బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం.. 10 బస్సులు దగ్ధం

బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వీరభద్రనగర్‌లోని ఓ పార్కింగ్ ఏరియాలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఆ పార్కింగ్ ఏరియాలో నిలిపి ఉంచిన బస్సులకు మంటలు అంటుకున్నాయి. 10 బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సింది. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే ఆ పార్కింగ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని స్థానికులు పేర్కొన్నారు. ఈ భారీ అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.