Eknath Shinde | బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసు: శివసేన ఉప నేతను తప్పించిన ఏక్‌నాథ్ షిండే
శివసేన మహారాష్ట్ర ఉపనేతపై వేటు పడింది. రాజేష్ షాను ఆ పదవి నుంచి తప్పిస్తూ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నిర్ణయం తీసుకున్నారు. రాజేశ్ షా కుమారుడు మిహిర్ షా బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు

ముంబై: శివసేన మహారాష్ట్ర ఉపనేతపై వేటు పడింది. రాజేష్ షాను ఆ పదవి నుంచి తప్పిస్తూ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నిర్ణయం తీసుకున్నారు. రాజేశ్ షా కుమారుడు మిహిర్ షా బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజేష్ షాను బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు పార్టీ ఏకవాక్య ప్రకటనను బుధవారం విడుదల చేసింది. ఆ ప్రకటనలో ఎలాంటి ఇతర వివరాలు పొందుపర్చలేదు. మిహిర్‌షాకు మద్యం సరఫరా చేసిన జుహులోని బార్ కొంత భాగాన్ని అక్రమ కట్టడంగా పేర్కొంటూ బీఎంసీ అధికారులు బుధవారం నేలమట్టం చేసిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకున్నది. నిర్దిష్ట అనుమతులు లేకుండా, అక్రమ నిర్మాణంలో బార్‌ను కొనసాగిస్తున్నందుకు దాని నిర్వాహకులపై చర్యలకు కూడా బృహన్ముంబై అధికారులు సిద్ధమవుతున్నారు.
మహారాష్ట్రలో 25 ఏళ్లలోపు వ్యక్తులకు మద్యం విక్రయించకూడదు. మిహిర్‌షాకు 23 ఏళ్లు. కానీ.. వైస్ గ్లోబల్ తప్పస్ బార్ ఆయనకు మద్యం సరఫరా చేసింది. ఈ నేపథ్యంలో బార్ లైసెన్స్‌ను రాష్ట్ర ఎక్సయిజ్ అధికారులు సస్పెండ్ చేశారు. తదుపరి విచారణ వరకూ బార్‌ను సీజ్ చేశారు. డాన్ గియోవన్నీ రెస్టారెంట్ పేరుతో లైసెన్స్ తీసుకుని, క్యాష్ రిసిప్ట్ పై మాత్రం వైస్ గ్లోబల్ తపస్ బార్ పేరుతో ఇవ్వడం సహా పలు అక్రమాలను అధికారులు గుర్తించారు.
తన బీఎండబ్ల్యూ వాహనంతో ఒక టూవీలర్‌ను మిహిర్ మద్యం మత్తులో ఢీకొన్నాడు. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న 45 ఏళ్ల కావేరి నర్ఖా చనిపోయారు. ఆమె భర్త గాయపడ్డాడు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత మంగళవారం మిహిర్‌ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన తర్వాత 72 గంటలపాటు మిహిర్ అజా లేకుండా పోయాడు. అయితే.. అతని స్నేహితుడు 15 నిమిషాలపాటు మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆన్ చేయడంతో ట్రాక్ చేసిన పోలీసులు.. మిహిర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కాలానగర్ ఏరియాలో ఘటన జరిగిన అనంతరం ఒక ఆటోలో గోరేగావ్‌లోని తన గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి మిహిర్ వెళ్లిపోయాడు. ఆమె మిహిర్ సోదరికి ఫోన్ చేయడంతో ఆమె గోరేగావ్ వచ్చి మిహిర్‌ను, అతడి స్నేహితురాలిని తమ బొరివాలి నివాసానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మిహిర్ కుటుంబం ఠాణె జిల్లాలోని షాహాపూర్‌లోని ఒక రిసార్టుకు ఆడి కారులో పారిపోయారు. ఆ రిసార్టులో మిహిర్, అతడి తల్లి మీనా, సోదరిణిలు కింజాల్, పూజ, మరో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. మిహిర్ వెంట ఉన్న స్నేహితుల్లో ఒకరిని గుర్తించిన పోలీసులు.. అతడి నంబర్‌ను ట్రాక్ చేశారు. కానీ.. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తూనే ఉన్నది. కానీ.. సోమవారం సాయంత్రం అతడు, మిహిర్ కలిసి.. షాహాపూర్ నుంచి విరార్‌కు చేరుకున్నారు. అక్కడ మిహిర్ స్నేహితుడు 15 నిమిషాలపాటు ఫోన్‌ను ఆన్ చేయడంతో పోలీసులు వెంటనే ట్రాక్ చేసి.. వారిని జాడలు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.
మిహిర్ షాకు జూలై 16 వరకు పోలీస్ కస్టడీ
హిట్ అండ్ రన్ కేసులో అరెస్టయిన శివసేన నేత రాజేశ్ షా కుమారుడు మిహిర్‌షాకు ముంబై కోర్టు ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. అంటే.. జూలై 16 వరకు అతడు పోలీసుల కస్టడీలో ఉంటాడు. ఘటన జరిగిన అనంతరం మిహిర్‌కు ఎవరెవరు సహకరించారు? దాదాపు మూడు రోజులపాటు రహస్యంగా ఉండటంలో ఎవరి సహాయం ఉన్నది? అనే అంశాలు తాము మిహిర్‌నుంచి తెలుసుకోవాల్సి ఉన్నదని ముంబై పోలీసులు కోర్టును అభ్యర్థించారు. నిందితుడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నదో లేదో కూడా తెలుసుకోవాల్సి ఉన్నదని పేర్కొన్నారు. ఘటన అనంతరం తొలగించిన కారు నంబర్ ప్లేటును సైతం తాము కనుగొనాల్సి ఉన్నదని తెలిపారు.