Telangana parishad elections| మార్చి 15లోపు పరిషత్ ఎన్నికలు.. లేకుంటే రూ.450కోట్ల గల్లంతే?

తెలంగాణలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో చిక్కొచ్చి పడింది. మార్చి 15లోపు ఎలక్షన్స్ నిర్వహించకపోతే రాష్ట్రానికి రావాల్సిన రూ.450 కోట్ల నిధులు మురిగిపోనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర నిధులు చేజారిపోకుండా మార్చి 15లోగా పరిషత్ ఎన్నికలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా సమాాచారం.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Feb 19, 2026, 11:24 am IST
Read Time: 4 mins
Telangana parishad elections| మార్చి 15లోపు పరిషత్ ఎన్నికలు.. లేకుంటే రూ.450కోట్ల గల్లంతే?

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో చిక్కొచ్చి పడింది. మార్చి 15లోపు ఎలక్షన్స్ నిర్వహించకపోతే రాష్ట్రానికి రావాల్సిన రూ.450 కోట్ల నిధులు మురిగిపోనున్నాయి. అంతకుముందు నిర్వహిద్దామంటే టెన్త్ ప్రీఫైనల్స్, మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. దీంతో పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ తర్జనభర్జన పడుతోంది. ఈ నెల 23న జరిగే క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయానికి రానుందని సమాచారం. మార్చి 15లోగానే రెండు లేదా ఒకే విడతలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తి చేసి కేంద్ర ఆర్థిక సంఘం నిధులు చేజారిపోకుండా చూసుకోవాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 2024 జులై 4న జడ్పీటీసీ, 5న ఎంపీటీసీల పదవీకాలం ముగియ్యడంతో ప్రత్యేక పాలన కొనసాగుతుంది.

రైతు భరోసా ఇచ్చేసి..పరిషత్ ఎన్నికలకు..

ఢిల్లీలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీ సందర్బంగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణపై చర్చించవచ్చని తెలుస్తుంది. ఇప్పటికే గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి మెజార్టీ స్థానాలను హస్తగతం చేసుకుని సత్తా చాటిన అధికార కాంగ్రెస్ పార్టీ పనిలో పనిగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను కూడా పూర్తి చేసి రాజకీయంగా, ఆర్థికంగా ప్రయోజనాలు పొందాలని యోచిస్తుంది. ఎలాగు రైతు భరోసా నిధులను మున్సిపల్ ఎన్నికలు పూర్తి కాగానే రైతుల ఖాతాల్లో వేస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలో.. రేపో మాపో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో వేసి పరిషత్ ఎన్నికలకు వెళితే మంచి ఫలితాలు సాధించవచ్చని కాంగ్రెస్ భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ నెల 23న జరిగే రాష్ట్ర కేబినెట్ భేటీలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడవచ్చని, ఇందుకోసం ఇప్పటికే ఎన్నికల సంఘం సైతం ఓటర్ల జాబితా, ఎంపీటీసీ, జడ్పీటీల రిజర్వేషన్ లెక్కలతో సిద్దంగా ఉంది. ప్రభుత్వం ముందుకొస్తే రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 565 మండలాల్లో 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నద్దంగా ఉండటం విశేషం.