Drishyam type Murder | కేరళలో ‘దృశ్యం’ తరహా మర్డర్.. భార్యను హత్య చేసి పాతిపెట్టిన భర్త!
కేరళలో ‘దృశ్యం’ సినిమా తరహాలో భయంకర హత్య జరిగింది. భార్యకు అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో భర్త ఆమెను గొంతు నులిమి చంపి, పాతిపెట్టాడు. పోలీసులు విచారణలో భయానక నిజాలు బయటపెట్టాడు.
Kerala ‘Drishyam-style’ murder: Husband kills wife, buries body near construction site
(విధాత నేషనల్ డెస్క్)
కేరళ : అనుమానం పెనుభూతమై భార్యను హత్యచేశాడు ఓ భర్త. గొంతు నులిమి సుత్తితో కొట్టి ఎవరికీ తెలియకుండా భూమిలో పూడ్చిపెట్టాడు. దృశ్యం సినిమా సన్నివేశాన్ని పోలి ఉన్న ఈ దారుణ ఘటన కేరళలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లా ధారపారాకు చెందిన సోని ఎస్కే (31), తన భార్య అల్పనా ఖాతూన్(28)తో కలిసి అయర్కున్నంలో నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సోని తన భార్యను హత్య చేసి, మృతదేహాన్ని దాచిపెట్టేందుకు ‘దృశ్యం’ సినిమా తరహాలో పథకం పన్నాడు. భార్యను హత్య చేసిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా వారు పనిచేసే నిర్మాణంలో ఉన్న ఇంటి సమీపంలోనే పాతిపెట్టాడు. కాగా, ఏమీ తెలియనట్లు అక్టోబర్ 14న తన భార్య అదృశ్యమైనట్లు సోని ఎస్కే, 17న అంటే మూడు రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను ఉదయం 8 గంటలకు సరుకుల కోసం మార్కెట్‌కు వెళ్ళడానికి భార్యతో కలిసి వెళ్ళానని, సాయంత్రం 6:30 గంటలకు పని నుంచి తిరిగి వచ్చేసరికి ఆమె ఇంట్లో లేదని తన వాంగ్మూలంలో సోని పేర్కొన్నాడు.
పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వెంకటేశ్ కాదు కదా.!
అయితే, సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఫిర్యాదు చేయడం, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలో ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సోనిపై అనుమానం బలపడింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 4 గంటలకు విచారణకు హాజరు కావాలని పోలీసులు సోనిని ఆదేశించారు. కానీ, అతను సహకరించకుండా, తన పిల్లలతో కలిసి పశ్చిమ బెంగాల్‌కు రైలు ఎక్కేందుకు ఎర్నాకుళం రైల్వే స్టేషన్ కు వెళ్ళాడు. సమాచారం అందుకున్న పోలీసులు, సోనిని రైల్వే స్టేషన్‌లోనే అదుపులోకి తీసుకుని విచారించగా, సోని తన భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. అక్టోబర్ 14న ఉదయం నిర్మాణ స్థలంలోనే ముందుగా తన భార్యను గొంతు నులిమి చంపి, ఆ తర్వాత ఇనుప రాడ్‌తో ఆమె తలపై కొట్టినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతోనే సోని ఈ హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
సోని ఇచ్చిన సమాచారం మేరకు, పోలీసులు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నిందితుడిని హత్య జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపి మృతదేహాన్ని వెలికితీశారు. అన్ని విధివిధానాలు పూర్తి చేసి, నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి అరెస్టు నమోదు చేశారు. అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram