మాఝీ లడ్కీ బహిన్ యోజనలో 92 లక్షల మంది మరాఠా మహిళల పేర్ల తొలగింపు

అక్రమాల పుట్టలా తయారైన ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్‌ యోజనలో 92 లక్షల మంది లబ్ధిదారులను మహారాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. దీంతో బడ్జెట్‌ గణనీయంగా తగ్గిపోనున్నది.

విధాత, హైదరాబాద్:

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజనలో బోగస్ లబ్ధిదారులు, చనిపోయిన వారు, అనర్హులను ఏరివేసేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన వెరిఫికేషన్ డ్రైవ్‌లో 92 లక్షల మంది పేర్లను తొలగించారు. మొత్తం లబ్ధిదారుల్లో ఈకేవైసీ తరువాత 67 శాతం మంది అనగా 62 లక్షల మంది మహిళల పేర్లను తీసివేశారు. వార్షిక ఆదాయం 2.5 లక్షలకు మించి ఉండడంతో 17 శాతం మంది అంటే 16 లక్షల మంది పేర్లను తొలగించారు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు చెందిన మరో 4.42 లక్షలు (4.8 శాతం) పేర్లు తీసివేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదే కాకుండా 65 సంవత్సరాల వయస్సు దాటిన వారు 1.8 లక్షలు (2 శాతం), జిల్లా స్థాయి తనిఖీల్లో 1.7 లక్షలు (1.8 శాతం) లబ్ధిదారులను తీసివేశారు. మహిళల కోసం ప్రారంభించిన ఈ పథకంలో పురుషుల పేర్లు కూడా ఉన్నట్లు వెల్లడి అయ్యింది. లబ్ధిదారుల్లో 29వేల మంది పురుషులు ఉండగా ఇందులో 8వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం విశేషం.

తనిఖీల తరువాత 2.43 కోట్ల నుంచి 1.5 కోట్లకు తగ్గుదల…

రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ పూర్తి చేసిన తరువాత ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన పథకం లబ్ధిదారుల సంఖ్య 2 కోట్ల 43 లక్షల నుంచి 1 కోటి 50 లక్షలకు పడిపోయింది. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఈ పథకాన్ని అప్పటి బీజేపీ ప్రభుత్వం ప్రారంభించింది. 21 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న మహిళలకు ప్రతినెలా రూ1,500 చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఆదాయం పన్ను చెల్లింపుదారులు, ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారులు, వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు దాటిన వారిని అనర్హులుగా ప్రకటించారు. ప్రతి సంవత్సరం ఈ పథకం కోసం రూ.60వేల కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. ఈకేవైసీ, తనిఖీల కారణంగా సెప్టెంబర్ 2025 నుంచి లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. మొత్తం లబ్ధిదారుల సంఖ్య 2.43 కోట్లు కాగా, ఈకేవైసీ తరువాత 1.5 కోట్లకు చేరుకున్నది.

కాగ్ మొట్టికాయలతో ఈకేవైసీకి శ్రీకారం…

మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిపై 2024-25 లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆడిట్ చేసింది. బడ్జెట్ అంచనాలు, రెవెన్యూ వ్యయం, ఆర్థిక నిర్వహణ పై లోపాలను ఎత్తి చూపింది. ఎలాంటి కారణాలు చూపకుండా రూ.3,541 కోట్లు అదనంగా ఖర్చు చేశారని, బ్యాంకు ఖాతాల్లో రూ.15,586 కోట్లు మూలుగుతున్నాయని తేల్చింది. సంక్షేమ పథకాల అమలులో సరైన పర్యవేక్షణ, నియంత్రణ లేదని, ఫలితంగా అనర్హులకు ప్రభుత్వ నిధులు అందుతున్నాయని కాగ్ స్పష్టం చేసింది. 2024లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పథకం ప్రారంభించామని, ఈ లోపే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి రావడం తో ఈకేవైసీ నిర్వహించలేకపోయామని మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అధితి తత్కరే మీడియాకు వెల్లడించారు. లబ్ధిదారులకు రెండు నెలలు సాయం అందిచేసిన తరువాత కోడ్ అమలైందని, దీంతో తనిఖీ నిర్వహించడం సాధ్యం కాలేదని ఆమె పేర్కొన్నారు. గత ఏడాది ఆగస్టు తరువాత ప్రతి లబ్ధిదారు ఈకేవైసీ చేయించుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు అప్రమత్తం చేశామని, డిసెంబర్ 2025 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని గడువు కూడా విధించామని ఆమె వివరించారు. పథకం లక్ష్యానికి తూట్లు పొడిచే విధంగా పురుషులు ఈ పథకం కింద లబ్ధిపొందారని, వీరి నుంచి సాయం డబ్బులను రికవరీ చేస్తామని ఆమె హెచ్చరించారు. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సొమ్ము రికవరీ చేస్తామని, వీరందరిపై రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగిస్తామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అసెంబ్లీ లో కూడా ప్రకటించారని ఆమె గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ప్రకటన మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు కూడా వెళ్ళాయని అధితి తత్కరే తెలిపారు.

లబ్ధిదారులు తగ్గడంతో బడ్జెట్ కుదింపు…

ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన అమలు కోసం 2025-26 వార్షిక బడ్జెట్ లో రూ.36,000 కోట్లు కేటాయించగా, లబ్ధిదారుల సంఖ్య తగ్గడంతో ఈ వార్షిక బడ్జెట్ లో రూ.26,500 కోట్లు సరిపోనున్నాయి. బోగస్, అనర్హులు, ప్రభుత్వ ఉద్యోగులు, పురుషులు, ఈకేవైసీ పూర్తి చేయని వారిని గుర్తించడం మూలంగా ప్రభుత్వం పై సాలీనా రూ.9,500 కోట్ల భారం తగ్గింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పథకం కింద లబ్ధిపొందే మహిళలకు ప్రతి నెలా ఇస్తున్న రూ.1,500 నుంచి రూ.2,100 కు పెంచనున్నట్లు ప్రకటించింది.

Latest News