CPI (Maoist) | తిప్పిరి తిరుపతి, మల్లోజుల వేణు, బెంగాల్‌ నేత రాజా.. మావోయిస్టుల కొత్త దళపతి ఎవరు?

మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఆ పార్టీకి కొత్త సారథి ఎవరన్న చర్చ జరుగుతున్నది. మావోయిస్టు పార్టీలో ప్రధాన కార్యదర్శి ఎన్నిక ప్లీనరీ లేదా మహాసభ ద్వారానే నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి తీవ్ర స్థాయిలో దాడులు ఎదుర్కొంటూ కనీసం కలుసుకొని మాట్లాడుకునే పరిస్థితి కీలక నాయకులకు కూడా లేకుండా పోయింది. ఈ తరుణంలో తాత్కాలికంగా ఒకరు కన్వీనర్‌గా వ్యవహరిస్తారనే చర్చ జరుగుతున్నది.

CPI (Maoist) | తిప్పిరి తిరుపతి, మల్లోజుల వేణు, బెంగాల్‌ నేత రాజా.. మావోయిస్టుల కొత్త దళపతి ఎవరు?
  • ఆ ముగ్గురే సమర్థులంటున్న విశ్లేషకులు
  • తెలంగాణ నాయకులకే ఎక్కువ అవకాశాలు!
  • ఇప్పటికిప్పుడే నంబాల ఖాళీ భర్తీ కష్టమే?
  • పార్టీ సెక్రటేరియెట్ సభ్యులపైనే భారం
  • మహాసభ వరకు ఒకరికి తాత్కాలిక బాధ్యత
  • మావోయిస్టు పార్టీలో మూడంచెల నిర్మాణం

CPI (Maoist) | మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు అలియాస్ గంగన్న ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఆ పార్టీ కొత్త దళపతి ఎవరనే చర్చ ప్రారంభమైంది. కమ్యూనిస్టు, విప్లవ శ్రేణులతో పాటు సాధారణ ప్రజలతో పాటు సర్కారు వర్గాల్లో ముఖ్యంగా సాయుధ బలగాల్లో ఈ ప్రశ్న ఉదయిస్తోన్నమాట వాస్తవం. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న ఇద్దరు తెలంగాణ నేతల్లో ఒకరికి లేదా? బెంగాల్‌కు చెందిన నాయకునికి ఈ బాధ్యతలు తాత్కాలికంగా అప్పగిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టు పార్టీ కొత్త చీఫ్‌గా తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవుజీ, మల్లోజుల వేణుగోపాల రావు అలియాస్‌ సోను, బెంగాల్‌కు చెందిన రాజా.. ఈ ముగ్గురిలో ఒకరు పార్టీ బాధ్యతలకు ఎన్నికయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే.. మావోయిస్టు పార్టీలో ప్రత్యేక ప్లీనరీ, లేదా మహాసభల్లో మాత్రమే పూర్తి స్థాయి ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం మూడంచెల నిర్మాణం కొనసాగుతోంది. పార్టీ కేంద్ర కమిటీ, సెక్రటేరియట్, పొలిట్ బ్యూరో ఉన్నట్లుగా సమాచారం. అంతిమ నిర్ణాయక విభాగం పొలిట్‌బ్యూరోకు ప్రధాన కార్యదర్శి నాయకత్వం వహిస్తారని ఆ పార్టీ నిర్మాణం తెలిసిన వారి అభిప్రాయం. ఈ మూడంచెల నిర్మాణంలో కీలక నేతలు ఉంటారు. ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ సెక్రటేరియట్ లోని మిగిలిన నాయకులు కూడా పార్టీ నిర్మాణంతో పాటు కీలక నిర్ణయాల్లో భాగస్వాములు అవుతారు. ప్రస్తుతం 17 మందితో పొలిట్ బ్యూరో ఉన్నట్లుగా ఇంటెలిజెన్స్‌ వర్గాలతోపాటు పార్టీ నిర్మాణం పట్ల అవగాహన ఉన్న వారు చెబుతున్నారు. ఈ పొలిట్ బ్యూరోలో ఐదుగురు తక్కువ కాకుండా సెక్రటేరియట్ సభ్యులు ఉన్నట్లుగా సమాచారం.

పార్టీ సెక్రటేరియట్‌లో ఒకరికి తాత్కాలిక బాధ్యత!

ప్రస్తుతం జనరల్ సెక్రటరీగా ఉన్న నంబాల ఆకస్మిక మృతితో సెక్రటేరియట్ లోని మిగిలిన సభ్యులు తక్షణ బాధ్యతలు కొనసాగించే అవకాశం ఉంది. వీరిలో ఒకరికి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా లేదా కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తిరిగి ప్రత్యేక ప్లీనరీ లేదా మహాసభ జరిగే వరకు ఈ సర్దుబాటు కొనసాగుతుంది. బయటి ప్రపంచానికి రహస్య పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకటన లాంఛనమైనప్పటికీ పత్రికాపరమైన ఇతర వ్యవహారాలన్నీ ప్రధాన కార్యదర్శి స్థాయి నేతలెవరూ ప్రకటన చేసిన సందర్భాలు ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీలో లేవు. అధికార ప్రతినిధులే పార్టీ, ప్రధాన కార్యదర్శి పక్షాన ప్రకటనలు విడుదల చేస్తున్నారు. ఈ కారణంగా తక్షణ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి లేదా కో ఆర్డినేటర్ ఎవరనేది ఆ పార్టీ అంతర్గత సమస్యగా చెబుతున్నారు. నంబాల స్థానంలో తాత్కాలికంగా ఒకరిని ఎన్నుకుని, సమయానుకూలంగా పూర్తిస్థాయి ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటారని చెబుతున్నారు.

కీలక బాధ్యతల్లో ఇద్దరు తెలంగాణ నేతలు

ప్రస్తుతం తిప్పిరి తిరుపతి పార్టీ సాయుధ విభాగమైన మావోయిస్టు సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌కు చీఫ్‌గా ఉన్నారు. మల్లోజుల వేణుగోపాలరావు పార్టీ పొలిటికల్ బ్యూరో చీఫ్‌గా పనిచేస్తున్నట్లుగా సమాచారం. వీరిలో పాటు బెంగాల్‌కు చెందిన రాజా కూడా కీలక పాత్రలో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా లేదా కోఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. అయితే.. తాజాగా ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఇటీవల చర్చలపై విడుదల చేసిన పత్రికాప్రకటనలో ఒక విషయాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్ర బలగాల దాడులతో కనీసం కీలక నేతలు అంటే సెక్రటేరియట్, లేదా పొలిట్ బ్యూరో సభ్యులు కూడా సమావేశం నిర్వహించుకునే సానుకూల పరిస్థితి లేదనే అంశాన్ని లేవనెత్తారు. ఇప్పుడు ప్రధాన కార్యదర్శి చనిపోయిన నేపథ్యంలో సెక్రటేరియట్ లేదా పొలిట్ బ్యూరో లేదా కేంద్ర కమిటీ స్థాయిలో సమావేశం జరుగకుండా పార్టీ ప్రధాన బాధ్యతలు నిర్వహించే నేతను ఎన్నుకోవడం జరిగేపనికాదని అంటున్నారు. అందుకే తాత్కాలికంగా సెక్రటేరియట్‌లో ఒకరు కోఆర్డినేషన్ బాధ్యత తీసుకుని తదుపరి పార్టీ నిర్మాణ సమావేశ అనంతరమే నేతను ఎన్నుకునే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం పార్టీ ప్రభుత్వ బలగాల నుంచి తీవ్రమైన దాడులను ఎదుర్కొంటున్నది. ఇదే క్రమంలో శ్రేణులకు దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత కూడా ఉన్నది. ఈ తరుణంలో తక్షణ కార్యాచరణ చేపట్టేందుకు అందుబాటులో ఉన్న ముఖ్యనేతలు కలిసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇటువంటి పరిస్థితి ఇదే మొదటిసారి

గతంలో ఈ అనుభవాన్ని పార్టీ ఎప్పుడూ ఎదుర్కొలేదని మావోయిస్టు ఉద్యమం గురించి తెలిసినవారు చెబుతున్నారు. కేజీ సత్యమూర్తి, కొండపల్లి సీతారామయ్య, గణపతి మార్పు తర్వాత నంబాల బాధ్యతలు నిర్వహించారు. వీరంతా నిర్మాణపరమైన పద్ధతుల్లో మహాసభ ద్వారా ఎన్నికైనట్లు చెబుతున్నారు. కానీ.. నంబాల మరణం నేపథ్యంలో మహాసభ వరకూ ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉన్నది. తాత్కాలిక బాధ్యతలకు కూడా కీలకమైన పొలిట్ బ్యూరో లేదా కేంద్ర కమిటీ సమావేశమైతే తప్ప పూర్తి స్థాయి నిర్ణయం తీసుకునే అవకాశం లేదంటున్నారు. అప్పటి వరకు తాత్కాలిక బాధ్యతల భారం సెక్రటేరియట్ నిర్ణయం మేరకు ఒకరు చేపట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.