Hotel Accident | మంటల్లో బుగ్గయిన హోటల్.. ఆరుగురు మృత్యువాత..
బిహార్ రాజధాని పట్నాలోని బహుల అంతస్తుల హోట్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం 10.30 గంటల సమయంలో భవనంలో మంటలు చెలరేగాయి.
Hotel Accident | బిహార్ రాజధాని పట్నాలోని బహుల అంతస్తుల హోట్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం 10.30 గంటల సమయంలో భవనంలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత అరగంటలోనే భవనాన్ని మంటలు అంటుకున్నాయి. సంఘటనా స్థలాన్ని పొగ కమ్మేసింది. హోటల్ పక్కనే ఉన్న భవనానికి సైతం మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భవనం ఎదుట ఉన్న వంతెనపై భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్టేషన్ వెళ్లే రహదారిని పూర్తిగా బ్లాక్ చేశారు. ప్రమాదం జరిగిన గంటన్నర తర్వాత ఓ వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీశారు. అరగంట తర్వాత ఇద్దరు బాలికల మృతదేహాలను వెలికి తీశారు.
పాల్ హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు పాట్నా సెంట్రల్ రేంజ్ టీఎస్పీ సత్య ప్రకాశ్ ధ్రువీకరించారు. ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉన్నది. పీఎంసీహెచ్‌లో సుమారు 20 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. వంటగదిలో మంటలు చెలరేగాయని.. మంటల్లో నాలుగు అంతస్తుల భవనం దగ్ధమైనట్లు స్థానికులు పేర్కొన్నారు. సంఘటనా స్థలమంతా గందరగోళం నెలకొన్నది. సమీపంలోని హోటల్స్, దుకాణాల్లోని వ్యక్తులంతా రోడ్లపైకి చేరుకున్నారు. ప్రమాదంలో 30-35 మందిని కాపాడినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. రెస్క్యూ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. సంఘటన స్థలంలో దాదాపు డజను వరకు అగ్నిమాపక శకటాలను మోహరించారు. పాల్ హోటల్ సమీపంలోని మరో రెండు హోటళ్లలోనూ మంటలు అంటుకున్నాయి. బలమైన గాలులు వీయడంతో మంటలు అంటుకున్నాయి. ప్రమాదంలో రూ.కోట్ల విలువైన ఆస్తి బుగ్గిపాలైందని నిర్వాహకులు పేర్కొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram