జార్ఖండ్ అసెంబ్లీ విశ్వాసం పొందిన హేమంత్ సొరేన్ సర్కార్
జేఎంఎం నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. సంఖ్యాబలం విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉండటంతో ప్రతిపక్షం ముందే వాకౌట్ చేసింది

రాంచీ: జేఎంఎం నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. సంఖ్యాబలం విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉండటంతో ప్రతిపక్షం ముందే వాకౌట్ చేసింది. నామినేటెడ్ సభ్యుడు జోసెఫ్ పీ గలాస్టావున్ సహా 45 మంది సొరేన్‌కు మద్దతు పలికారు. ఓటింగ్ నిర్వహించే ముందు బీజేపీ, ఏజేఎస్‌యూ వాకౌట్ చేశాయి. ప్రతిపక్ష కూటమిలో బీజేపీకి 24 మంది, ఏజేఎస్‌యూ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
అంతకు ముందు ఎమ్మెల్యే భాను ప్రతాప్ సాహి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ రబీంద్రనాథ్ మహతోను కోరారు. అయితే.. స్పీకర్ అందుకు నిరాకరించారు. ఓటింగ్ సమయంలో సభలో 75 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. స్వతంత్ర సభ్యుడు సరయు రాయ్ ఓటింగ్‌లో పాల్గొనలేదు. అధికార పక్షంలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఉన్నాయి. ఒకే సభ్యుడు ఉన్న సీపీఐ ఎంఎల్ లిబరేషన్ బయటి నుంచి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నది.
81 మంది సభ్యులు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎం నాయకత్వంలోని కూటమి బలం లోక్‌సభ ఎన్నికల తర్వాత 45కు తగ్గింది. ఇందులో జెఎంఎంకు 27 మంది, కాంగ్రెస్‌కు 17, ఆర్జేడీకి 1 ఎమ్మెల్యే ఉన్నారు. ఇద్దరు జేఎంఎం ఎమ్మెల్యేలు నళిన్ సొరేన్, జోబా మాఝీ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మరో ఎమ్మెల్యే సీతా సొరేన్ బీజేపీ టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలను జేఎంఎం బహిష్కరించింది.
మరోవైపు బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలవడంతో పార్టీ సభ్యుల సంఖ్య 24కు తగ్గింది. మరో ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరడంతో ఆయనను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది. దీంతో 81 మంది సభ్యులు ఉండాల్సిన సభలో.. 76 మంది ఉన్నారు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన హేమంత్ సొరేన్.. రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా జూలై 4న ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తన ప్రభుత్వ బలాన్ని సోమవారం నిరూపించుకున్నారు.