గగన్‌యాన్ సందడి మొదలు.. చిత్రాలను విడుదల చేసిన ఇస్రో

విధాత: భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే గగన్‌యాన్ (Gaganyaan) మిషన్‌లో ఇస్రో పూర్తిగా నిమగ్నమైంది. 2024లో ప్రయోగాన్ని చేపట్టడానికి శాస్త్రవేత్తలు ప్రణాళికలు రచిస్తున్నారు. తాజాగా గగన్‌యాన్ అంతరిక్షనౌకకు చెందిన చిత్రాలను ఇస్రో ఎక్స్‌లో పోస్ట్ చేసింది. మానవ రహిత అంతరిక్ష పరీక్షలకు సిద్ధమవుతున్నామని ప్రకటించింది. తొలుత మానవ రహిత యాత్రలను చేపట్టడం ద్వారా మానవసహిత యాత్రలకు కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తారు.
ఈ ప్రయోగాల్లో ఎదురైన లోపాలను, ఇబ్బందులను సరిదిద్దుకుని ప్రధాన ప్రయోగాన్ని ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహించడానికి ప్రయత్నిస్తారు. ‘మానవరహిత అంతరిక్ష ప్రయోగాలు చేయడానికి సిద్ధమయ్యాం. గగన్ యాన్ సిబ్బంది ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ 1 (టీవీ డీ1) ను త్వరలో ప్రయోగిస్తాం. దీని వల్ల ప్రమాదకర సమయాల్లో గగన్‌యాన్ సిబ్బంది ఎలా బయటపడాలనేది తెలుస్తుంది’ అని ఇస్రో పేర్కొంది.
గగన్‌యాన్‌లో భాగంగా భూమికి 400 కి.మీ. ఎత్తులో ఒకటి నుంచి మూడు రోజుల పాటు భారతీయ వ్యోమగాములు ప్రయోగాలు చేస్తారు. అనంతరం భారత ప్రాదేశిక జలాల్లో సురక్షితంగా ల్యాండ్ అవుతారు ఎంతమంది వ్యోమగాములు ఈ పరిశోధనలో పాలుపంచుకుంటార్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇద్దరు లేదా ముగ్గురికి ఈ అవకాశం లభించవచ్చు. ఇప్పటికే ఇస్రో ఎంపిక చేసిన కొద్ది మంది వైమానిక దళం పైలట్లు రష్యాలో శిక్షణను పూర్తి చేసుకుని వచ్చారు.