Karraguttalu road construction| కర్రెగుట్టల్లో రహదారి నిర్మాణ పనులు షురూ
కర్రెగుట్టల పరిధిలో ఉన్న ఆదివాసీ గూడెలకు రోడ్లు, మౌలిక వసతుల కల్పించేందుకు క్రమంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ముందుగా ముర్మూరు సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంపు నుంచి కర్రెగుట్టకు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. రోడ్డు నిర్మాణ పనులకు గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్ శంకుస్థాపన చేశారు.
విధాత : నిన్న మొన్నటి వరకు మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న కర్రెగుట్టలు(Karraguttalu)..ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర భద్రతా బలగాల స్థావరాలకు అడ్డాగా మారిపోయింది. మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం.. ఆపరేషన్ కగార్ దెబ్బకు కర్రెగుట్టలను మావోయిస్టులు ఖాళీ చేయడంతో..మరోసారి అక్కడ తీవ్రవాద కార్యకలాపాలకు అస్కారం ఇవ్వకుండా భద్రతా బలగాలు బేస్ క్యాంపు ఏర్పాటు చేసుకున్నాయి. అంతేకాదు. కర్రెగుట్టల పరిధిలో ఉన్న ఆదివాసీ గూడెలకు రోడ్లు, మౌలిక వసతుల కల్పించేందుకు క్రమంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ముందుగా ముర్మూరు సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంపు నుంచి కర్రెగుట్టకు రోడ్డు నిర్మాణ పనులు(road construction)చేపట్టారు. రోడ్డు నిర్మాణ పనులకు గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్ శంకుస్థాపన చేశారు. వాజేడు మండలం ముర్మూరు గ్రామం నుంచి పామునూరు గ్రామం (గుట్టల్లో ఉన్న గ్రామం) వరకు సుమారు 8 కిలోమీటర్లు రహదారి నిర్మిస్తున్నారు. పామునూరు నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని గ్రామాలకు రహదారులు నిర్మిస్తున్నట్లు డీజీ తెలిపారు.
మారుమూల గూడెలకు మౌలిక వసతులు
ముర్మూరు నుంచి పామునూరు, జెల్లా, డోలి, తడ్పల, చెలిమల గ్రామాల మీదుగా కర్రెగుట్టల వరకు రహదారి నిర్మాణ జరుగనుంది. సాయుధ బలగాల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని గిరిజనులకు మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసి వారి మద్దతును మావోయిస్టుల నుంచి దూరం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. బీజాపూర్ జిల్లాలోని ఉసూర్ ప్రాంతంలోని తడ్పాల గ్రామం సమీపంలో భద్రతా దళాలు ‘సురక్ష ఏవం జన్ సువిధ శిబిరం’ను ఏర్పాటు చేశారు. మారుమూల గ్రామాలలో అభివృద్ధిని సులభతరం చేయడానికి ఉద్దేశించిన ‘నియాద్ నెలా నార్’ పథకం కింద, రోడ్డు కనెక్టివిటీ, విద్యుత్ సరఫరా, నీటి సౌకర్యాలు, ఆరోగ్య సంరక్షణ విస్తరణ, పాఠశాల, అంగన్‌వాడీ స్థాపన, మొబైల్ నెట్‌వర్క్ సేవలను ఏర్పాటు చేయన్నారు.
నాడు మావోయిస్టు అడ్డా..
తెలంగాణ-చత్తీస్ గఢ్ సరిహద్దుల ప్రాంతంలో విస్తరించి ఉన్న కర్రెగుట్టలు కేంద్రంగా ఇన్నాళ్లుగా మావోయిస్టులు జోరుగా తమ కార్యకలాపాలు సాగించారు. గుట్టలు అత్యంత ఎత్తుగా, దట్టమైన చెట్లతో, లోయలతో కూడిన ప్రాంతం. బలగాలు సులభంగా లోపలికి చొచ్చుకుపోవడానికి వీలుండదు. ఈ క్లిష్టమైన భూభాగం గెరిల్లా యుద్ధానికి, అజ్ఞాతంలో ఉండటానికి అనుకూలంగా ఉంటాయి. ఒక రాష్ట్రం నుంచి పోలీసుదాడి ఎదురైతే..మరో రాష్ట్రం వైపుగా పారిపోయే వీలుంటుంది. ఈ గుట్టలపై మావోయిస్టు అగ్రనాయకులకు చెందిన బంకర్లు (భూగర్భ స్థావరాలు) కూడా ఉన్నాయి. ఇవి దీర్ఘకాలికంగా వారు ఆశ్రయం పొందడానికి, సమావేశాలకు వేదికగా ఉపయోగపడ్డాయి. 4 వేల వరకు మావోయిస్టులు ఈ గుట్టలపై స్థావరాల్లో ఉన్నట్లు గతంలో అంచనా వేశారు. ‘ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’ పేరుతో ఏప్రిల్-మే నెలల్లో, కర్రెగుట్ట కొండల చుట్టూ ఉన్న దట్టమైన అడవులలో కేంద్ర, రాష్ట్ర భద్రతా దళాలు 21 రోజుల ఆపరేషన్ నిర్వహించాయి. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలో.. ఇటు తెలంగాణ ములుగు వాజేడు మండలం పరిధిలో విస్తరించి ఉన్న కర్రెగుట్టలపై చేపట్టిన ‘సేవ్ కర్రెగుట్టలు’ ఆపరేషన్ లో 20వేలకు పైగా సాయుధ బలగాల సిబ్బంది మావోల ఏరివేత కార్యక్రమాలు నిర్వహించారు. డ్రోన్‌లు, హెలికాఫ్టర్‌లతో కూంబింగ్ కొనసాగించారు. డీఆర్‌జీ బస్తర్ ఫైటర్, కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ సైనికులు ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మరణించిన సంగతీ తెలిసిందే. ఈ సమయంలో 31 మంది మావోయిస్టులను హతమార్చారు. భద్రత బలగాల ధాటికి హిడ్మా సహా మావోయిస్టులంతా కర్రెగుట్టలను వదలి వెళ్లపోగా… సాయుధ బలగాలు గుట్టలపై జాతీయ జెండాను ఎగరేశాయి.
ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ గానూ పిలిచే ఈ ఆపరేషన్స్ లో 214 నక్సల్స్ రహస్య స్థావరాలు, బంకర్లను ధ్వంసం చేశామని భద్రతా దళాల అధికారులు అప్పట్లో ప్రకటించారు. 450 ఐఈడీలు, 818 బీజీఎల్ షెల్స్, 899 కట్టల కోడెక్స్, డిటోనేటర్లు, భారీ మొత్తంలో పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.దాదాపు 12 వేల కిలోల ఆహార పదార్ధాలను సైతం కైవసం చేసుకున్నామని, 4 ఆయుధ తయారీ యూనిట్లు ధ్వంసం చేశామని తెలిపారు. జీఎల్ షెల్స్, హోం మేడ్ వెపన్స్, ఐఈడీలు, ఇతర మారణాయుధాల తయారీకి మావోయిస్టులు వాడే నాలుగు యూనిట్లను ధ్వంసం చేశామని వెల్లడించారు. కర్రెగుట్టలపై కర్రెగుట్టలపై PLGA, DJASDC, TAC, CRC వంటి ప్రధాన నక్సల్ సంస్థల ఏకీకృత కేంద్ర కార్యాలయం ఉండటంతోపాటు నక్సల్స్ శిక్షణ ఆయుధ తయారీ సైతం జరిగేదని గుర్తించారు.
నేడు భద్రతా బలగాల శిక్షణ కేంద్రం..
160 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కర్రెగుట్టలను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. తర్వా త అక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేశాయి. తెలంగాణ సరిహద్దు వాజేడు మండలం మొరుమూరు వద్ద CRPF-39 వ బెటాలియన్ బేస్ క్యాంప్ ను సీఆర్‌పిఎఫ్ ఐజీ త్రివిక్రమ్ చేతుల మీదుగా ప్రారంభించారు. సీఆర్‌పీఎఫ్, కోబ్రా దళాలకు చెందిన 196, 205 బెటాలియన్లకు ఈ క్యాంపు ఎఫ్‌వోబీ(ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్)గా ఉపయోగపడనుందని భద్రతాధికారులు ప్రకటించారు. బీజాపూర్ జిల్లాలోని కర్రెగుట్టల్లో వార్‌ఫైర్ స్కూల్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన 700 ఎకరాల భూమిని కర్రెగుట్టలో కేటాయిస్తూ చత్తీస్‌గఢ్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. భద్రత బలగాలకు అడవి యుద్ధం, ఫీల్డ్‌క్రాఫ్ట్, వ్యూహాలు, ఇతర ఆచరణాత్మక శిక్షణా మాడ్యూళ్ల కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రంగా ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram