Cow Dung | వేసవిలో.. కారు చల్లగా ఉండాలని ఆయన చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
ఉపాయం ఉంటే అపాయం తప్పించుకోవచ్చు.. ఉపాయం లేనోడిని ఊళ్లోంచి వెళ్లగొట్టాలి.. అన్న సామెతలను బాగా వంటపట్టించుకున్నాడేమో.. ఒక ఆయుర్వేదిక్ ప్రాక్టిషనర్.. తన కారును ఎండను తట్టుకునేలా తీర్చిదిద్దాడు.

Cow Dung | ఎండాకాలం మనుషులే కాదు.. వాహనాలు సైతం ఆ వేడికి అల్లాడిపోతుంటాయి. ఎండలో కాసేపు పార్క్ చేసిన కారులో ఎక్కితే పగలే చుక్కలు కనిపిస్తాయి. అందుకే చాలా మంది ఏ చెట్టు నీడనో, షెడ్డు కిందనో పార్క్ చేస్తుంటారు. చాలా మందికి అది స్వానుభవంలో ఉండే ఉంటుంది. అయితే.. ఉపాయం ఉంటే అపాయం తప్పించుకోవచ్చు.. ఉపాయం లేనోడిని ఊళ్లోంచి వెళ్లగొట్టాలి.. అన్న సామెతలను బాగా వంటపట్టించుకున్నాడేమో.. ఒక ఆయుర్వేదిక్ ప్రాక్టిషనర్.. తన కారును ఎండను తట్టుకునేలా తీర్చిదిద్దాడు. పైగా ఇది ఎకో ఫ్రెండ్లీ కూడాను! ఆ డాక్టర్ చర్య ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
డాక్టర్ సలహాలు ఇవే
ఆయనపేరు డాక్టర్ రామ్ హరి కదమ్. మహారాష్ట్రలోని పంధార్‌పూర్‌లో ఆయుర్వేద వైద్యుడిగా సేవలందిస్తున్నారు. ఆయనకు మహీంద్ర ఎక్స్‌యూవీ 300 కారుంది. కానీ.. మహారాష్ట్రలో పెరుగుతున్న ఎండల ధాటికి అందులో ఏసీ కూడా చల్లదనాన్నిచ్చే పరిస్థితి లేకపోయింది. దీందో ఆయన వినూత్నంగా ఆలోచించాడు. ఆవు పేడను సుబ్బరంగా కారుకు దట్టంగా పట్టించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నది. కారు వేడెక్కిపోకుండా ఉండాలంటే ఈ చిట్కా పాటించాలని ఆయన సలహా ఇస్తున్నాడు. ఇది దేశీయ పరిజ్ఞానమేనని చెబుతున్నాడు.
ఆవు పేడను, మూత్రాన్ని మిక్స్ చేసి, పేస్ట్ మాదిరిగా మెత్తగా కలుపుకోవాలని, అనంతరం దానిని జాగ్రత్తగా కారుపై అలకాలని ఆయన సూచిస్తున్నారు. ఆవు పేడ ఎలాంటి డ్యామేజ్ చేయకుండానే కారును చల్లగా ఉంచుతుందని హామీ ఇస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో పలు టీవీ చానళ్లు సైతం ఆయన ఇంటర్వ్యూలు తీసుకున్నాయి. ఎలాంటి వర్షాలు లేకపోతే తప్ప.. పేడ కోటింగ్ ఐదు నెలలు చెక్కుచెదరదని ఆయన చెబుతున్నారు. గతంలో ఆయన తన టూవీలర్‌కు సైతం ఇలానే పేడ కోటింగ్ వేశారని, తన ఇంటికి కూడా ఇదే పద్ధతిలో పేడ అలికించారని స్థానిక పత్రికలు పేర్కొంటున్నాయి.
ఇదే మొదటిసారా?
ఈ వీడియో వైరల్ అయ్యేసరికి.. గతంలో ఇలాంటి ప్రయత్నాలు ఎవరన్నా చేశారా? అనే విషయంలోనూ నెటిజన్లు గాలించారు. 2019లో గుజరాత్‌లో ఒక మహిళ ఇలానే తన కారుకు ఆవు పేడతో కోటింగ్ వేసిందని తేలింది. అహ్మదాబాద్‌కు చెందిన సేజా షా.. తన టయోటా అల్టిస్‌కు చిక్కని ఆవు పేడను కోటింగ్‌లా వేసింది. అప్పట్లో ఆమె ఇంటర్నెట్‌లో సెభాషనిపించుకున్నది. కేవలం పేడను అలకడమే కాకుండా.. దానిపై అందంగా ముగ్గులు, డిజైన్లు వేసి మరింత ఆకర్షణీయంగా మార్చింది. పేడ అలికిన కారులో ఏసీ కూడా అవసరం ఉండదని ఆమె ఒక వార్తా సంస్థకు చెప్పింది. తాను ఏసీ లేకుండానే కారులో ప్రయాణిస్తానని, ఆవు పేడ కోటింగ్ కారణంగా కారు లోపల చల్లగా ఉంటుందని తెలిపింది.