Lokpal Luxury Car Controversy | లోక్‌పాల్‌కు ఏడు బీఎండబ్ల్యూ కార్లు.. టెండర్లకు ఆహ్వానంపై సోషల్‌ మీడియా గుర్రు

ప్రభుత్వ స్థాయిలో అవినీతి కేసులను విచారించే లోక్‌పాల్‌కు అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లు కొనేందుకు టెండర్లు పిలవడం తీవ్ర వివాదాస్పదంగా మారింది.

  • By: TAAZ |    national |    Published on : Oct 21, 2025 4:39 PM IST
Lokpal Luxury Car Controversy | లోక్‌పాల్‌కు ఏడు బీఎండబ్ల్యూ కార్లు.. టెండర్లకు ఆహ్వానంపై సోషల్‌ మీడియా గుర్రు

Lokpal Luxury Car Controversy | దేశంలో అవినీతి కేసులను విచారించే స్వయం ప్రతిపత్తి సంస్థ లోక్‌పాల్‌. ప్రధాన మంత్రి మొదలు కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, అఖిల భారత సర్వీసు అధికారులకు వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం, అక్రమాలపై విచారించేందుకు దీనిని ఏర్పాటు చేశారు. అయితే ఈ సంస్థ ఇచ్చిన ఒక టెండర్ నోటిఫికేషన్ వివాదాస్పదమవుతోంది. లోక్‌పాల్‌కు ఒక చైర్‌పర్సన్‌,  ఎనిమిది మంది సభ్యులు ఉంటారు. వీరికోసం బీఎండబ్ల్యూ కంపెనీ కి చెందిన 330ఐ అత్యంత పొడవైన ఏడు లగ్జరీ వాహనాల కొనుగోలుకు బహిరంగ టెండర్లను కేంద్ర ప్రభుత్వం పిలిచింది. అక్టోబర్ 17వ తేదీ నుంచి కారు డీలర్లు తమ టెండర్లు దాఖలు చేయవచ్చని పేర్కొంది. దాఖలు కు తుది గడువు నవంబర్ 6వ తేదీతో ముగియనుండగా, వాటి పరిశీలన 7వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో ఒక్కో కారు విలువ రూ.60 లక్షలు కాగా, రోడ్డు టాక్స్ లు ఇతరత్రా అదనం. ఎంపికైన వారు రెండు వారాల్లో వాహనాలు డెలివరీ చేయాలని షరతు విధించింది.

ఇదే కాకుండా వాహనాలు ఎలా నడపాలి, వాహనాల పనితీరు పై తమ సిబ్బందితో పాటు డ్రైవర్లకు రెండు వారాలు శిక్షణనివ్వాలని టెండర్ లో నిబంధన విధించడం విశేషం. క్లాస్ రూమ్ లో తరగతులతో పాటు వాహనాలను ప్రత్యక్షంగా నడిపించడంలో శిక్షణ ఇవ్వాలని పేర్కొంది. అయితే ఈ టెండర్ నోటిఫికేషన్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రముఖ న్యాయ నిపుణుడు ప్రశాంత్ భూషణ్ సైతం ఎక్స్ లో విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో లోక్‌పాల్‌కు  బూజు పట్టుకుందని, కొత్తగా అప్పాయింట్ అయిన సభ్యులు అవినీతి మకిలిపై చర్యలు తీసుకోకుండా, లగ్జరీ కార్ల తో ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారన్నారు. ప్రజల కోసం కాకుండా తమ కోసం బీఎండబ్ల్యూ కార్లు కొనుగోలు చేస్తున్నారన్నారు. గతంలో అవినీతికి భారత్ వ్యతిరేకం అనే ఉద్యమం జరిగిందని, దీని వెనకాల ఆర్ఎస్ఎస్ ప్రోద్బలం ఉందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షమా మొహ్మద్ వ్యాఖ్యానించారు.