Yaduveer Krishnadatta | లోక్‌సభ ఎన్నికల బరిలో మైసూర్ రాజు యదువీర్ కృష్ణదత్త.. ఆయన ఆస్తుల విలువ తెలిస్తే షాకే..!

Yaduveer Krishnadatta | మైసూర్ రాజ వంశానికి చెందిన యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. మైసూర్-కొడగు లోక్‌సభ స్థానం నుంచి ఆయనను బీజేపీ రంగంలోకి దింపుతున్నది. ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ అఫిడవిట్‌లో ఆస్తుల విలువను రూ.4.99కోట్లుగా ప్రకటించారు. అయితే, తనకు సొంతంగా ఇల్లు, భూమితో పాటు కారు కూడా లేదని ఆయన అఫిడవిట్‌లో వెల్లడించారు. భార్య త్రిషిక కుమారి వడయార్‌కు రూ.1.04కోట్లు, సంతానం పేరిట రూ.3.64కోట్ల విలువైన ఆస్తులు ఆస్తులున్నాయని.. ముగ్గురిపై ఎలాంటి స్థిరాస్తులు లేవని చెప్పారు. ఆస్తుల్లో రూ.3.39 కోట్ల విలువైన బంగారు, వెండి నగల రూపంలో తన పేరుపై ఉన్నాయని తెలిపారు. భార్యకు రూ.1.02కోట్ల విలువైన ఆభరణాలు, సంతానానికి రూ.24.50లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, కృష్ణ చామరాజ వడయార్ మొదట బుధవారం నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు
అయితే, మంచిరోజు కావడంతో సోమవారమే నామపత్రాలు దాఖలు చేసినట్లు తెలిపారు. తల్లి ప్రమోదదేవీ వడయార్, స్థానిక ఎమ్మెల్యే శ్రీవత్సతో కలిసి మైసూరులోని ఎన్నికల అధికారికి రెండుసెట్ల నామినేషన్ పత్రాలు అందించారు. మరో సెట్ బుధవారం అందజేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. మైసూర్ రాజ్యాన్ని వడయార్ కుటుంబం 1339 నుంచి 1950 వరకు పరిపాలించింది. స్వాతంత్ర్యం అనంతరం మైసూర్ రాజు జయచామ రాజేంద్ర వడయార్ గవర్నర్‌గా నియామకమయ్యారు. శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ 1974లో రాజు అయ్యారు. ఆయన 1984-1999 కాంగ్రెస్ తరఫున మైసూరు ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆయన 2013లో కన్నుమూశారు. ఆయన వారసుడిగా యదువీర్ కృష్ణదత్త మైసూర్ రాజుగా పట్టాభిషిక్తులయ్యారు. ఆయన మైసూర్‌కు 27వ రాజు. ఆయన మసాచుసెట్స్ యూనివర్సిటీలో ఆంగ్ల సాహిత్యం, ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశారు. 2016లో దుంగార్‌పుర్ యువరాణి త్రిషికను మనువాడారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత వడయార్ రాజ కుటుంబానికి చెందిన వారసుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.