Maharashtra Tops In Railway Accidents | మహారాష్ట్రలోనే రైలు ప్రమాదాలు ఎక్కువ
మహారాష్ట్ర రైల్వే ప్రమాదాల్లో అగ్రస్థానంలో: 2023లో 5,559 ప్రమాదాలు, 2,115 మంది మరణించగా రైల్వే క్రాసింగ్ ముఖ్య కారణం.

రైలు ప్రమాదాల్లో మహారాష్ట్ర టాప్ లో నిలిచింది. 2023లో జరిగిన రైలు ప్రమాదాల్లో 21,803 మంది మరణించారు. మొత్తం 24,678 ప్రమాదాలు జరిగాయి. మహారాష్ట్రలో 5,559 ప్రమాదాలు జరిగాయి. దేశంలో జరిగిన రైలు ప్రమాదాల్లో ఇది 22.5 శాతంగా ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక తెలిపింది.
రైలు ప్రమాదాల్లోనే కాదు……
రైలు ప్రమాదాల్లోనే కాదు ఈ ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్యలో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. మొత్తం 3,445 మంది చనిపోయారు. రైలు ప్రమాదాల్లో గాయపడినవారిలో కూడా ఈ రాష్ట్రమే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మొత్తం రైలు ప్రమాదాల్లో గాయపడినవారి సంఖ్య 3,014 మంది. అయితే ఇందులో మహారాష్ట్రకు చెందినవారే 2,115 మంది. మహారాష్ట్ర తర్వాత రైలు ప్రమాదాల్లో మరణించిన రాష్ట్రాల్లో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. ఈ రాష్ట్రం నుంచి 3,149 మంది మరణించారు. ముంబై సబర్బన్ ట్రైన్ నెట్ వర్క్ కు సంబంధించి ప్రమాదాలు, మరణాలు ఇతర డేటా మాత్రం ఈ నివేదికలో పొందుపర్చలేదు.ద
రైల్వే క్రాసింగ్ దాటే సమయంలో
రైలు ప్రమాదాల్లో ఎక్కువగా రైల్వే క్రాసింగ్ దాటే సమయంలోనో, రైలు నుంచి కిందపడడం వల్లనో జరిగాయి. కాపలా లేని రైల్వే క్రాసింగ్ తో పాటు కాపలా ఉన్న చోట కూడా రైలు వస్తున్నా నిర్లక్ష్యంగా వెళ్లడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా 18,480 ప్రమాదాలు జరిగాయి. ఇందులో 15,878 మంది మరణించారు. ఇక మహారాష్ట్రలో ఈ రకమైన ప్రమాదాలు 29. 8 శాతం చోటు చేసుకున్నాయి. రైలు ప్రమాదాల్లో 56 డ్రైవర్లు (లోకో పైలట్ల) తప్పిదాల వల్ల జరిగాయి. టెక్నికల్ సమస్యలతో 43 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
2020లో తగ్గిన రైలు ప్రమాదాలు
2020లో రైలు ప్రమాదాలు తగ్గాయి. ఈ ఏడాదిలో 11,968 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2019లో 24,619 ప్రమాదాలు జరిగాయి.2021లో ప్రమాదాలు 16,431కి చేరాయి. 2022లో కూడా రైలు ప్రమాదాలు పెరిగాయి. ఈ ఏడాదిలో మొత్తం ప్రమాదాలు 20,792కు చేరాయి.2023 నాటికి ఈ ప్రమాదాలు 21,803కు పెరిగాయి. 2022లో రైల్వే క్రాసింగ్ ల వద్ద 2,455 ప్రమాదాలు జరిగాయి.2023 నాటికి కొంచెం తగ్గాయి. ఈ ఏడాదిలో మొత్తం 2,242గా నమోదయ్యాయి.
రైలు ప్రమాదాలు ఎక్కువగా సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య జరిగాయి. ఈ సమయంలో 3,771 ప్రమాదాలు జరిగాయి. ఇక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో 3,693 ప్రమాదాలు నమోదయ్యాయి.
మహారాష్ట్రలోనే ప్రమాదాలు ఎందుకు ఎక్కువ?
మహారాష్ట్రలో సబర్బన్ రైళ్లు, ఇతర రైల్వే సర్వీసులను ప్రజలు ఎక్కువగా వినియోగిస్తారు. ఈ రైళ్లు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. రైళ్లలో ఎక్కేటప్పుడు, దిగేటప్పుడూ జారిపడి ప్రమాదానికి గురౌతున్నారు. అదే విధంగా రైల్వేట్రాక్ లు దాటే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ప్రమాదవశాత్తు రైల్వే ట్రాక్ పై పడిపోవడం వంటివి కూడా ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ముంబై సబర్బన్ రైల్వే నెట్ వర్క్ లో ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో రైలు ప్రమాదాలు ఎక్కువగా రికార్డు అవుతున్నాయి. వాణిజ్య నగరం ముంబైలో ఎక్కువమంది రైళ్లపై ఆధారపడుతారు. ఆఫీస్ వేళల్లో ఈ రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.