రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షీ నటరాజన్ గెలుస్తుందా?

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ విజయం ఉత్కంఠగా మారింది. బీజేపీ మూడో అభ్యర్థి బరిలో ఉండటంతో క్రాస్ ఓటింగ్ చర్చనీయాంశమైంది.

మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. శాసన సభలో బలాబలాలను అనుసరించి అధికార బీజేపీకి కచ్చితంగా రెండు సీట్లు, కాంగ్రెస్ కు ఒక సీటు దక్కే పరిస్థితి ఉంది. అయితే బీజేపీ మూడో స్థానం గెలిచేందుకు అభ్యర్తిని నిలబెట్టడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ బీజేపీకి మూడో సీటు వస్తుందని చెప్పడంతో…ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షీ నటరాజన్‌ విజయంపై ఉత్కంఠత నెలకొంది. మూడో స్థానం కోసం ఆమె పోటీపడుతున్నారు.

మూడో స్థానం గెలిచేందుకు 9 ఓట్ల దూరంలో బీజేపీ

రాష్ట్ర అసెంబ్లీలో మొత్తంగా 230 స్థానాలుండగా, బీజేపీకి సొంతంగా 165 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 64 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఒక స్థానం ఖాళీగా ఉంది. ఒక్కో రాజ్యసభ అభ్యర్థి గెలవడానికి సుమారు 58 ఓట్లు అవసరం. బీజేపీకి ఉన్న బలంతో ఇద్దరు బీజేపీ అభ్యర్థులు చెరో 58 ఓట్లతో సులువుగా విజయం సాధించగలరు. ఇంకా ఆ పార్టీ వద్ద మరో 49 ఓట్లు మిగులుతాయి. బీజేపీ మూడో అభ్యర్థిని బరిలోకి దించండంతో ఈ స్థానం గెలిచేందుకు ఆ పార్టీకి 9 ఓట్లు ప్రతిపక్షం నుంచి రావాల్సి ఉంటుంది. తాజా పరిణామాలతో కాంగ్రెస్‌ను క్రాస్‌ ఓటింగ్‌ భయం వెంటాడుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో కలకలం మొదలైంది. మధ్యప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా తరుణ్‌ చుగ్, రజనీష్‌ అగర్వాల్‌ పోటీకి దిగారు. బీజేపీ తమ మూడో అభ్యర్థిగా మహేష్ కేవత్ ను బరిలోకి దించింది. కాంగ్రెస్‌ ఒక స్థానం గెలుచుకొనే అవకాశాలు ఉండటంతో మీనాక్షి నటరాజన్‌ ను బరిలో నిలిపారు.

తెలంగాణకు మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

మధ్యప్రదేశ్ లో అనూహ్యంగా బీజేపీ మూడో అభ్యర్థిని బరిలోకి దించడంతో..క్రాస్ ఓటింగ్ నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు తరలించాలని నిర్ణయించింది. జూన్ 18న జరగనున్న పోలింగ్ లో క్రాస్ ఓటింగ్ జరగకుండా ఇరు పార్టీలు తమ ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించడంతో మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారిపోయాయి. అయితే మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించడంపై బీజేపీ పలు విమర్శలు గుప్పిస్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ కు తెలంగాణ ఏటీఎంగా మారిందని, ఆ పార్టీ క్యాంపు రాజకీయాలకు రాష్ట్రాన్ని కాంగ్రెస్ అడ్డాగా మార్చిందని తెలంగాణ బీజేపీ నాయకత్వం విమర్శలు సంధిస్తుంది.

Latest News