ASI Sandeep Kumar : హర్యానాలో ఏఎస్సై సందీప్ ఆత్మహత్య!

హర్యానాలో ఏఎస్సై సందీప్ ఆత్మహత్య. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని సూసైడ్ నోట్, వీడియోలో ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్‌పై అవినీతి ఆరోపణలు నిజం కోసం జీవిత త్యాగం అన్న సందీప్.

ASI Sandeep Kumar : హర్యానాలో ఏఎస్సై సందీప్ ఆత్మహత్య!

న్యూఢిల్లీ : హర్యానాలో మరో పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం ఏఎస్సై సందీప్ ఆత్మహత్య చేసుకున్నారు. తన సర్వీస్ రివాల్వర్‌తో పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్చుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. సందీప్ కుమార్ ఇటీవల కులవివక్షతో కూడిన వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్‌పై అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రోహ్‌తక్‌ సైబర్ విభాగంలో పని చేస్తున్న సందీప్ సూసైడ్ చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూరన్‌ కుమార్‌పై ఉన్న ఓ అవినీతి కేసును ఆయన దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పూరన్‌ కుమార్‌పై తన సూసైడ్‌ నోట్‌లో ఆరోపణలు చేశారు. నిజాలు వెలుగులోకి రావడం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నట్లు రాశారు.

ఇప్పటికే పూరన్ ఆత్మహత్య కేసుకు సంబంధించి వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ శత్రుజీత్‌ కపూర్‌ను రాష్ట్ర ప్రభుత్వం సెలవుపై పంపించిన సంగతి తెలిసిందే. ఈ బాధ్యతలను తాజాగా ఓం ప్రకాశ్‌ సింగ్‌కు అప్పజెప్పింది. ఈ కేసుకు సంబంధించి రోహ్‌తక్‌ ఎస్పీ నరేంద్ర బిజర్నియాను ఇటీవల బదిలీ చేసింది. ఈ కేసులో ఎనిమిది మంది అధికారుల పేర్లను చేర్చారు. ఈ క్రమంలో ఏఎస్సై సందీప్ ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది.