దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మాలవీయ నగర్‌లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో మంటలు చెలరేగిన ఘటనలో 20 మంది మృతి చెందారు. మృతుల్లో చాలామంది విదేశీయులు ఉన్నారని అధికారులు తెలిపారు.పలువురికి గాయాలు కాగా..క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది మరో 35 మందిని కాపాడారు. మరో 30 మందికిపైగా మంటల్లో చిక్కుకొని ఉంటారని సమాచారం. 10ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

రెస్టారెంట్ బేస్ మేంట్ ఏరియాలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఎంట్రీ, ఎగ్జీట్ ఒకే చోట ఉండటంతో ప్రమాదం నుంచి బాధితులు తప్పించుకోడం కష్టతరమైంది. రెస్టారెంట్ భవనం నిర్మాణంలో.. అగ్నిప్రమాదాల సందర్బంగా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు పాటించకపోవడంతో ప్రాణ నష్టం అధికమవ్వడానికి కారణమైందని అధికారులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియచేస్తూ..క్షతగాత్రులు త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.