అదానీ మోసాలపై విచారణ కంటితుడుపే!: జైరాం రమేశ్‌

అదానీ మోసాలపై విచారణ కంటితుడుపే!: జైరాం రమేశ్‌
  • ఇవి ఎవరినీ మోసం చేయలేవు
  • ముంబై ఎయిర్‌పోర్టుల అకౌంట్ల తనిఖీ మాయ
  • కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌


న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌కు చెందిన ముంబైలోని రెండు విమానాశ్రయాల్లో అకౌంట్ల తనిఖీకి కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేయడం కంటితుడుపు చర్య, మాయ అని కాంగ్రెస్‌ శనివారం అభివర్ణించింది. అదానీ విషయంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలన్న తన డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ సంస్థ.. అదానీ కంపెనీ అవకవకలను బయటపెట్టిన దగ్గర నుంచి కాంగ్రెస్‌ పార్టీ వాటి నిగ్గు తేల్చాలని పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.


అయితే.. హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపనలను అదానీ గ్రూపు కొట్టిపారేస్తున్నది. తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని స్పష్టం చేసింది. అదానీ సంస్థల్లో తనిఖీలకు ఆదేశిచినట్టు వచ్చిన ఒక వార్తను ప్రస్తావించిన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్‌.. అదానీ గ్రూపు లొసుగులు ఒక్కొటొక్కటిగా బయటపడుతున్న నేపథ్యంలో ఆత్మరక్షణలో పడిన కేంద్ర ప్రభుత్వం.. తనను తాను ఈ అంశం నుంచి కాపాడుకునేందుకే మోదీకి ఇష్టమైన వ్యాపార సంస్థపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. నీతి ఆయోగ్‌, ఆర్థిక వ్యవహారాల శాఖ అభ్యంతరాలు తెలిపినా అదానీ గ్రూపునకు ఆరుకు ఆరు విమానాశ్రయాలూ కట్టబెట్టడంపై కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు దర్యాప్తు జరుపుతుందని ఆయన ప్రశ్నించారు.


అదానీ గ్రూపునకు విక్రయించేందుకు ముంబై ఎయిర్‌పోర్టు పాత యజమానులు సిద్ధపడనప్పుడు వారిపై ఈడీ, సీబీఐ ఎలా విచారణ జరిపిందో, ప్రధాని సన్నిహిత మిత్రుడు దేశంలోనే అత్యంత రద్దీ ఉండే రెండో ఎయిర్‌పోర్టును తన నియంత్రణలోకి తెచ్చుకున్న తర్వాత ఆ కేసు ఎందుకు అటకెక్కిందో ఎప్పడు విచారిస్తారని నిలదీశారు. ఈ విచారణలన్నీ వట్టివేనని, మోదీ హయాంలో అదానీ గ్రూపుపై విచారణలకు ఏ గతి పట్టిందో వీటికీ అదే గతి పడుతుందని వ్యాఖ్యానించారు. ఇటువంటి కంటితుడుపు చర్యలు ఎవరినీ మోసం చేయలేవని అన్నారు. ‘మోదానీ మెగా స్కాం’ వెనుక వాస్తవాలను ఒక్క సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ మాత్రమే బయటపెట్టగలదని స్పష్టం చేశారు.