ఆరో దశలో హీరో ఎవరు?.. యూపీలో బీజేపీకి త్రిముఖ పోరు కలవరం

సార్వత్రిక ఎన్నికల సమరంలో ఆరో దశ పోలింగ్‌ శనివారం జరగనున్నది. ఇప్పటివరకు ముగిసిన ఐదు దశల పోలింగ్‌లో 25 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 428 స్థానాలకు పోలింగ్‌ పూర్తయింది.

ఆరో దశలో హీరో ఎవరు?.. యూపీలో బీజేపీకి త్రిముఖ పోరు కలవరం

8 రాష్ట్రాలు, యూటీల్లో పోలింగ్‌
ఢిల్లీలో 7, హర్యానాలో 10 సీట్లు సహా
58 నియోజకవర్గాల్లో ఢీ అంటే ఢీ
ఇందులో 29 ఎన్డీయే సిటింగ్ స్థానాలు
హర్యానాలో మారిన రాజకీయ సమీకరణాలు
ఢిల్లీ, జార్ఖండ్‌లో ఢీ అంటున్న ఇండియా కూటమి
ఎన్డీఏ తన పట్టు నిలుపుకొంటుందా?
ఇండియా కూటమి సత్తా చాటుతుందా?

(విధాత ప్రత్యేకం)

సార్వత్రిక ఎన్నికల సమరంలో ఆరో దశ పోలింగ్‌ శనివారం జరగనున్నది. ఇప్పటివరకు ముగిసిన ఐదు దశల పోలింగ్‌లో 25 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 428 స్థానాలకు పోలింగ్‌ పూర్తయింది. శనివారం 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 58 స్థానాలను కలిపితే ఆ సంఖ్య 486కు చేరుతుంది. ఢిల్లీ, హర్యానాలోని అన్ని స్థానాలతో పాటు యూపీలోని బీజేపీ, ఎస్పీ అడ్డాల్లో జరిగే 14 స్థానాలపై ఆసక్తి నెలకొన్నది.

వీటిలో 2019 ఎన్నికల్లో బీజేపీ.. ఢిల్లీ, హర్యానాలోని మొత్తం 7/7, 10/10 స్థానాలతోపాటు యూపీలోని 14/ 9, జార్ఖండ్‌లో 4/3 చోట్ల విజయం సాధించింది. తిరిగి ఈ స్థానాలను నిలబెట్టుకోవాలని బీజేపీ బాగా శ్రమిస్తున్నది. కానీ బీజేపీని నిలువరించి ఇండియా కూటమి బలాన్ని చూపెట్టాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో యూపీ, ఢిల్లీ, జార్ఖండ్‌లలో శనివారం జరుగబోయే పోలింగ్‌ ఎలా ఉండబోతున్నది? ప్రజలు మార్పు కోరుకుంటారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

యూపీలో త్రిముఖ పోరుతో కాషాయపార్టీలో కలవరం

కుల మతాల ప్రభావం గణనీయంగా ఉండే యూపీలోని ఈ 14 స్థానాల్లో గత ఎన్నికల్లో బీజేపీ 9, బీఎస్పీ 4, ఎస్పీ ఒక స్థానం గెలుచుకున్నాయి. యూపీలోని అంబేద్కర్‌నగర్‌, లాల్‌గంజ్‌, జూన్‌పూర్‌, శావస్తీలను 2019లో బీఎస్పీ గెలుచుకున్నది. వీటితోపాటు ఫూల్‌పుల్‌, సంత్‌ కబీర్‌లలో బీజేపీ, ఎస్పీలకు బీఎస్పీ గట్టి బరిలో ఉండటంతో ఈ ఆరుచోట్ల త్రిముఖ పోరు నెలకొన్నది. అలాగే యూపీలో ఎస్పీ కంచుకోట ఆజంగఢ్‌, బీజేపీకి పట్టున్న మేనకాగాంధీపోటీ చేస్తున్న సుల్తాన్‌పూర్‌ వంటి నియోజకవర్గాలు ఈ దశలో ఓటరు తీర్పు కోరబోతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలు, 2022లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పరోక్షంగా బీజేపీకి సహకరించిందనే విమర్శలున్నాయి. అందుకే బీఎస్పీ 10 లోక్‌సభ సీట్లను గెలుచుకున్నదనే వాదనలున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ 12.88 శాతం ఓట్లతో 1 సీటు మాత్రమే గెలుచుకున్నది. ఆర్‌ఎల్డీ 2.85 శాతం ఓట్లతో 8 స్థానాలను గెలుచుకోగా, ఎంఐఎం 0.49 శాతం ఓట్లు సంపాదించినా అవి పరోక్షంగా ఎస్పీ ఓటమికి కారణమై, కాషాయపార్టీకి లబ్ధి చేకూర్చాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కానీ సార్వత్రిక ఎన్నికల సమయానికి పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా యూపీలో ఇండియా కూటమిలో ఉన్న ఆర్‌ఎల్‌డీని బీజేపీ తనవైపు తిప్పుకొన్నది. కానీ ఆ పార్టీ ప్రస్తుతం బీజేపీతో అంటీ ముట్టనట్టే ఉన్నది. బీఎస్పీ తన అస్థిత్వం కోసం పోరాడుతున్నది. ఎంఐఎం బీజేపీ బీ టీం అని ఎస్పీ, కాంగ్రెస్‌ చాలాకాలంగా ఆరోపిస్తున్నాయి. దీంతో ఆ పార్టీ ప్రభావం అక్కడ ఈసారి ఉండకపోవచ్చు అంటున్నారు.

మేనకాగాంధీ తన కుమారుడు వరుణ్‌గాంధీకి ఫిలిభిత్‌ నియోజకవర్గ టికెట్‌ పార్టీ అధిష్ఠానం నిరాకరించడంతో తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. దీంతో ఆమె పోటీ చేస్తున్న సుల్తాన్‌పూర్‌ ప్రచారానికి బీజేపీ అగ్రనాయకులంతా దూరంగా ఉన్నారు. యూపీ సీఎం ఆమె తరఫున ఒక్క ఖాజీపుర్‌ సభలో మాత్రమే పాల్గొన్నారు. మేనకాగాంధీ అన్నీ తానై చూసుకుంటున్నారు. ఇక్కడ గత ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్న బీఎస్పీ, ఎస్పీ రంగంలో ఉండటంతో పోటీ తీవ్రంగా ఉన్నది. ప్రచారం చివరిరోజు గురువారం వచ్చి కులమతాలకు అతీతంగా అందరి సమస్యలు పరిష్కారానికి యత్నించే తన తల్లికి ఓటు వేయాలని అయోధ్యకు సమీపంలో ఉన్నప్పటికీ వరుణ్‌గాంధీ విజ్ఞప్తి చేశారు.

అమేథీకి సమీపంలో ఉన్నప్పటికీ సుల్తాన్‌పూర్‌లో జాతీయ అంశాలు చర్చకు రావడం లేదు. స్థానిక సమస్యలే తన ప్రాధాన్య అంశాలని మేనకా గాంధీ స్పష్టంగా చెబుతున్నారు. ముస్లిం సామాజికవర్గ ఓట్లు పోతాయనే అయోధ్య రామమందిరాన్ని రాహుల్‌, అఖిలేశ్‌ సందర్శించుకోవడం లేదని యూపీ ఎన్నికల ప్రచారంలో మోడీ, షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే మేనక ముస్లింలు సహా అన్నివర్గాల ప్రజలను కలిసేందుకు యత్నించారు. యూపీలో బీజేపీ ఈసారి సీట్లు చాలా తగ్గుతాయనే ప్రచారానికి అక్కడి పరిస్థితులు అద్దం పడుతున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు.

ఢిల్లీలో ఢీ అంటే ఢీ

దేశ రాజధాని ఢిల్లీ ఓటర్ల తీర్పు విభిన్నంగా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీకి పట్టం కట్టే ప్రజలు లోక్‌సభ ఎన్నికలు వచ్చేసరికి మరోపార్టీకి మద్దతుగా నిలుస్తారు. 2019లో ఇక్కడి మొత్తం 7 స్థానాలనూ కైవసం చేసుకుని కాషాయపార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. మరుసటి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌, ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై కేజ్రీవాల్‌ పీఏ దాడి వంటి ఘటనలు ఆప్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 25న ఆరో విడుతలో ఢిల్లీలోని 7 నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్‌ జరగనున్నది.

ఈ అన్ని సీట్లలోనూ బీజేపీ పోటీ చేస్తున్నది. విశేషం ఏమిటంటే.. గత ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించినవారు సహా మొత్తం ఆరుగురిని మార్చి కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చింది. ఇక్కడ ఆప్‌ 4, కాంగ్రెస్‌ 3 చోట్ల పోటీ చేస్తున్నాయి. దీంతో ఇండియా, ఎన్టీఏ కూటముల మధ్య ఢీ అంటే ఢీ అనే వాతావరణం ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉచిత విద్యుత్‌, తాగునీరు వంటి అంశాలకే ప్రాధాన్యం ఇచ్చే హస్తిన ఓటర్లు లోక్‌సభకు వచ్చేసరికి జాతీయ భద్రత, అభివృద్ధి, ప్రధాని సమర్థత వంటివి చూస్తున్నారు. దీంతో ఢిల్లీ ఓటర్లు ఎటువైపు మొగ్గుతారనే ఉత్కంఠ నెలకొన్నది.

జార్ఖండ్‌లో ఇండియా కూటమి బలప్రదర్శన

జార్ఖండ్‌లోని కీలక ప్రాంతాలైన రాజధాని రాంచీ సహా జంషెడ్‌పూర్‌, ధన్‌బాద్‌, గిరిడీహ్‌లలో పోటీపై ఆసక్తి నెలకొన్నది. ఇక్కడ కూడా ఢిల్లీ వలె అసెంబ్లీ ఎన్నికల్లో ఒకలా, లోక్‌సభ ఎన్నికలకు మరో విధంగా ఓటర్లు తీర్పు ఇస్తుంటారు. హేమంత్‌సోరెన్‌ అరెస్ట్‌ తర్వాత ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఇండియా కూటమి నేతలంతా పాల్గొన్నారు. ఈసారి ప్రియాంకగాంధీ, రాహుల్‌గాంధీ, కల్పనా సోరెన్‌, కేజ్రీవాల్‌ గట్టిగా ప్రచారం చేశారు. గత ఎన్నికల్లో జార్ఖండ్‌లోని 14 స్థానాలకు గాను 11 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది.

గిరిడీహ్‌లో మినహా మిగిలిన మూడు చోట్ల బీజేపీ గెలుపొందింది. ఈసారి కూడా మోదీ, రామమందిరంపై బీజేపీ ఆధారపడుతున్నది. కానీ జేజేఎం నేత హేమంత్‌ సోరెన్‌ అరెస్టు వ్యవహారంతో కొంత సానుభూతి రావొచ్చని, రాష్ట్రంలో కాంగ్రెస్‌, జేఎఎం కూటమి అధికారంలో ఉండటం కూటమికి కలిసి రావొచ్చనే అంచనాలున్నాయి. ఇక హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే ముఖాముఖి పోరు ఉండనున్నది.

అక్కడ రైతుల వ్యతిరేకత, రాష్ట్ర రాజకీయ సంక్షోభం, జాట్‌ల తిరుగుబాటుతో బీజేపీ కలవరపడుతుండగా, ఈ ఏడాదే జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్‌ చూస్తున్నది. బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన తర్వాత ఆ పార్టీలో బీజేపీ చీలిక తెచ్చింది. దుష్యంత్‌ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ అస్థిత్వానికి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. దీంతో ఆ రాష్ట్రంలో జరిగే పది స్థానాలపై పోలింగ్‌పై అందరి దృష్టి ఉన్నది.