Modi RSS praise Red Fort Controversy | మోదీ నోట ఆరెస్సెస్ మాట వెనుక!
ఎర్రకోట బురుజుల నుంచి ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ప్రస్తావన తీసుకురావడం రాజకీయంగా సంచలనం రేపింది. ప్రధాని హోదాలో సుమారు 12 ఏళ్ల తర్వాత మోదీ నోట వెంట ఆరెస్సెస్ ప్రస్తావన వచ్చిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Modi RSS praise Red Fort Controversy | ఎర్రకోట బురుజుల నుంచి ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ప్రస్తావన తీసుకురావడం రాజకీయంగా సంచలనం రేపింది. ప్రధాని హోదాలో సుమారు 12 ఏళ్ల తర్వాత మోదీ నోట వెంట ఆరెస్సెస్ ప్రస్తావన వచ్చిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. త్వరలో 100 వసంతాలను పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ఆరెస్సెస్ ప్రయాణం గురించి మాట్లాడిన మోదీ.. దానిని గొప్ప స్వచ్ఛంద సంస్థగా కొనియాడారు. స్వాతంత్ర్యం అనంతరం మహాత్మా గాంధీని ఆరెస్సెస్‌కు చెందిన నాథూరామ్ గాడ్సే హత్య చేసిన తర్వాత ఆ సంస్థను అప్పటి హోం మంత్రి పటేల్ నిషేధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆరెస్సెస్ నాయకులు గాడ్సేను కీర్తిస్తూ ఉంటారు. దేశ రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని గుర్తించడానికే నిరాకరించిన ఆరెస్సెస్.. సుమారు 52 సంవత్సరాలు పాటు తన నాగపూర్ కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు ఇష్టపడలేదు. ఇలాంటి సంస్థను ప్రధాని ప్రశంసించడం రాజకీయంగా సంచలనం రేపింది. ప్రధాని సహా కీలక మంత్రుల నియామకం, పార్టీ కార్యకలాపాలు అన్నింటినీ నియంత్రించే ఆరెస్సెస్‌ను మచ్చిక చేసుకునే ప్రయత్నంగా పలువురు బీజేపీ నాయకులు సైతం చెబుతున్నారు.
75 ఏళ్ల వయోపరిమితి.. బీజేపీ కొత్త చీఫ్ ఎంపిక లింకులు!
ప్రభుత్వాన్ని నడిపిస్తున్న శక్తి ఆరెస్సెస్సేనని ప్రతిపక్షాలు, ప్రత్యేకించి కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రస్తావన చేయడం గమనార్హం. మరోవైపు బీజేపీ కొత్త చీఫ్ ఎంపిక కూడా నేపథ్యంగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపిక విషయంలో బీజేపీ, ఆరెస్సెస్ ఒక అంగీకారానికి రాలేక పోతున్నాయి. మోదీ, అమిత్‌షా కనుసన్నల్లో నడిచే వ్యక్తి కాకుండా.. సంఘ్ ఆలోచనలకు అనుణంగా వ్యవహరించే నాయకుడు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిలో ఉండాలనేది ఆరెస్సెస్ వాదనగా చెబుతున్నారు. అయితే.. తమ మనసెరిగి మసులుకునే నాయకుడే ఆ స్థానంలో ఉండాలనేది బీజేపీ అగ్రనాయకత్వం భావనగా తెలుస్తున్నది. ఈ క్రమంలోనే అధ్యక్ష ఎంపికలో తీవ్ర జాప్యం నెలకొందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆరెస్సెస్ నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకే వ్యూహాత్మకంగా ఆరెస్సెస్‌ను మోదీ ప్రశంసల్లో ముంచెత్తారన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. దీనికంటే ముఖ్యమైన అంశంగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ ఇటీవల రాజకీయ నాయకుల పదవీవిరమణ వయసు విషయంలో చేసిన వ్యాఖ్యలను రాజకీయ పరిశీలకులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. 75 ఏళ్లు వచ్చే సరికి నాయకత్వ స్థానాలకు రాజీనామా చేయాలని భాగవత్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను ప్రధాని మోదీని ఉద్దేశించి చేసినవేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ క్రమంలో తన పదవీకాలాన్ని పొడిగించుకునే క్రమంలో ఆయన ఆరెస్సెస్‌ను ప్రశంసించి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగపూర్‌లోని ఆరెస్సెస్ కేంద్ర కార్యాలయాన్ని మోదీ ఈ ఏడాది మార్చిలో సందర్శించడం ఈ చర్చలకు నాంది పలికింది. ప్రధాని అయిన తర్వాత ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మోదీ నాగపూర్‌లోని ఆరెస్సెస్ కార్యాలయానికి వెళ్లలేదు. అదే మొదటిసారి.
మండిపడిన ప్రతిపక్షాలు
బీజేపీ మాతృ సంస్థ అయిన ఆరెస్సెస్‌ను మోదీ కీర్తించడం ఆయన తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం చేసిన ప్రయత్నంగా ప్రతిపక్షాలు సెటైర్‌లు వేశాయి. వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం ఎర్రకోట ప్రసంగంలో ఒక మత సంస్థ ప్రస్తావన తేవడాన్ని తీవ్రంగా విమర్శించారు. సెక్యులర్, సోషలిస్ట్ విలువలను కాపాడుతానని ఒకప్పుడు చెప్పిన బీజేపీ.. ఆ విలువలను వదిలేసిందని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ దుయ్యబట్టారు. ‘ఆరెస్సెస్ కుటుంబ మార్గం అటు సెక్యులర్ కాదు.. సోషలిస్టూ కాదు’ అని ఆయన అన్నారు. వాళ్ల నోట స్వదేశీ మాటలు వస్తాయని, కానీ వారి గుండెల్లో అన్నీ విదేశీ ఆలోచనలే ఉంటాయని మండిపడ్డారు. అసలు లౌకిక దేశం అన్న భావనకే ఆరెస్సెస్ వ్యతిరేకమని ఆయన గుర్తు చేశారు.
త్వరలో మోదీ రిటైర్.. అందుకే : జైరాం రమేశ్
‘ప్రధాని ఈ రోజు అలిసిపోయారు. త్వరలోనే ఆయన రిటైర్ కానున్నారు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఎక్స్‌లో సెటైర్ వేశారు. ‘కాలం చెల్లిన, కపట, మసకబారిన’ ప్రసంగంగా ఆయన అభివర్ణించారు. ‘వచ్చే నెలలో 75 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న మోదీ ఆరెస్సెస్‌ను ప్రసన్నం చేసుకునే క్రమంలోనే చేసిన నిరాశాజనక ప్రయత్నమని జైరాం రమేశ్ అన్నారు. సీనియర్ నాయకులు 75 ఏళ్లు రాగానే తమ పదవుల నుంచి తప్పుకొని, యువ తరానికి అవకాశం ఇవ్వాలని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. బీజేపీలో ఈ నిబంధన లేదని ఆ పార్టీ నాయకత్వం చెబుతూ వస్తున్నది. 80 ఏళ్ల వయసున్న జీతన్ రామ్ మాంఝీ వంటి నేతలు కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్న విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వంటివారు గుర్తు చేస్తూ ఉంటారు.
52 ఏళ్లపాటు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించని నాగపూర్
ఆరెస్సెస్ విషయంలో రెండు వైఖరులు ఉన్నాయి. ఒకటి మాది. రెండోది మోదీ, ఆయన అనుయాయులది. ఈ రెండింటికీ మధ్య తీవ్ర వ్యత్యాసం ఉన్నది. అందుకే అత్యంత పవిత్రమైన స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆయన ఆ అంశాన్ని ప్రస్తావించకుండా ఉంటే బాగుండేది’ అని కాంగ్రెస్ నాయకుల సల్మాన్ ఖుర్షిద్ వ్యాఖ్యానించారు. ‘వాళ్లు 52 ఏళ్లపాటు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయలేదు. స్వాతంత్ర్య ఉద్యమంలో వారి పాత్ర లేదు. మహాత్మాగాంధీ ఇచ్చిన క్విట్ ఇండియా పిలుపును వాళ్లు వ్యతిరేకించారు. ఆజాద్ హింద్ ఫౌజ్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు బ్రిటష్ ఆర్మీలో చేరాల్సిందిగా భారతీయలను వారు కోరారు. వాళ్లకు స్వాతంత్రోద్యమంలోనే ఎలాంటి పాత్ర లేదు’ అని ఆయన పేర్కొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని రాజకీయం చేశారు : ఒవైసీ
ఆరెస్సెస్‌ను మోదీ కీర్తించడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఆ చర్య ద్వారా స్వాతంత్ర్య ఉద్యమాన్ని అగౌరవపర్చడమే కాకుండా, స్వాతంత్ర్య దినోత్సవాన్ని రాజకీయం చేశారని ఆరోపించారు. ఆరెస్సెస్ సిద్ధాంతాలు మన రాజ్యాంగానికి విరుద్ధమైనవని ఒవైసీ గుర్తు చేశారు. ‘ఆరెస్సెస్ స్వయం సేవకుడిగానో లేదా కార్యకర్తగానో మోదీ నాగపూర్‌కు వెళ్లి ప్రశంసించుకోవచ్చు. కానీ.. ఎర్రకోట నుంచి ఆ పని చేయాల్సిన అవసరమేంటి?’ అని ఒవైసీ తన ఎక్స్ పోస్టులో ప్రశ్నించారు.