల్ డవ్ షాంప్ బాటిల్ గతంలో రూ.490కి విక్రయించేవారు. ఇప్పుడు అది రూ. 435కు లభిస్తోంది.200 గ్రాముల హార్లిక్స్ గతంలో రూ. 130. ఇప్పుడు రూ. 20 తగ్గింది. అంటే రూ. 110కి దొరుకుతుంది. ఇక కార్లపై ఉన్న 28 శాతం జీఎస్టీ 18 శాతానికి తగ్గనుంది. దీంతో పలు ప్రముఖ కార్ల కంపెనీలు తమ కార్ల ధరలను తగ్గించాయి. అమూల్ సంస్థ 700 ఉత్పత్తులపై ధరలు తగ్గించింది.
ధరలు పెరిగేవి ఇవే….
కూల్ డ్రింక్స్ ధరలు పెరుగుతాయి. కార్బోనేటేడ్ పానీయాలపై జీఎస్టీని 28 నుంచి 40 శాతానికి పెంచాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆల్కహాల్ లేని పానీయాల ధరలు పెరుగుతాయి. చక్కెర లేదా ఇతర తీపి పదార్ధాలు, లేదా తీపి ఫ్లేవర్ కలిగిన వాటి ధరలను 28 నుంచి 40 శాతానికి పెంచారు. 1200 సిసి , 1500 సిసి కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న పెట్రోల్, డీజీల్ వవాహనాల ధరలు పెరుగుతాయి. 350 సిసి కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లు, పడవలు, వ్యక్తిగత ఉపయోగం కోసం వినియోగించే విమానాలు, రేసింగ్ కార్లు, స్మోకింగ్ పైపులు, బీడీలు, సిగరెట్లు, పాన్ మసాలా, పొగాకు, పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ 40 శాతం పెంచారు.
వస్తువులు, సరుకుల వినియోగం పెరిగేనా?
జీఎస్టీ నాలుగు స్లాబ్ లను రెండు స్లాబ్ లుగా మార్చడంతో వస్తువులు, సరుకుల వినియోగం పెరుగుతోందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వినియోగం పెంచడం ద్వారా మార్కెట్లో డబ్బులు చలామణి అవుతాయి. ప్రస్తుతం పండుగ సీజన్, దసరా, దీపావవళి పండుగలు త్వరలోనే వస్తాయి. ఈ సమయంలో ప్రజలు ఎక్కువగా వస్తువులు కొనుగోలు చేస్తారు. జీఎస్టీ తగ్గించడంతో వినియోగం పెరుగుతోందనేది ప్రభుత్వ భావనగా కనిపిస్తోంది. కొత్త జీఎస్టీ ద్వారా భారతదేశ జీడీపీకి 0.7-0.8 శాతం పాయింట్లను జోడించే అవకాశం ఉందని ఆర్ధిక వేత్తలు అంచనా వేస్తున్నారు. సబ్బులు, స్నాక్స్, ప్యాక్ చేసిన ఆహారం ధరలు తగ్గడంతో వినియోగం పెరిగే అవకాశం ఉంది. కార్లు, ఏసీలు, టీవీల ధరలు తగ్గుతాయి. అయితే వీటి కొనుగోలు కూడా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.