ఆరెస్సెస్‌ దేశంలోనే అత్యంత అవినీతికర ముఠా అంటున్న బీజేపీ ఎమ్మెల్యే!

దేశంలోనే అత్యంత అవినీతికర సంస్థ అని ఒక ఎమ్మెల్యే చెబుతున్నారు. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు.. కర్ణాటకలోని తూమకూరు బీజేపీ ఎమ్మెల్యే..

  • By: TAAZ |    national |    Published on : Oct 21, 2025 10:04 PM IST
ఆరెస్సెస్‌ దేశంలోనే అత్యంత అవినీతికర ముఠా అంటున్న బీజేపీ ఎమ్మెల్యే!

ఎవరెవరు ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడారో అన్నీ తవ్వి తీస్తున్న సాంకేతిక యుగంలో ఉన్నాం. ఈ క్రమంలో అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు బయటపడుతూ ఉంటాయి. పాతవే అయినా ఆ వీడియోలో చేసిన కామెంట్ల కారణంగా అవి మళ్లీ వైరల్‌ అయి.. నెట్టింట చర్చలకు దారి తీస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

బీజేపీ తూమకూరు ఎమ్మెల్యే బీ సురేశ్‌ గౌడ గతంలో ఆరెస్సెస్‌కు వ్యతిరేకంగా, భూకంపం పుట్టించే స్థాయిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే అత్యంత అవినీతికర ముఠాగా ఆరెస్సెస్‌ను ఆయన అభివర్ణించారు. అది ముసుగులో నుంచి వ్యవస్థలను నడిపిస్తున్నదని ఆరోపించారు. తన అనుచరులతో ప్రైవేటుగా సంభాషిస్తున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, ఆరెస్సెస్‌కు మధ్య పెద్ద స్థాయిలోనే వివాదం నడుస్తున్నది. అన్ని బహిరంగ ప్రదేశాల్లో ఆరెస్సెస్‌ కార్యకలాపాలను నిషేధించేందుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాజాగా వైరల్‌ అయిన పాత వీడియో సంచలనం రేపుతున్నది. ఈ సంభాషణ ఏదో గుసగుసల తరహాలో కాకుండా.. తన అనుచరులతో సంభాషిస్తూ చేసినవి కావడం గమనార్హం. దేశానికి నైతిక రక్షకులుగా చెప్పుకొనే ఆరెస్సెస్‌ బండారం పూర్తి స్థాయిలో ఈ వీడియో ద్వారా బయటపడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని యావత్‌ ప్రపంచం గమనిస్తున్నదని నెటిజన్లు పేర్కొంటున్నారు.

వాస్తవానికి ఈ వీడియో క్లిప్పింగ్‌ 2018 నాటికి చెందినది. అయినప్పటికీ తాజాగా వెలుగు చూసిన తర్వాత ఈ వీడియోకు 4 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. పదివేలకు పైగా లైక్స్‌ లభించాయి. దీనిపై పెద్ద ఎత్తున ఎక్స్‌లో చర్చ జరుగుతున్నది. వాస్తవాలు తెలుసుకోవడానికి లేట్‌ అయినా ఫర్వాలేదని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. కొందరేమో దీనిన ఔట్‌డేటెడ్‌ అంటూ కొట్టిపారేశారు. మొత్తంగా అటు ఆరెస్సెస్‌ అనుకూల వాదనలు, ఇటు వ్యతిరేకత వ్యక్తమైంది. గౌడ.. గత 2023 ఎన్నికల్లో కూడా బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఏది ఏమైనా ఆరెస్సెస్‌పై బీజేపీ నాయకుల్లో ఉన్న వాస్తవ అవగాహనకు ఈ వీడియో అద్దం పట్టిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.