Devendra Fadnavis | అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతిష్యుడు అశోక్ ఖరత్‌పై మహారాష్ట్ర అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్( Devendra Fadnavis ) కీలక వ్యాఖ్యలు చేశారు. మూఢనమ్మకాలు నిజమే అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులను( Pakistan Terrorists ) ఒక్క నిడిల్‌తో మట్టుబెట్టే వాళ్లం.. డ్రోన్లకు బదులుగా నిమ్మకాయలు, మిరపకాయలతో యుద్ధం చేసే వాళ్లమని ఆయన పేర్కొన్నారు.
జ్యోతిష్యుడు అశోక్ ఖరత్ చేసిన మోసాలను ఎండగడుతూ.. మూఢ నమ్మకాలు సమస్యలను పరిష్కరించి ఉంటే.. మనం ఖరత్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సలహాదారుడిగా నియమించే వాళ్లమని ఎద్దేవా చేశారు. యుద్ధాల నేపథ్యంలో దాడి చేసేందుకు వినియోగించే డ్రోన్లు, యుద్ధ విమానాల స్థానంలో నిమ్మకాయలు, మిరపకాయలను వినియోగించి యుద్ధం చేసే వాళ్లమని ఫడ్నవీస్ అన్నారు.
అంతేకాకుండా దాయాది దేశమైన పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులను కూడా ఇక్కడే కూర్చొని ఒక్క నిడిల్‌తో మట్టుబెట్టే వాళ్లం. మన సైనికులను సరిహద్దులకు కూడా పంపేవాళ్లం కాదు. ఈ పనిని అంతా ఏడెనిమిది మంది దైవ పురుషులు చేసి ఉండేవారని ఫడ్నవీస్ చమత్కరించారు. క్షుద్ర పూజలే సమస్యలను పరిష్కరిస్తాయని భావిస్తే.. ఈ యుద్ధ విమానాలు, ఆయుధాలు ఎందుకు..? పరిపాలన కూడా అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఫడ్నవీస్ వ్యాఖ్యలను సభలోని సభ్యులు సమర్థిస్తూ బల్లలు చరిచారు.
అయతే అశోక్ ఖరత్ విచారణకు సహకరించాలని సీఎం సూచించారు. సమాజంలో విశ్వాసానికి స్థానం ఉంది కానీ గుడ్డి విశ్వాసం ప్రమాదకరమని ఆయన హితవు పలికారు. విశ్వాసానికి, గుడ్డి విశ్వాసానికి మధ్య చాలా తేడా ఉందన్నారు. గుడ్డి విశ్వాసాన్ని సమాజం నుంచి పారద్రోలాలి అని సూచించారు.
