Narendra Modi | మోదీ ఉపన్యాసాల్లో ‘అబ్‌ కీ బార్‌.. చార్‌సౌ పార్‌’ ఎందుకు తగ్గింది?

లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందు, ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ నోట ప్రతి ప్రసంగంలో పదే పదే వెలువడిన నినాదం.. ‘అబ్‌ కీ బార్‌.. చార్‌ సౌ పార్‌’! కానీ.. అనూహ్యంగా ఇప్పుడు ఆ మాట ఆయన ప్రసంగాల్లో చాలా తక్కువగా వినిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Narendra Modi | మోదీ ఉపన్యాసాల్లో ‘అబ్‌ కీ బార్‌.. చార్‌సౌ పార్‌’ ఎందుకు తగ్గింది?

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందు, ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ నోట ప్రతి ప్రసంగంలో పదే పదే వెలువడిన నినాదం.. ‘అబ్‌ కీ బార్‌.. చార్‌ సౌ పార్‌’! కానీ.. అనూహ్యంగా ఇప్పుడు ఆ మాట ఆయన ప్రసంగాల్లో చాలా తక్కువగా వినిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన మార్చి 16 నుంచి మోదీ పాల్గొన్న దాదాపు 80కిపైగా సభల్లో ప్రసంగాలను విశ్లేషించగా.. ఆసక్తికర విషయాలు తెలిశాయి. పశ్చిమబెంగాల్‌లో శుక్రవారం మే 3, 2024న మోదీ మరోసారి అబ్‌ కీ బార్‌ చార్‌ సౌ పార్‌ (ఈసారి 400 సీట్లకు మించి) అని పిలుపునిచ్చారు. దీనికి ముందు చివరిసారిగా ఆయన ఈ నినాదం ఇచ్చింది ఏప్రిల్‌ 24న. ఈ మధ్యలో నాలుగు రోజుల్లో ఆయన పది బహిరంగ సభల్లో ఎన్డీయేకు 400 సీట్లు ఇవ్వాలన్న పిలుపు లేకపోవడం గమనార్హం. వాస్తవానికి ఏప్రిల్‌ 19న జరిగిన తొలి విడుత పోలింగ్‌ తర్వాత ఆయన ప్రసంగాల్లో ఈ పిలుపు గణనీయంగా తగ్గిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏప్రిల్‌ 19 తర్వాత సాగర్‌లో ఏప్రిల్‌ 24, ఉత్తరప్రదేశ్‌లోని అంవ్‌లాలో ఏప్రిల్‌ 25న, పశ్చిమబెంగాల్‌లో మే 3వ తేదీన నిర్వహించిన బహిరంగ సభల్లోనే ఆ పిలుపు వినిపించింది. మార్చి 16 నుంచి మార్చి 26 వరకు మోదీ ఆరు సభల్లో పాల్గొంటే.. 56 సార్లు చార్‌ సౌ పార్‌ పిలుపు ఇచ్చారు. మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 7 మధ్య 17 సభల్లో 31 సార్లు ఆ ప్రస్తావన చేశారు. ఏప్రిల్‌ 8 నుంచి ఏప్రిల్‌ 18 మధ్య 22 సభల్లో ప్రసంగించిన మోదీ.. 23 సందర్భాల్లో చార్‌ సౌ పార్‌ పిలుపునిచ్చారు. కానీ.. ఏప్రిల్‌ 19 నుంచి 30 మధ్య జరిగిన 36 సభల్లో మాట్లాడిన మోదీ నోట కేవలం 8 సందర్భాల్లో మాత్రమే చార్‌ సౌ పార్‌ మాట వినిపించడం గమనార్హం.

400 సీట్లలో గెలిపించాలని చేస్తున్న విజ్ఞప్తి.. లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజార్టీతో దేశ రాజ్యాంగాన్ని మార్చివేసేందుకేనని ముందస్తు ప్రయత్నమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏప్రిల్‌ 30న మధ్యప్రదేశ్‌లోని భింద్‌లో మాట్లాడిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ.. పేదలు, ఎస్టీలు, ఎస్సీలు, ఓబీసీలు రాజ్యాంగం వల్లే అనేక హక్కులు పొందుతున్నాయని, గ్రామీణ ఉపాధి హామీ చట్టం కూడా రాజ్యాంగం వల్లే వచ్చిందని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తారని ఆరోపించారు. అంతకు ముందే ఏప్రిల్‌ 25న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీజేపీ చార్‌ సౌ పార్‌ పిలుపు వెనుక అసలు రహస్యాన్ని విడమర్చి చెప్పారు. దాంతో దేశ రాజకీయాల్లో రాజ్యాంగ మార్పు, రిజర్వేషన్ల రద్దుకు కుట్ర అంశం పాపులర్‌ అయింది. అప్పటి నుంచి తాము రాజ్యాంగ మార్పునకు, రిజర్వేషన్ల రద్దుకు వ్యతిరేకమని మోదీ సహా బీజేపీ నాయకులంతా వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తున్నది.

చార్‌సౌ పార్‌ ఎన్నిసార్లు మోదీ వాడారు?
మార్చి 16న పోల్‌ షెడ్యూల్‌ వెలువడిన దగ్గర నుంచి తొలి దశ ఓటింగ్‌ వరకూ మోదీ 45 సభల్లో మాట్లాడితే.. చార్‌ సౌ పార్‌ నినాదాన్ని 110 సార్లు ఉచ్ఛరించారు. ప్రత్యేకించి తమిళనాడు సభల్లో 17సార్లు, తెలంగాణలో 16సార్లు, కర్ణాటక సభల్లో 15 సందర్భాల్లో ఆయన ఈ పిలుపునిచ్చారు. కానీ.. ఏప్రిల్‌ 17 నుంచి ఆయన నోట ఈ మాట క్రమంగా తగ్గిపోవడం గమనార్హం. పోల్ షెడ్యూల్‌ వెలువడిన అనంతరం మార్చి 16 నుంచి ఏప్రిల్‌ ఏడు మధ్య 21 బహిరంగ సభల్లో 16 సార్లు ఈ పిలుపునిచ్చారు. పోల్‌ షెడ్యూల్‌ విడుదలైన నాటి నుంచి ఏప్రిల్‌ 30 వరకు 45 రోజుల కాలాన్ని నాలుగు భాగాలుగా చూస్తే.. తొలి భాగంలో మార్చి 16 నుంచి మార్చి 26 వరకు మోదీ ఆరు సభల్లో 56కంటే ఎక్కువసార్లు చార్‌సౌ పార్‌ పిలుపునిచ్చారు. తెలంగాణలో మార్చి 18న నిర్వహించిన సభలో మాట్లాడిన మోదీ.. కనీసం 16 సార్లు ఆ మాట చెప్పారు. ఎన్నికల ఫలితాలు జూన్‌ నాలుగున రానున్నాయి కనుక.. చార్‌ జూన్‌.. చార్‌ సౌ పార్‌ అని వ్యాఖ్యనించారు. తెలంగాణ కూడా అబ్‌కీ బార్‌ చార్‌ సౌ పార్‌ అంటున్నదని పదే పదే ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. రెండో భాగంలో ర్చి 27 నుంచి ఏప్రిల్‌ 7 వరకు గమనిస్తే 17 సభలకు గాను 11 సభల్లో 31 చార్‌ సౌ పార్‌ మాట మోదీ నోట వెలువడింది. మూడో భాగానికి అంటే.. ఏప్రిల్‌ 8 నుంచి 18వ తేదీ మధ్య ఈ మాట చాలా పొదుపుగా వాడటం మొదలైంది. 22 సభల్లో మాట్లాడిన మోదీ.. అందులో ఐదు సభల్లోనే 23 సందర్భాల్లో చార్‌ సౌ పార్‌ మాట వాడారు. ఇక నాలుగో భాగం.. ఏప్రిల్‌ 19 నుంచి ఏప్రిల్‌ 30 మధ్యకాలంలో 36 సభల్లో పాల్గొన్న మోదీ.. కేవలం మూడింటిలో మాత్రమే.. అందులోనూ ఎనిమిది సందర్భాల్లో మాత్రమే ఈ పిలుపునిచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు.

ఎన్డీయే 400 సీట్లు సాధిస్తే రాజ్యాంగాన్ని మార్చివేసి, రిజర్వేషన్లను రద్దు చేస్తుందనే ప్రచారం బలంగా ప్రజల్లోకి వెళ్లడం వల్లే మోదీ ఈ మాటను చాలా పొదుపుగా వాడుతున్నారన్న చర్చ జరుగుతున్నది. అయితే.. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్‌ మాత్రం ఎన్నికల్లో ఒక అంశంతో ప్రచారం ప్రారంభిస్తామని, ప్రతిపక్షాలు ఏదైనా అంశాన్ని లేవనెత్తితే దానికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు.