IndiGo Delhi flight bird hit | టేకాఫ్ తీసుకున్న కాసేపటికే విమానాన్ని ఢీకొన్న పక్షి.. తప్పిన పెను ప్రమాదం

IndiGo Delhi flight bird hit | గాల్లో ప్రయాణిస్తున్న ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. పట్నా నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో సంస్థకు చెందిన విమానాన్ని పక్షి ఢీ కొట్టింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో విమానాన్ని ఎమెర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇండిగో 6ఈ-2433 విమానంలో 169మంది ప్రయాణికులు ఉన్నారు. పక్షి ఢీ కొట్టడంతో విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. వెంటనే అలర్ట్ అయిన పైలట్ విమానాన్ని పట్నా ఎయిర్ పోర్టుకు మళ్లించి సురక్షితంగా అత్యవసర ల్యాండ్ చేశారు.
విమానాన్ని ఢీ కొట్టిన పక్షి రన్ వేపై పడింది. అయితే, ఈఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదని.. ప్రయాణికులు అందరూ క్షేమంగా ఉన్నారని ఎయిర్ పోర్ట్ అధికారులు వివరించారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన విమానానికి మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విమానంలో ప్రయాణిస్తున్న ప్యాసింజర్స్ కు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులను వారి గమ్యస్థానాని చేర్చేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అయితే, కొన్ని రోజుల క్రితమే ఇదే విమానయాన సంస్థకు చెందిన ఓ విమానాన్ని పక్షి ఢీ కొట్టింది.