Residential Sales Report : ఏడు నగరాల్లో ఇళ్ల విక్రయాలు ఢమాల్
దేశంలోని ప్రధాన ఏడు నగరాల్లో ఇళ్ల విక్రయాలు 14% తగ్గాయి. హైదరాబాద్‌లో అత్యధికంగా 23% క్షీణత నమోదు కాగా, ధరల పెరుగుదల, ఐటీ ఉద్యోగాల కోత రియల్ ఎస్టేట్‌పై ప్రభావం చూపాయి.
దేశంలో ఆర్థిక మాంద్యం, అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యల ప్రభావం రెసిడెన్షియల్ ఇళ్ల విక్రయాలపై అధికంగా చూపుతోంది. 2024 సంవత్సరంలో జరిగిన విక్రయాలను పరిశీలిస్తే 2025 లో 14 శాతం మేర పడిపోయాయి. అనరాక్ కన్సల్టెన్సీ కంపెనీ నివేదిక ప్రకారం 2024 లో 4.59 లక్షల యూనిట్లు అమ్ముడు పోగా 2025 లో 3.95 లక్షలకు తగ్గిపోయాయి. భూముల ధరలు ఆకాశాన్ని అంటడం, ఐటీ కంపెనీలలో ఉద్యోగాల తొలగింపు, అమెరికా దేశంలో వీసాల ఆంక్షలు, నియంత్రణలు, అనిశ్చితి పరిస్థితుల కారణంగా భారతదేశంలో ఇళ్ల విక్రయాలపై ఈ ఏడాది ప్రత్యక్షంగా ప్రభావం చూపింది.
వాస్తవానికి ప్రతి సంవత్సరం ఇళ్ల విక్రయాల విలువ 6 శాతం పెరుగుదల అనగా 2024 లో 5.68 లక్షల కోట్లు కాగా 2025 లో 6 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, పూణే, హైదరాబాద్, చెన్నై తో పాటు కొలకత్తా నగరాల్లో సాధారణంగా ప్రతి ఏడు విక్రయాలు పెరుగుతుంటాయి. ముంబై లో 18 శాతం తగ్గుదలతో 1,27,875 యూనిట్లు, పూణేలో 20 శాతం తగ్గుదలతో 65,135 యూనిట్లు మాత్రమే విక్రయించారు. ఈ రెండు నగరాల్లో మొత్తం రెసిడెన్షియల్ ఇళ్ల విక్రయాల్లో 49 శాతం వాటాగా ఉంది. బెంగళూరు నగరంలో 5 శాతం తగ్గి, 62,205 యూనిట్లు, న్యూఢిల్లీ లో 8 శాతం తగ్గుదలతో 57,220 యూనిట్లు అమ్ముడుపోయాయి. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటున్నదని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేసుకుంటుండగా లెక్కలు మాత్రం తిరోగమనంలో ఉన్నాయి. గతేడాదిలో జరిగిన అమ్మకాలతో పోల్చితే హైదరాబాద్ మహా నగరంలో 23 శాతం పడిపోయాయి. 44,885 యూనిట్లు మాత్రమే విక్రయించారు. అదే విధంగా కొలకత్తాలో 12 శాతం తగ్గుదలతో 16,125 యూనిట్లు, చెన్నై మహా నగరంలో గతేడాదితో పోల్చితే 15 శాతం పెరిగి 22,180 యూనిట్లు విక్రయించారు. అయితే ఈ ఏడు నగరాల్లో 90 శాతం విక్రయాలు ముంబై, బెంగళూరు, హైదరాబాద్, న్యూఢిల్లీలో నే జరిగాయి. నూతన అపార్ట్ మెంట్లలో గతేడాది 4.12 లక్షల యూనిట్లు ఉండగా ఈ ఏడాది 4.19 లక్షల యూనిట్లు పెరిగి 2 శాతం పెరుగుదల కన్పించింది. ఏడు నగరాలతో పోల్చితే ముంబై, బెంగళూరు నగరాల్లోనే 48 శాతం వరకు నూతన అపార్ట్ మెంట్లు వచ్చాయి. ముంబై, బెంగళూరు, పూణే, న్యూఢిల్లీ నగరాల్లో 79 శాతం కొత్త యూనిట్లు విక్రయించారు. కొత్త అపార్ట్ మెంట్లలో ఎక్కువగా రూ.2.5 కోట్లకు పైబడిన యూనిట్లను 21 శాతం మంది కొనుగోలు చేయడం విశేషంగా చెప్పుకోవాలి.
రెసిడెన్షియల్ యూనిట్ల ధరలు ప్రతి ఏడాది పెరుగుతుండగా, ఈ ఏడాది 8 శాతం 23 శాతం మధ్య పెరుగుదల కన్పించింది. న్యూఢిల్లీలో మాత్రం రెండంకెల ధరల పెరుగుదల అనగా 23 శాతం పెరిగింది. న్యూఢిల్లీలో కొత్తగా 61,775 యూనిట్లు విక్రయించగా అందులో 55 శాతం యూనిట్ల ధరలు రూ.2.5 కోట్లకు పైబడి ఉన్నాయి. 2026 సంవత్సరంలో ఆర్బీఐ రేట్ కట్, డెవలపర్స్ ధరల నియంత్రణ, ఆర్థిక పరిస్థితులు అనుకూలించడం, మున్ముందు రెపో రేట్లు మరింతగా తగ్గించి, వడ్డీ రేట్లను సవరిస్తే రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్లలో యూనిట్లకు డిమాండ్ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని అనరాక్ అంచనా వేస్తోంది. 2025 సంవత్సరంలో లగ్జరీ యూనిట్ల కొనుగోళ్లలో డిమాండ్ పెరిగిందని, కోవిడ్ తరువాత బ్రాండెడ్ డెవలపర్స్ విక్రయాల్లో ఈ పెరుగుదల స్పష్టంగా కన్పించింది. ఏడు నగరాల్లో కొత్త యూనిట్లలో అమ్మకాలు 2024 లో 18 శాతం ఉండగా, 2025 లో 21 శాతానికి పెరిగింది. 2024 సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కనీస చదరపు అడుగు విలువ రూ.8,590 ఉండగా 2025 నాలుగో త్రైమాసికంలో రూ.9,260కి (8శాతం) పెరిగింది. న్యూఢిల్లీలో 2024లో రూ.7,550 ఉండగా 2025లో రూ.9,350 కి (23శాతం) పెరిగిందని నివేదిక చెబుతోంది. మిగతా నగరాల్లో 2024లో 13 నుంచి 27 శాతం మధ్య ధరలు పెరగ్గా, 2025లో సింగిల్ డిజిట్ ధరలు నమోదు అయ్యాయి. 2025 చివరి నాటికి విక్రయించని యూనిట్లు గతేడాదితో పోల్చితే నాలుగు శాతం పెరగ్గా, 5.77 లక్షల యూనిట్లు ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో కొత్త యూనిట్లు అందుబాటులో లేకపోవడంతో కొనుగోళ్లు 2 శాతం మేర పడిపోయాయి. 2024 లో విక్రయం కాని యూనిట్లు 96,140 యూనిట్ల ఉండగా 2025 లో 97,765 యూనిట్లకు చేరుకుంది. న్యూఢిల్లీలో గతేడాదితో పోల్చితే 1 శాతం తగ్గగా, బెంగళూరు నగరంలో విక్రయం కాని యూనిట్లు 23 శాతం పెరిగిందని అనరాక్ నివేదిక స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి :
Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై చార్జ్ షీట్
Boxing Day Test : బాక్సింగ్ డే టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram