Jairam Ramesh | జనాభా లెక్కలకు నిధులేవి? కులగణను తప్పించేందుకు యత్నం … కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ విమర్శ

పదేళ్లకోసారి నిర్వహించే జనాభా లెక్కల కోసం ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌ బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ మండిపడింది. కుల గణన చేపట్టకుండా ఉండేందుకే జనాభా లెక్కల సేకరణను బీజేపీ వాయిదా వేస్తూ వస్తున్నదని కాంగ్రెస్‌ కమ్యూనికేషన్స్‌ విభాగం కార్యదర్శి జైరాం రమేశ్‌ విమర్శించారు

Jairam Ramesh | జనాభా లెక్కలకు నిధులేవి? కులగణను తప్పించేందుకు యత్నం … కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ విమర్శ

నిర్మలమ్మ ప్రసంగంలో జనాభా లెక్కల సేకరణ మిస్‌! కుల గణనను తప్పించేందుకేనన్న కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: పదేళ్లకోసారి నిర్వహించే జనాభా లెక్కల కోసం ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌ బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ మండిపడింది. కుల గణన చేపట్టకుండా ఉండేందుకే జనాభా లెక్కల సేకరణను బీజేపీ వాయిదా వేస్తూ వస్తున్నదని కాంగ్రెస్‌ కమ్యూనికేషన్స్‌ విభాగం కార్యదర్శి జైరాం రమేశ్‌ విమర్శించారు. మంగళవారం లోక్‌సభలో 2024 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి.. జనాభా లెక్కల సేకరణ అంశాన్ని ప్రస్తావించలేదు. వాస్తవానికి 2021లో జనాభా లెక్కల సేకరణ చేపట్టాల్సి ఉన్నది. కానీ.. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో వాయిదా పడింది. తదుపరి ప్రభుత్వం నుంచి ఈ దిశగా ఎలాంటి చర్యలూ లేవు. తాజాగా బడ్జెట్‌లో సైతం జనాభా లెక్కల సేకరణకు నిధులు కేటాయించకపోవడంతో ఈ ఏడాది కూడా జనాభా లెక్కల సేకరణ ఉండే అవకాశాలు కనిపించడం లేదు.

కులగణన చేపట్టాల్సి వస్తుందనే బీజేపీ ప్రభుత్వం బడ్జెట్‌లో జనాభా లెక్కల సేకరణకు నిధులు కేటాయించలేదని జైరాం రమేశ్‌ విమర్శించారు. జనాభా లెక్కలకు నిధులు కేటాయించకపోవడం తీవ్ర నిరాశ కల్గించిందన్నారు. స్వాంతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి జనాభా లెక్కల సేకరణను సకాలంలో నిర్వహిండంలో కేంద్ర ప్రభుత్వం విఫలం ఇదే తొలిసారని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. జనాభా లెక్కల సేకరణను వాయిదా వేయడం వల్ల తీవ్ర పర్యవసానాలు ఎదురవుతాయని జైరాం రమేశ్‌ విమర్శించారు. అవి ప్రభుత్వ పరిపాలనా సామర్థ్యం మీద ప్రభావం చూపుతాయని తెలిపారు. ఉదాహరణకు పది నుంచి 12 కోట్ల మంది ప్రజలు జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి రాబోరని పేర్కొన్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు సైతం డిమాండ్‌ చేస్తున్న సామాజిక, ఆర్థిక కులగణనను నివారించేందుకే ప్రభుత్వ చర్య ఉద్దేశించినట్టు కనిపిస్తున్నదని ఆయన విమర్శించారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన యువతకు ఇంటర్న్‌షిప్‌ పథకాన్ని కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళిక ‘న్యాయ్‌ పత్ర్‌’ నుంచి కాపీకొట్టారని జైరాం రమేశ్‌ విమర్శించారు. ఐదేళ్లపాటు 500 టాప్‌ కంపెనీల్లో కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పించేందుకు ఒక పథకాన్ని నిర్మలా సీతారామన్‌ తాజా బడ్జ్‌లో ప్రకటించారు. తమ మ్యానిఫెస్టోలో పెహల్లీ నౌకరి పక్కీ పేరుతో తాము ప్రతిపాదించిన అప్రెంటిస్‌షిప్‌ కార్యక్రమాన్ని నిర్మల ప్రకటించారని జైరాం రమేశ్‌ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ పేర్కొన్న విధంగా డిప్లొమా హోల్డర్లందరికీ కార్యక్రమాత్మక హామీ కాకుండా.. ఏకపక్ష టార్గెట్‌ (కోటి ఇంటర్న్‌షిప్‌లు) ప్రకటించడం పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కే వారి ట్రేడ్‌మార్క్‌కు నిదర్శనమని ఆయన విమర్శించారు.

కేంద్ర బడ్జెట్‌లో రైతులకేముంది? : కాంగ్రెస్‌ ప్రశ్న

కేంద్ర బడ్జెట్‌లో రైతులకు శూన్యహస్తాలే మిగిలాయని కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం మండిపడింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న రైతుల డిమాండ్‌పై, వ్యవసాయ రుణాల మాఫీపై కఠోర మౌనాన్ని పాటించారని విమర్శించింది. మంగళవారం పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి వ్యవసాయ రంగానికి, దాని అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్లను ప్రతిపాదించారు. ‘దేశంలోని మెజార్టీ ప్రజానీకం ఆధారపడిన వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు మొత్తం బడ్జెట్‌లో కేటాయించింది 3.15 శాతం మాత్రమే. ఇది 2019-2020 బడ్జెట్‌తో పోల్చితే 5.44శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో తగిన వర్షాలు లేక వ్యవసాయ వృద్ధి 4.7 2022-23లో 4.7 శాతం నుంచి 2023-24లో 1.5 శాతానికి తగ్గింది. ఈ నేపథ్యంలో ఈ రంగానికి ప్రభుత్వం నుంచి భారీ స్థాయిలో మద్దతు అవసరం’ అని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది మొదట్లో కనీస మద్దతు ధరలను పెంచామని నిర్మలాసీతారామన్‌ గొప్పగా చెప్పుకొన్నారని, కానీ, అవి కూడా స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసు చేసిదానికంటే తక్కువేనని పేర్కొన్నారు.