400 సీట్లు గెలిస్తే రాజ్యాంగం మార్చేస్తారు: ఎన్సీపీ (ఎస్‌పీ) అధినేత శరద్‌పవార్‌

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు అడిగేది రాజ్యాంగంలో మార్పులు చేయడానికేనని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (పవార్‌) చీఫ్‌ శరద్‌ పవార్‌ విమర్శించారు

400 సీట్లు గెలిస్తే రాజ్యాంగం మార్చేస్తారు: ఎన్సీపీ (ఎస్‌పీ) అధినేత శరద్‌పవార్‌
  • నియంతృత్వం దిశగా బీజేపీ అడుగులు
  • దేశ భవితవ్యాన్ని నిర్ణయించే ఎన్నికలు

    ముంబై: ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు అడిగేది రాజ్యాంగంలో మార్పులు చేయడానికేనని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (పవార్‌) చీఫ్‌ శరద్‌ పవార్‌ విమర్శించారు. బారామతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పుణెలోని సస్వాద్‌ తాలూకాలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో పవార్‌ మాట్లాడుతూ గతంలో జరిగిన ఎన్నికలతో పోల్చితే ఇప్పుడు జరుగుతున్నవి పూర్తిగా భిన్నమైనవని చెప్పారు. దేశం ఏ పద్ధతిలో పనిచేయాలో నిర్ణయించే ఎన్నికలు ఇవని అన్నారు. ‘ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టారు. వారు (బీజేపీ) నియంతృత్వంవైపు నడుస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు పూనుకొన్నారు. అందుకే వారిని ఓడించి దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది’ అని శరద్‌పవార్‌ చెప్పారు. ‘గత లోక్‌సభ ఎన్నికతో పోల్చితే ఇవి పూర్తిగా భిన్నమైనవి. ఇవి ఈ దేశం ఏ పద్ధతిలో పనిచేయాలో నిర్ణయించబోతున్నాయి. దేశం ప్రజాస్వామికంగా నడవాలి. కానీ.. మాకు ఆందోళన ఉన్నది. వారు (బీజేపీ) రాజ్యాంగంలో మార్పులు చేసేందుకే 400కుపైగా సీట్లు అడుగుతున్నారు’ అని ఆయన వివరించారు. బరామాతి నుంచి శరద్‌పవార్‌ కుమార్తె, సిటింగ్‌ ఎంపీ సుప్రియా సూలె తిరిగి ఎన్సీపీ (ఎస్‌పీ) తరఫున పోటీ చేస్తున్నారు. ఇక్కడ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్‌ భార్య సునేత్ర పవార్‌ను ఎదుర్కొంటున్నారు. ‘నేను ఎక్కడకు వెళ్లినా ప్రజలు బాకా (ఎన్సీపీ (ఎస్పీ) ఎన్నికల చిహ్నం) ఊదుతున్నారు. సుప్రియాసూలేకు ఓటు వేయండి. ఆమెను భారీ మెజార్టీతో గెలిపించండి. మేం అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం’ అని శరద్‌పవార్‌ చెప్పారు.