సంఘ్ పరివార్‌కు సీఎస్ఆర్ నిధులు వరద..

సీఎస్‌ఆర్‌ నిధులు! కార్పొరేట్‌ సంస్థలు.. తమ లాభాల నుంచి కొంత సమాజ శ్రేయస్సుకు వినియోగించే మొత్తాలు! అవి ప్రజలకు లబ్ధి కలిగించే పనుల కోసం కేటాయించడం ఆనవాయితీ! కానీ.. ఆ ఆనవాయితీ ఒక్కసారిగా బద్దలైపోయింది! 2014లో కేంద్రంలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత.. మతపరమైన సంస్థ ఆరెస్సెస్... దాని పరివారానికి సైతం యథేచ్ఛగా అందుతున్నాయి. అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నది నాటి ఓఎన్‌జీసీ.. నేటి గ్యాస్‌ అండ్‌ ఆయిల్‌ కంపెనీ!!

Reported by: Jagan Mohan Talluri | జాతీయం | Edited by: విధాత భారత్ డెస్క్ | Jul 22, 2026, 7:30 pm IST
Read Time: 20 mins
సంఘ్ పరివార్‌కు సీఎస్ఆర్ నిధులు వరద..

హైలైట్స్:

  • వందల కోట్లు సమర్పించుకున్న ఓఎన్జీసీ
  • ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలకే రూ.668 కోట్లు లబ్ధి
  • బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యథేచ్ఛగా..

కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత అన్ని రంగాల్లో కాషాయశక్తుల చొరబాటు పెరిగిపోతూ వస్తున్నది. ఆయా రంగాల్లో వీలైతే నిధులు కొట్టేయడం.. లేదంటే ఆక్కడ కాషాయికరణ చేయడమే ప్రధాన లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు, హిందూ సంస్థలు నిర్విరామంగా పనిచేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని నవరత్న కంపెనీలలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ)కి మంచి పేరున్నది. ప్రస్తుతం దీన్ని గ్యాస్ అండ్ ఆయిల్ కంపెనీగా మార్చారు. దేశంలో క్రూడాయిల్ నిల్వలు కనుగొనడం, బయటకు తీయడం, ఉపాధి కల్పించడం ఈ ప్రభుత్వ రంగ సంస్థ ప్రధాన ఉద్దేశం. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సంస్థపై కమలనాథుల కన్ను పడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కార్పొరేట్ సొషల్ రెస్పాన్సిబులిటి (సీఎస్ఆర్) నిధులను కొల్లగొట్టడం మొదలైంది. ఇప్పటి వరకు ఈ సంస్థ నుంచి గత పదేళ్లలో రూ.668 కోట్లు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు లేదా హిందూ సంస్థలకు మళ్లించారని తెలుస్తున్నది. సంఘ్‌పరివార్‌లోని ఇరవై సంస్థలు ఈ ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా భారీగా లబ్ధి పొందినట్టు సమాచారం. సాధారణంగా మతపరమైన కార్యక్రమాలు, హిందుత్వ భావజాలం ప్రేరేపించే సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లో ఈ నిధులు ఇవ్వకూడదు. కానీ ఓఎన్జీసీ మాత్రం అందుకు మినహాయింపు ఇచ్చేసింది. రాజ్యాంగ నిబంధనలను కాలరాసి సంఘ్ అనుబంధ సంస్థలకు నిధులు మంజూరు చేసి స్వామి భక్తి నిరూపించుకున్నది. దేశంలో పేరొందిన కొన్ని సంస్థలు కూడా సీఎస్ఆర్ కింద నిధులు పుచ్చుకుని, ఆ నిధులను తామే ఖర్చు చేస్తున్నట్లుగా ప్రచార, ప్రసార సాధనాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నాయి. ఆర్ఎస్ఎస్‌తోపాటు హెల్పేజీ ఇండియా, బ్రహ్మకుమారీస్ సంస్థ, అక్షయపాత్ర ఫౌండేషన్, భగవాన్ మహవీర్ వికలాంగ్ సహాయతా సమితి వంటి వాటికి కూడా భూరీగా నిధులు ఇచ్చాయి.

ఆర్ఎస్ఎస్‌ను వదిలేసి స్వచ్ఛంద సంస్థలకు మూకుతాడు…

ఆరెస్సెస్‌ దేశంలో అనేక సార్లు నిషేధానికి గురైన సంస్థ. ఇప్పటి వరకు ఈ సంస్థ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదు. ఈ విషయంలో ఇప్పటికే ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఈ సంస్థ లావాదేవీలను మాత్రం ఏ ప్రభుత్వ విభాగం కోరకపోవడం గమనార్హం. వాస్తవానికి.. విదేశాల నుంచి నిధులు తీసుకుంటున్న సంస్థలు లెక్కలు చెప్పాలని, లేనిపక్షంలో ఎఫ్‌సీఎన్ఆర్ఏ రద్దు చేస్తామని కేంద్ర హోం శాఖ వేల స్వచ్ఛంద సంస్థలను భయభ్రాంతులకు గురి చేసింది. బ్యాంకు ఖాతాలు వివరాలు, నిధులు ఎక్కడెక్కడ ఖర్చు చేశారో ఆడిట్ వివరాలు సమర్పించాలని హుకుం జారీ చేసి మూకుతాడు వేసింది. కేంద్రం విధించిన కఠిన నిబంధనలతో వేల కొద్దీ స్వచ్ఛంద సంస్థలు నిధుల లేమితో తమ సేవా కార్యక్రమాలను నిలిపివేశాయి. కానీ ఇంత వరకూ రిజిస్టర్‌ కాని ఆర్ఎస్ఎస్‌కు మాత్రం వందల కోట్ల విరాళాలు వచ్చి పడుతున్నా.. అడిగేవారే కరువయ్యారు.

ఢిల్లీలో కార్పొరేట్ కార్యాలయాన్ని తలదన్నేలా రూ.150 కోట్లతో 300 గదులతో బహుళ అంతస్తుల భవనం ఆరెస్సెస్‌కు ఉన్నది. ఆరెస్సెస్‌ సర్ సంఘ్ చాలక్ మోహన్ మధుకర్ భాగవత్ ఒక సందర్భంలో మాట్లాడుతూ, తమది వ్యక్తులతో ఏర్పాటు అయిన సమూహమని, అందువల్లే రిజిస్ట్రేషన్ చేయలేదని ఎలాంటి జంకు గొంకు లేకుండా ప్రకటించుకోవడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. వలంటీర్ల నుంచి గురుదక్షిణ కింద టాక్స్ ఫ్రీ సొమ్ములు తీసుకుంటున్నామని, ఇది ఒక విద్యార్థి ఉపాధ్యాయుడికి ఇచ్చే గురుదక్షిణతో సమానమని తేల్చేశారు. అయితే ఈ గురుదక్షిణ కింద ఎన్ని వేల మంది నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు వసూలు అయ్యాయనేది మాత్రం బహిరంగంగా వెల్లడించలేదు. ఈ విషయాన్ని ప్రశ్నిస్తే ఇలాంటి సంబంధం లేని మాటలు మాట్లాడి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

"మాది వ్యక్తులతో ఏర్పాటు అయిన సమూహం అందువల్లే రిజిస్ట్రేషన్ చేయలేదు. వలంటీర్ల నుంచి గురుదక్షిణ కింద టాక్స్ ఫ్రీ సొమ్ములు తీసుకుంటున్నాం. ఇది ఒక విద్యార్థి ఉపాధ్యాయుడికి ఇచ్చే గురుదక్షిణతో సమానం."

- ఆరెస్సెస్‌ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్

దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ఆధీనంలో, అనుబంధంగా రిజిస్ట్రేషన్ లేని సంస్థలు వేల కొద్దీ ఉన్నాయి. కొన్ని సంస్థలు విదేశాల నుంచి నిధులు కూడా పొందుతున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్ఎస్ఎస్‌కు ఎదురు లేకుండా పోయిందనే వాదనలు ఉన్నాయి. పలు పబ్లిక్ సెక్టార్ కంపెనీలు, ప్రైవేటు కంపెనీల నుంచి సీఎస్ఆర్ కింద, డొనేషన్ల రూపంలో భారీ ఎత్తున నిధులను పొందుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అది ఏకంగా దేశంలోనే పేరొందిన ఓఎన్జీసీ సంస్థ సీఎస్ఆర్ కింద సంఘ్‌తో సంబంధం ఉన్న 20 సంస్థలకు ఉదారంగా రూ.668 కోట్ల గ్రాంట్లు మంజూరు చేసేదాకా వెళ్లింది.

విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం.. అసోం రాష్ట్రంలోని శివసాగర్‌లో స్యూ కా ఫా ఆసుపత్రి (డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వైద్యకియా ప్రతిష్టాన్) 300 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం రూ.434 కోట్లు సీఎస్ఆర్ నిధులు విడుదల చేసింది. నాగపూర్‌లోని డాక్టర్ ఆబాజీ తట్టె సేవా ఔర్ అనుసంధాన్ సంస్థ నిర్మాణం చేసిన క్యాన్సర్ ఆసుపత్రికి రూ.140 కోట్లు విడుదల చేసింది. సీఎస్ఆర్ నిధులను వాస్తవానికి ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు వెచ్చించాలి. ఇలా వెచ్చించిన నిధులు సద్వినియోగం కావడమే కాకుండా ఎలాంటి విమర్శలు రావు. ఉదాహరణకు ఒక గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మాణం లేదా, రెండు గ్రామాల మధ్య నదులు, వాగులపై వంతెనల నిర్మాణం, ప్రభుత్వ ఆసుపత్రుల అంబులెన్స్‌లు.. ఇటువంటివాటి కోసం నిధులు మంజూరు చేస్తే ఎవరూ కూడా శంకించే ప్రమాదం ఉండదు. కానీ బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు లేదా తమ పదవులు కాపాడుకునేందుకు ఓఎన్జీసీ ప్రభుత్వ రంగ సంస్థ దశాబ్దకాలంగా ఇష్టానుసారంగా హిందూ అనుబంధ సంస్థలకు నిధులు మంజూరు చేస్తూ స్వామి భక్తి ప్రదర్శిస్తుండటం విమర్శలకు తావిస్తున్నది.

ఓఎన్జీసీ సహజవాయువు అన్వేషణ, ఉత్పత్తి కార్యకలాపాలను ఏపీలోనే ఎక్కువగా నిర్వహిస్తున్నది. కాని ఏపీలో లేదా తెలంగాణలో ఎక్కడా తన సీఎస్ఆర్ నిధులను వెచ్చించకుండా ఇతర రాష్ట్రాలపై ఎనలేని మక్కువ ఎందుకు చూపిస్తున్నదనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో అసోంలోని కరీంగంజ్‌లో ఎస్ఎం దేవ్ సివిల్ హాస్పిటల్, కరీంగంజ్ సివిల్ హాస్పిటల్‌లో ఐసీయూ వెంటిలేటర్లు, రేడియోగ్రఫీ పరికరాల కోసం నిధులు విడుదల చేసింది. అదే విధంగా హరిద్వార్‌లో నర్సింగ్ ఆడిటోరియం, తమిళనాడు కోయంబత్తూరులో ఏడు అంగన్‌వాడీ భవనాల నిర్మాణం కోసం సాయం చేసింది. మహారాష్ట్ర ఠాణె నగరంలో చెరువులో చెత్తను తొలగించేందుకు యంత్రాలు, పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రులకు అంబులెన్స్‌ సౌకర్యం కల్పిస్తున్న సిఖ్ చారిటబుల్ ట్రస్టుకు సీఎస్ఆర్ నిధులు మంజూరు అయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల కల్పన కోసం సీఎస్ఆర్ నిధులు ఇవ్వడం వరకు బాగానే ఉంది. కానీ ప్రైవేటు సంస్థ అయిన బ్రహ్మకుమారీస్‌కు నిధులు ఇవ్వడం విమర్శలకు తావిస్తున్నది. హర్యానాలోని గురుగ్రామ్‌లోని బ్రహ్మకుమారీస్ రిట్రీట్ సెంటర్‌లో సోలార్ పవర్ ప్లాంట్ కోసం నిధులు ఇచ్చిన తీరు నవ్వుల పాలు చేస్తున్నది.

హెల్పేజీ ఇండియా, ఆక్షయపాత్ర లకు కూడా గ్రాంట్లు…

ఇకపోతే 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొబైల్ మెడికల్ యూనిట్ల కోసం హెల్పేజీ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థకు ఏకంగా రూ.7 కోట్లు మంజూరు చేసింది. వృద్ధుల సంక్షేమం కోసం పాటుపడుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్న సంస్థకు ఇంత పెద్ద మొత్తం ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది. కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద రోగులకు మధ్యాహ్న భోజనం, ఉదయం అల్పాహారం అందచేస్తున్నామని గొప్పగా అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రచారం చేసుకుంటున్నది. తామే నిధులు వెచ్చిస్తున్నామనే విధంగా పోజులు కూడా కొడుతున్నది. ఈ సంస్థ రాజస్థాన్, ఝార్ఖండ్ రాష్ట్రాలలో విద్యార్థులకు వాహనాల ద్వారా మధ్యాహ్న భోజనం పంపిణీ చేస్తున్నది. పాఠశాలలకు మధ్యాహ్న భోజనం చేరవేసే వాహనాల కొనుగోలుకు సీఎస్ఆర్ కింద నిధులు విడుదల చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అయిన బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలో మరుగుదొడ్ల నిర్మాణం, సోలార్ వీధి లైట్లు ఏర్పాటు, కేంద్రీయ విద్యాలయాలలో వసతుల కోసం రూ.53 కోట్లు గ్రాంట్లు విడుదల చేసింది. సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ ఎక్కడ కూడా ఉచితంగా మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడం లేదు. సులభ్‌తోపాటు భగవాన్ మహవీర్ వికలాంగ్ సహాయతా సమితికి కూడా సీఎస్ఆర్ గ్రాంట్లు ఇచ్చారు. వైల్డ్ లైఫ్ ట్రస్టు ఆఫ్ ఇండియా, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ ఇండియా, ఇండియన్ మౌంటెనేరింగ్ ఫౌండేషన్ వంటి వాటికి కూడా ఉదారంగా డబ్బులు ఇచ్చేశారు.

మోదీ యోగా కన్సల్టెంట్ సంస్థకు రూ.15.53 కోట్లు…

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి నాలుగు దశాబ్దాలుగా యోగా కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న హెచ్ఆర్ నాగేంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న స్వాసా సంస్థకు రూ.15.53 సీఎస్ఆర్ గ్రాంట్లు అందడం విశేషం. స్వామి వివేకానంద అనుసంధాన సంస్థాన (స్వాసా) పేరుతో బెంగళూరులో డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఒడిశా, అసోం రాష్ట్రాలలో హాస్టళ్ల నిర్మాణం, యోగా క్యాంపులు నిర్వహించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు. స్వాసాకు నాగేంద్ర వ్యవస్థాపకులుగా, చాన్సలర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ దేశ వ్యాప్తంగా నిర్వహించే యోగా కార్యక్రమాలకు ఈయన నేతృత్వం వహిస్తుంటారు.

సీఎస్ఆర్ నిధులు ఇచ్చినా రోగులపై ఫీజుల మోత…

అసోం శివసాగర్ జిల్లాలోని మూడు వందల పడకలు ఉన్న స్వర్గదేవ్ స్యూ కా ఫా ఆసుపత్రికి ఓఎన్జీసీ పెద్ద ఎత్తున సీఎస్ఆర్ గ్రాంట్లు మంజూరు చేయడం వివాదం అవుతోంది. ఈ ఆసుపత్రిని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వైద్యకియా ప్రతిష్టాన్ సహకారంతో ఓఎన్జీసీ నడుపుతోంది. స్యూ కా ఫా ఆసుపత్రి చైర్మన్‌గా వైద్యకియా ప్రతిష్టాన్ ట్రస్టు సభ్యుడు డాక్టర్ అనంత్ పంధారే ఉన్నారు. ఇక్కడ పనులు పూర్తయిన తరువాత డాక్టర్ అనంత్‌ను నాగపూర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్‌గా 2025లో నియమించారు. తాము ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలలో సేవా భావంతో పనిచేస్తున్నామని ఆయన మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించడం విశేషం. శివసాగర్ జిల్లాలో స్యూ కా ఫా ఆసుపత్రి నిర్మాణం కోసం ఓఎన్జీసీ 2017 సంవత్సరంలో అంబేద్కర్ వైద్యకియా ప్రతిష్టాన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నది. సీఎస్ఆర్ కింద 2016 నుంచి 2024 వరకు దశల వారీగా రూ434 కోట్ల గ్రాంట్లు పొందింది. అయితే ప్రభుత్వం మాత్రం రూ.483 కోట్లతో నిర్మాణం చేశామని చెబుతుండగా, ఓఎన్జీసీ మొత్తం భరించిందా? లేక రూ.483 కోట్లు మాత్రమే విడుదల చేసిందా? అనేది స్పష్టం కావడం లేదు. అయితే ఈ ఆసుపత్రిలో మూడు వందల పడకలు ఉండగా, 21 స్పెషాలిటీలు, 23 మంది డాక్టర్లు పనిచేస్తారని 2023 నవంబర్ 4న ప్రారంభోత్సవం సందర్భంగా వెల్లడించారు. ప్రతి సాధారణ పౌరుడికి తక్కువ ఫీజుకు వైద్య సేవలు అందచేస్తామన్నారు. ఆసుపత్రిలో వసూలు చేస్తున్న ఫీజులను చూస్తే ఎవరికైనా మతి పోతుంది. జనరల్ వార్డులో ఒక మంచానికి రూ.800, సెమీ క్యాబిన్‌కు రూ.2వేలు, క్యాబిన్‌కు రూ.3వేలు, సూట్‌కు రూ.5,500 చొపున వసూలు చేస్తున్నారు. దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవారు అయితే మొత్తం బిల్లులో 40 శాతం డిస్కౌంట్, ఫార్మసీ బిల్లులో 20 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

సంఘ్‌కు అనుబంధంగా 2,500 సంస్థలు..

మహారాష్ట్రలోని నాగపూర్ కేంద్రంగా నడుస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కు దేశ వ్యాప్తంగా అనుబంధంగా 2,500 సంస్థలు పనిచేస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అధ్యాపకులు డాక్టర్ ఫెలిక్స్ పాల్ 2025 లో ఈ విషయాలను వెల్లడించారు. సంఘ్‌కు సంబంధించిన సంస్థలపై ఒక మ్యాప్ కూడా విడుదల చేశారు.

Tags: