Madras HC Constitutes SIT On Karur Stampede | కరూర్ తొక్కిసలాటపై సిట్ విచారణ: మద్రాస్ హైకోర్టు
కరూర్ తొక్కిసలాటపై సిట్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు. సీబీఐ దర్యాప్తు పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
కరూర్ తొక్కిసలాటపై సిట్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఐజీ అస్రాగార్గ్ ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోందని ఉన్నత న్యాయస్థానం ప్రకటించింది. 2025 సెప్టెంబర్ 27న కరూర్ లో టీవీకే చీఫ్ విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 41 మంది మరణించారు. ఇందులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఈ తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తును కోరుతూ విజయ్ తో పాటు పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై మద్రాస్ హైకోర్టు శుక్రవారం నాడు విచారించింది. సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. కోర్టులను రాజకీయ వేదికగా భావించవద్దని హైకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. . దర్యాప్తులో ఏదైనా తప్పు జరిగితే తిరిగి కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. కరూర్ తొక్కిసలాట ఘటన విషయంలో టీవీకే పార్టీపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరూర్ తొక్కిసలాటలో ఏం జరిగిందో ప్రపంచమంతా చూసిందని అంటూనే ఇంత జరిగిన తర్వాత కళ్లు మూసుకోలేమని హైకోర్టు తెలిపింది. రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై రాజకీయ పార్టీల సభలపై హైకోర్టు తాత్కాలికంగా నిషేధం విధించింది. ఇలాంటి రోడ్లపై సభలు, ఏదైనా కార్యక్రమాలు నిర్వహించడానికి అవసరమైన స్టాండడర్డ్ ఆపరేషన్స్ ప్రొసిడింగ్స్ రూపొందించేవరకు ఈ నిషేధం కొనసాగుతోందని హైకోర్టు తెలిపింది. కరూర్ తొక్కిసలాటకు సంబంధించిన ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను ఐజీ అస్రాగార్గ్ టీమ్ కు అందించాలని స్థానిక పోలీసులకు కోర్టు సూచించింది.
కరూర్ సభకు టీవీకే విజయ్ ఆరు గంటలు ఆలస్యంగా వచ్చారు. దీంతో మరో సభ వద్ద ఉన్న జనం కూడా కరూర్ వద్దకు వచ్చారు. ఇది కూడా తొక్కిసలాటకు కారణమని పోలీసులు గతంలో ప్రకటించారు. మరో వైపు విజయ్ ఉన్న వాహనంలో సరైన లైటింగ్ లేని కారణంగా విజయ్ స్పష్టంగా జనాన్ని కన్పించనందున అతడిని చూసేందుకు జనం ముందుకు రావడం కూడా తొక్కిసలాటకు కారణమనేది పోలీసుల వాదన. అయితే ఈ ర్యాలీలో తొక్కిసలాటకు కుట్ర ఉందని విజయ్ ఆరోపించారు. రాళ్ల దాడి, పోలీసుల లాఠీచార్జీ, విద్యుత్ తీసివేయడం కూడా తొక్కిసలాటకు కారణమని ఆయన అన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram