Indian Army | ఆర్మీ అసాధారణ చర్య.. జమ్ముకు 3,500 మంది ప్రత్యేక బలగాలు
జమ్ము ప్రాంతంలో ఉగ్రవాద చర్యల ఆకస్మిక పెరుగుదల నేపథ్యంలో కేంద్రం ఎట్టకేలకు స్పందించింది. పిర్‌పంజ్ పర్వత సానువుల్లో ఉగ్రవాదులపై పోరాడేందుకు 3500 మందితో కూడిన దళాలను పంపనున్నది.

శ్రీనగర్: జమ్ము ప్రాంతంలో ఉగ్రవాద చర్యల ఆకస్మిక పెరుగుదల నేపథ్యంలో కేంద్రం ఎట్టకేలకు స్పందించింది. పిర్‌పంజ్ పర్వత సానువుల్లో ఉగ్రవాదులపై పోరాడేందుకు 3500 మందితో కూడిన దళాలను పంపనున్నది. ఇప్పటికే ఇందులో 500 మందిని ఆర్మీ జమ్ము ప్రాంతానికి తరలించింది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భారత దళాల మారిన ఎత్తుగడల వ్యూహాన్ని ఈ చర్య ప్రతిబింబిస్తున్నది. ఈ దళాలను జమ్ము, కథువా నుంచి దోడా వరకూ ఉన్న క్లిష్టమైన పర్వత ప్రాంతాల్లో మోహరించనున్నారు. ఇప్పటికే 500 మంది స్పెషల్ ఫోర్సెస్ పారా కమాండోలను పంపామని, త్వరలోనే మరో 3000 మంది ఇన్‌ఫ్రాంటీ బలగాలను పంపనున్నామని సీనియర్ రక్షణ అధికారులను ఉటంకిస్తూ ది వీక్ పేర్కొన్నది.
ఈ ప్రాంతంలో భద్రత చట్రాన్ని పటిష్టం చేయడంతోపాటు ఉగ్రవాద కదలికలపై మరింత నిఘా పెట్టేందుకు, స్థానికంగా ఉగ్రవాదులకు సహాయాలు అందకుండా చూసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ఒకే దఫాలో 500 మంది పారా కమాండోలను పంపడం అసాధారణమైన చర్యగా పలువురు రక్షణ నిపుణులు అభివర్ణిస్తున్నారు.
శత్రువు బలాబలాల నేపథ్యంలోనే ఒక బెటాలియన్‌తో సమానమైన బలగాలను పంపుతున్నామని అధికారి ఒకరు చెప్పారు. ‘దానర్థం.. ఉగ్రవాదుల బాగా శిక్షణ పొందినవారు. వారిలో కొందరు బాగా అనుభవం ఉన్న ఆఫ్ఘనిస్థాన్ వెటరన్లు కూడా ఉండి ఉంటారని మేం అనుమానిస్తున్నాం’ అని ఆయన తెలిపారు.
ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా వదిలేసి వెళ్లిన ఆయుధాలు, అత్యంత అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థలు, రాత్రపూట సైతం చూడగలిగే పరికరాల వంటివి ఉపయోగించడంలో వారు దిట్టలు. పాకిస్థాన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయినవారు కూడా కొందరు ఈ ఉగ్రవాదుల్లో ఉండి ఉంటారని బలంగా నమ్ముతున్నాం’ అని ఆయన చెప్పారు.
ఇదిలా ఉంటే.. దాడుల ధోరణి చూస్తుంటే పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ తన కేంద్రీకరణను ఆఫ్ఘనిస్థాన్ నుంచి కశ్మీర్‌వైపు మళ్లించిందనే అభిప్రాయం కలుగుతున్నదని గతంలో అధికారవర్గాలు చెప్పాయి. ఉగ్రవాదులు తమ ఎత్తుగడలను కూడా మార్చారని అంటున్నారు. దాడికి పాల్పడే గ్రూపులో 50 నుంచి 55 మంది వరకూ ఉంటున్నారని ఒక అధికారి చెప్పారు. వారు ఐదారు గ్రూపులుగా ఏర్పడి దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ దాడులకు తమదే బాధ్యతని వేర్వేరు సంస్థలు ప్రకటిస్తున్నా.. పాత ఉగ్రవాద సంస్థలైన జైషే మహ్మద్, లష్కరే తాయిబా వంటి పాత సంస్థల కొత్త రూపాలు అయి ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉగ్రదాడులు వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్నాయి. దీంతో అన్ని ప్రాంతాల్లో కేంద్రీకరించే సమయంలో బలగాలు పలచబడుతున్నాయి. ప్రత్యేకించి ఎక్కువగా తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో కేంద్రకరించాల్సి వస్తున్నది. ఈ ప్రాంతం ఎత్తైన పర్వతాలు, చొరబడలేనంత దట్టంగా ఉండే అడవులతో నిండి ఉంటుంది. దీంతో మరిన్ని బలగాలను అక్కడ మోహరిస్తే.. అక్కడ సైతం మార్గాలను సీజ్ చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాదులు జమ్ము ప్రాంతంపై కేంద్రీకరించి దాడులు చేస్తున్నారు. 2021 అక్టోబర్ 11న పూంఛ్‌లో జరిగిన దాడితో మొదలుకుని, మంగళవారం దోడా జిల్లాలో జరిగిన దాడి వరకూ దాదాపు 48 మంది సైనికులు చనిపోయారు. ఇందులో ఒక కెప్టెన్ కూడా ఉన్నారు.