Karnataka Congress crisis| హస్తినకు చేరిన కర్ణాటక కాంగ్రెస్ పవర్ పంచాయతీ
కర్ణాటక కాంగ్రెస్ లో సీఎం పీఠం పంచాయతీ ఢిల్లీకి చేరింది. సిద్ధరామయ్య ప్రభుత్వానికి గురువారంతో రెండున్నర ఏళ్లు పూర్తయ్యింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రెండున్నర ఏళ్ల తర్వాత తనకు సీఎం పీఠం అప్పగించాలంటూ డీకే శివకుమార్ కోరుకుంటున్నారు. డీకే వర్గం ఢిల్లీకి చేరుకుని కాంగ్రెస్ హైకమాండ్ ముందు తమ డిమాండ్ అమలుకు పట్టుబడుతుండటంతో కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
న్యూఢిల్లీ : కర్ణాటక కాంగ్రెస్ (Karnataka Congress)లో సీఎం పీఠం(CM dispute) పంచాయతీ ఢిల్లీకి చేరింది. సిద్ధరామయ్య(Siddaramaiah) ప్రభుత్వానికి గురువారంతో రెండున్నర ఏళ్లు పూర్తయ్యింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రెండున్నర ఏళ్ల తర్వాత తనకు సీఎం పీఠం అప్పగించాలంటూ డీకే శివకుమార్( DK Shivakumar) కోరుకుంటున్నారు. ఇదే డిమాండ్ తో డీకే. శివకుమార్ వర్గం ముగ్గురు మంత్రులు, 10ఎమ్మెల్యేలు శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్, రాహుల్ గాంధీలను కలిసి తమ డిమాండ్ ను వినిపించబోతున్నారు. సీఎం సిద్ధరామయ్యను మార్చాలంటూ డీకే వర్గం ఎమ్మెల్యేలు గట్టిగా కోరుతున్నారు.
మరోవైపు ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్ విస్తరణ కోసం అనుమతించాలని సిద్ధరామయ్య కాంగ్రెస్ హైకమాండ్ ను కోరారు. అయితే దీనిపై రాష్ట్రానికే చెందిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ నుంచి ఎలాంటి స్పందన లభించలేదు. కేబినెట్ విస్తరణ జరిగితే తన పదవికి ఢోకా ఉండదని సిద్దరామయ్య భావిస్తున్నారు. ప్రస్తుతం 136 మంది ఎమ్మెల్యేల్లో అత్యధికులు తనకు మద్దతుగా ఉన్నారని ఆయన నమ్ముతున్నారు. పీసీసీ చీఫ్ గా ఉన్న డీకే మాత్రం ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు అధికార మార్పిడి జరిగి తీరాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు
మూడు వర్గాలుగా చీలిన కర్ణాటక కాంగ్రెస్
సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ల మధ్య అధికార మార్పిడి ఒప్పందం పంచాయతీ నెలకొన్న నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మూడు వర్గాలుగా చీలిపోయారు. అధిష్టానం, సిద్ధరామయ్య వర్గం, డీకే వర్గాలుగా కర్ణాటక కాంగ్రెస్ చీలిపోగా..ఎవరికి వారు అధికార పీఠం కోసం రాజకీయ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమితో ఢీలా పడిన కాంగ్రెస్ హైకమాండ్ కు కర్ణాటక కాంగ్రెస్ అంతర్గత కలహాలు మరింత తలనొప్పిగా మారాయి. సీఎం పీఠం నుంచి సిద్దరామయ్యను తప్పిస్తే ఆయన వర్గం అసమ్మతి రేపవచ్చని..డీకేకు సీఎం పగ్గాలు ఇవ్వకపోతే ఆయన వర్గం నుంచి తిరుగుబాటు తలెత్తవచ్చని హైకమాండ్ ఆందోళన చెందుతుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ లో రేగిన అధికార మార్పిడి పంచాయతీని ఆ పార్టీ అధిష్టానం ఎలా పరిష్కరించబోతుందన్నది రసవత్తరంగా మారింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram