సర్కస్ లో భాగంగా చేసిన ‘సజీవ సమాధి’ స్టంట్ బెడిసి కొట్టి ఓ వ్యక్తి నిజంగానే ప్రాణం కోల్పోయిన ఘటన విషాదం రేపింది. హర్యానాలోని నూహ్ జిల్లా తౌరు సబ్‌డివిజన్ పరిధిలోని ఖోరీ కలాన్‌లో జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది. ఖోరీ కలాన్ గ్రామంలో వారం రోజులుగా ఓ ట్రావెలింగ్ సైకిల్ సర్కస్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో ఫరీదాబాద్ జిల్లా గౌంచి గ్రామానికి చెందిన దీపక్(27) కీలక పాత్ర పోషించాడు. సైకిల్‌పై ప్రమాదకర విన్యాసాలు చేయడంలో అతడికి మంచి పేరు ఉంది. కళ్లకు గంతలు కట్టుకుని నడపడం, హ్యాండిల్‌పై నిలబడి బ్యాలెన్స్ చేయడం, కదులుతున్న సైకిల్‌పై నిలుచుని ప్రదర్శనలు ఇవ్వడం వంటి స్టంట్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే సర్కస్ చివరి రోజు దీపక్ ఓ ప్రత్యేక విన్యాసం చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ స్టంట్ కాస్తా అతడి ప్రాణాలను బలిగొంది.
సర్కస్ బృందానికి చెందిన దీపక్ ‘సజీవ సమాధి’ స్టంట్ చేశాడు. నిర్వాహకులు ఓ సంచిలో దీపక్‌ని బంధించి, సజీవ సమాధి కోసం తవ్విన గుంతలోకి దించి దాన్ని కప్పేశారు. 24 గంటల తర్వాత అతడ్ని సజీవంగా బయటకు తీస్తామని సర్కస్ నిర్వాహకులు చెప్పారు. అయితే మరో 12 గంటలు ఆలస్యంగా, అంటే 36 గంటల తర్వాత బయటకు తీయగా, అతను అప్పటికే చనిపోయాడు. ఎక్కువసేపు సమాధిలో ఉండటం వల్ల.. ఊపిరి ఆడక దీపక్ చనిపోయాడు.
దీపక్‌ను బయటకు తీయాలంటే రూ.7,100 సేకరించాల్సి ఉందని నిర్వాహకులు ప్రేక్షకులకు చెప్పినట్లు గ్రామస్తులు వెల్లడించారు. ఆ మొత్తాన్ని సేకరించే ప్రక్రియలోనే ఆలస్యం జరిగిందని, దీంతో దీపక్ ను భూ గర్బం నుంచి బయటకు తీయడంలో ఆలస్యమవ్వడంతో అతని ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చిందన్న వాదన తెరపైకి వచ్చింది.ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకుండా ఇలాంటి ప్రమాదకర స్టంట్లను నిర్వహించడంతోనే ప్రమాదం జరిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దీపక్ కుటుంబం ఆందోళన చేపట్టింది.
ఆరు రోజుల పాటు తన సైకిల్ స్టంట్లతో జనాలను అలరించిన 27 ఏళ్ల దీపక్.. ఏడో రోజు చేసిన ‘లైవ్ బరియల్’ (సజీవ సమాధి) స్టంట్‌లో మృతి చెందాడం స్థానిక గ్రామస్తులను సైతం కలిచివేసింది. కేవలం ఏడు వేల రూపాయల కోసం నిర్వాహకులే అతని ప్రాణాలను బలిగొన్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
