RSS | గుస్సా మీద ఉన్న ఆరెస్సెస్‌కు మోదీ సర్కారు తీపి కానుక!

వివిధ ప్రభుత్వ విభాగాలను, సంస్థలను ఆరెస్సెస్‌ అనుకూల వాదులతో నింపివేస్తున్నదన్న విమర్శల నేపథ్యంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నది.

RSS | గుస్సా మీద ఉన్న ఆరెస్సెస్‌కు మోదీ సర్కారు తీపి కానుక!

ప్రభుత్వ ఉద్యోగులు ఆరెస్సెస్‌ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు..
58 ఏళ్ల నాటి నిషేధం ఎత్తేసిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: వివిధ ప్రభుత్వ విభాగాలను, సంస్థలను ఆరెస్సెస్‌ అనుకూల వాదులతో నింపివేస్తున్నదన్న విమర్శల నేపథ్యంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. ఆరెస్సెస్‌ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనటాన్ని నిషేధిస్తున్న ఉత్తర్వులను ఎత్తివేసింది. దీంతో ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు నిరాటంకంగా సంఘ్‌ కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు మార్గం సుగమం చేసింది. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ ఒక ఉత్తర్వు వెలువరించింది. జూలై 9వ తేదీతో ఉన్న ఈ ఉత్తర్వులు దేశంలో రాజకీయంగా తీవ్ర సంచలనం రేపుతున్నాయి. 58 ఏళ్ల క్రితం విధించిన రాజ్యాంగేతర ఉత్తర్వును మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉపసంహరించిందని బీజేపీ నేత అమిత్‌ మాలవీయ ఎక్స్‌లో ధృవీకరించారు.

గోవధకు వ్యతరేకంగా 1966 నవంబర్‌ 7న పార్లమెంటు వద్ద పెద్ద ఎత్తున ఆందోళన జరిగిందని, ఆరెస్సెస్‌, జనసంఘ్‌ అప్పట్లో లక్షల మందిని సమీకరించడంతో వణికిపోయిన అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రభుత్వ సిబ్బంది ఆరెస్సెస్‌లో చేరడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ఆరెస్సెస్‌ నాయకులు బీజేపీ నాయకుల వ్యవహార శైలిపై సూటిగానే పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ పనితీరుతో మాతృసంస్థ సంతృప్తిగా లేదనే అభిప్రాయాల ఉన్న నేపథ్యంలో సంఘ్‌ నేతలను ప్రసన్నం చేసుకునేందుకే ఈ ఉత్తర్వులు ఎత్తివేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

నిషేధం ఎత్తివేతపై దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఆరెస్సెస్‌ స్థాపించి 2025 నాటికి వందేళ్లు పూర్తికానున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఇప్పుడే సంబురాలు ప్రారంభించిందని రచయిత, బ్లాగర్‌, కవి, రాజకీయ విశ్లేషకుడు రాజు పరులేకర్‌ పేర్కొన్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్లో అనేక మంది ఆరెస్సెస్‌ సిద్ధాంతాల కోసం బాహాటంగానే పనిచేయచ్చని వ్యాఖ్యానించారు. జీవోలో పేర్కొన్న ‘గవర్నమెంట్‌ సర్వెంట్‌’ అనే పదాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ఇది మంత్రులకు కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు.

ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో ఆరెస్సెస్‌ బ్యానర్లు, పోస్టర్లు, చిహ్నాలు, సాహిత్యం వంటివి దొరుకుతాయని ఎద్దేవా చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకమైన సిద్ధాంతాలు, ఆకాంక్షలు కలిగిన ఆరెస్సెస్‌లో సభ్యులుగా ఉండే గవర్నమెంట్‌ సర్వెంట్స్‌.. రాజ్యాంగాన్ని కాపాడుతామని ఎలా ప్రమాణం చేయగలరని ప్రశ్నించారు. ఇప్పుడు ఆరెస్సెస్‌ సభ్యులను ప్రభుత్వం నేరుగా ఉద్యోగాల్లోకి రిక్రూట్‌ చేసుకుంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం వ్యవస్థను బీజేపీ హైజాక్‌ చేయాలని చూస్తున్నదని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ అసలు ఆట ఇప్పుడే మొదలుకానున్నదా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎన్డీయే ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో స్పందించాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులు నిక్కర్లు వేసుకుని కార్యాలయాలకు రావచ్చని కాంగ్రెస్‌ పార్టీ వ్యాఖ్యానించింది. ఉద్యోగులు ఆరెస్సెస్‌లో భాగంగా ఉంటే వారు దేశానికి విశ్వసనీయులుగా ఉండలేరని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ఈ ఆదేశాలు దేశ ఐక్యతకు వ్యతిరేకమని చెప్పారు. ‘రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని ఆమోదించనందుకే ఆరెస్సెస్‌ను గతంలో నిషేధించారు. దేశంకంటే హిందూత్వమే తనకు ఎక్కువని ప్రతి ఆరెస్సెస్‌ సభ్యుడు ప్రతిజ్ఞ చేస్తాడు. ప్రభుత్వ ఉద్యోగి ఆరెస్సెస్‌ సభ్యుడైతే అతడు దేశం పట్ల విశ్వసనీయతతో ఉండలేడు’ అని అయన ఎక్స్‌లో స్పందించారు.

మహాత్మాగాంధీని ఆరెస్సెస్‌ సభ్యుడు నాథూరాం గాడ్సే హత్య చేసిన అనంతరం 1948లో ఆ సంస్థను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ‘గాంధీ హత్యానంతరం ఆరెస్సెస్‌ను సర్దార్‌ పటేల్‌ 1948లో నిషేధించారు. అయితే.. మంచిగా ఉంటామన్న హామీ మేరకు నిషేధాన్ని తర్వాత తొలగించారు. అప్పటికీ ఆరెస్సెస్‌ నాగపూర్‌లోని తన ప్రధాన కార్యాలయంలో ఎన్నడూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయలేదు’ అని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ తెలిపారు. ఈ ఉత్తర్వులు ఎత్తివేసిన సమయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘2024 జూన్‌ 4 తర్వాత ‘స్వీయ అభిషిక్త నాన్‌ బయొలాజికల్‌’ ప్రధానికి, ఆరెస్సెస్‌ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

వాజ్‌పేయి హయాంలో కూడా ఉన్న ఈ 58 ఏళ్ల నిషేధాన్ని జూలై 9, 2024న ప్రధాని ఎత్తివేశారు’ అని పేర్కొన్నారు. ‘బహుశా అధికారులు ఇప్పుడు నిక్కర్లు వేసుకుని కూడా విధులకు హాజరుకావచ్చునేమో’ అని జైరాం రమేశ్‌ సెటైర్‌ వేశారు. 2016లో ఖాకీ ప్యాంట్స్‌కు మారడానికి ముందుక ఆరెస్సెస్‌ సభ్యులు ఖాకీ నిక్కర్లు ధరించేవారు. దీన్ని ఉద్దేశించి జైరాం రమేశ్‌ ఈ వ్యాఖ్య చేశారు.
ఇదిలా ఉంటే.. ప్రభుత్వ చర్యను ఆరెస్సెస్‌ స్వాగతించింది. దేశ ప్రజాస్వామిక వ్యవస్థను ఈ చర్య మరింత బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించింది. గత ప్రభుత్వాలు సొంత రాజకీయ ప్రయోజనాలకోసమే గతంలో నిషేధం విధించాయని విమర్శించింది.