పార్లమెంటుకు ప్రతిపక్షాల మూకుమ్మడి రాజీనామాలు?

1989లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా ఆయన హయాంలో ఒకేరోజు 63 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన జస్టిస్ ఠక్కర్ కమిషన్ నివేదికను

పార్లమెంటుకు ప్రతిపక్షాల మూకుమ్మడి రాజీనామాలు?
  • గతంలో రాజీవ్‌ హయాలో 63 మంది లోక్‌సభ సభ్యుల సస్పెన్షన్‌
  • నిరసనగా మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన విపక్ష సభ్యులు
  • తదుపరి ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కాంగ్రెస్‌ పార్టీ
  • 34 ఏళ్ల తర్వాత అదే పునరావృతమవుతుందా?

న్యూఢిల్లీ: 1989లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా ఆయన హయాంలో ఒకేరోజు 63 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన జస్టిస్ ఠక్కర్ కమిషన్ నివేదికను 1989 మార్చి 15న పార్లమెంటులో సమర్పించారు. బోఫోర్స్ విషయంలో రాజీవ్ ప్రభుత్వాన్ని విపక్షాలు ఇరుకున పెట్టేశాయి. దీంతో ప్రభుత్వం 63 మంది ఎంపీలను సస్పెండ్ చేయించింది. ఇది లోక్‌సభ సస్పెన్షన్లలో ఆల్‌టైమ్‌ రికార్డు. శీతాకాల సమావేశాలలో 18 డిసెంబర్ 2023న 78 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంతో ఈ రికార్డు బద్దలైంది. మంగళవారం సస్పెన్షన్లతో ఆ సంఖ్య 141కి చేరుకున్నది.


గత రికార్డు సమయంలో కాంగ్రెస్‌కు 400కుపైగా ఎంపీలు ఉన్నారు. ఆ సమయంలో సస్పెన్షన్లను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష సభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ప్రతిపక్షాల మధ్య ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదిరితే లోక్‌సభకు సామూహిక రాజీనామాలు సమర్పించే అవకాశం లేకపోలేదని జేడీయూ నేత కేసీ త్యాగి ఒక వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. ఈ అంశాన్ని ఇంకా పరిగణలోకి తీసుకోనప్పటికీ ప్రతిపక్ష నేతలు, ఎంపీలను ప్రభుత్వం టార్గెట్ చేస్తున్న తీరుకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని త్యాగి అన్నారు.


రాజీవ్ గాంధీ ప్రభుత్వం అప్పటి ప్రతిపక్షాలను పార్లమెంటులో గళం విప్పడానికి అనుమతించలేదు. ఆ తరువాత ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా లోక్‌సభకు రాజీనామాలు చేశాయి. ఆ తర్వాత 1989 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఏకాభిప్రాయం కుదిరితే మళ్లీ చరిత్ర పునరావృతం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.