Maoists innovative | అడవిలో వృక్షం అమరుల స్థూపమైంది!
ముప్పేటదాడితో ముప్పుతిప్పలుపెడుతున్నప్పటికీ అష్టదిగ్బంధంలో సైతం అమరుల సంస్మరణ కొనసాగిస్తామంటూ మావోయిస్టులు నిరూపిస్తున్నారు. అడవిలోని వృక్షాన్ని అమరుల స్థూపంగా మార్చి తమ నూతన ఆలోచనను మావోయిస్టులు చాటిచెప్పారు.

Maoists innovative | విధాత, ప్రత్యేక ప్రతినిధి : ముప్పేటదాడితో ముప్పుతిప్పలుపెడుతున్నప్పటికీ అష్టదిగ్బంధంలో సైతం అమరుల సంస్మరణ కొనసాగిస్తామంటూ మావోయిస్టులు నిరూపిస్తున్నారు. అడవిలోని వృక్షాన్ని అమరుల స్థూపంగా మార్చి తమ నూతన ఆలోచనను మావోయిస్టులు చాటిచెప్పారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు అమరుల సంస్మరవారం పాటించాలని ఇప్పటికే కేంద్ర కమిటీ పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో దంతేవాడ జిల్లాలోని అటవీప్రాంతంలో వినూత్న స్థూపం ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అడవిలోని పెద్ద వృక్షాన్ని గుర్తించి దాన్ని స్థూపం ఆకారంలో చెక్కారు. చెక్కగానే ఎర్రనిరంగు వచ్చే వృక్షాన్ని ఎంపిక చేశారు. ఎర్రరంగు రానిదానిని చెక్కి రంగువేసి దానిపై తెల్లని రంగుతో అమరవీరులకు జోహార్లంటూ రాశారు. అక్కడే ఆ స్థూపం ముందు నివాళులు అర్పించి అమరుల త్యాగాలను కొనియాడినట్లు సమాచారం.
నరికేస్తున్న భద్రతా బలగాలు
అబూజ్ మడ్ లాంటి మావోయిస్టు కేంద్ర స్థావరాలపై భద్రతాబలగాలు ఆధిపత్యం సాధించిన ఈ పరిస్థితుల్లో అమరుల సంస్మరణను విస్మరించకుండా వినూత్న పద్ధతిలో నిర్వహించుకోవడం గమనార్హం. చత్తీస్‌ఘడ్ అటవీప్రాంతంలో మావోయిస్టులు నిర్మించిన అనేక అమరుల స్థూపాలను భద్రతబలగాలు కూల్చివేసి,ధ్వంసం చేసి నామరూపాలులేకుండా చేశారు. నిన్నమొన్నటి వరకు స్థూపాల కూల్చివేతకు పలుగు, పారలను వినియోగించిన బలగాలు తాజాగా ‘అమర వృక్షాలను’ తొలగించేందుకు గొడ్డల్లను వినియోగిస్తున్నారు. దీని కోసం గొడ్డల్లతో నరికి తాళ్ళుకట్టి ఆ వృక్షాలను కూకటివేళ్ళతో సహా తొలగించేప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్థూపాలు ఆసక్తితోపాటు, చర్చనీయాంశంగా మారాయి. మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా దండకారణ్యం పై వేలాది మంది భద్రతాబలగాలు దండయాత్ర సాగిస్తున్నారు. ఈ క్రమంలో భారీగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మృత్యువాతపడుతున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు అలియానంబాల కేశవరావు సహా ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు, 16 మంది రాష్ట్రస్థాయి నేతలు, వందలాది మంది ఏసీ నాయకులు, పార్టీ సభ్యులు నేలకొరిగారు. ఆకుపచ్చని అడవి నిత్యం రక్తమోడుతోంది. అయినప్పటికీ కేంద్రప్రభుత్వం పట్టువీడకుండా చర్చలకు సైతం ససేమిరా అంటూ మార్చి 31 2026 నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే డెడ్ లైన్ విధించి వేలాది బలగాలను అడవంతా మొహరించారు. కగార్ ఆపరేషన్ పేరుతో యుద్ధాన్ని ప్రకటించి అమలు చేస్తున్నది. చర్చల కోసం పౌరసమాజం నుంచి వస్తున్న డిమాండును సైతం పక్కనపెట్టి మావోయిస్టు నాయకత్వం లక్ష్యంగా వరుస ఎన్ కౌంటర్లతో సాగుతున్నారు. ఈ స్థితిలో కూడా మావోయిస్టులు ప్రజల్లో తమ పట్టును, అమరుల త్యాగాలను కీర్తించేప్రయత్నం చేయడం గమనార్హం.