కేంద్రంలో సంకీర్ణ సర్కారేనా?

సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండు దశల పోలింగ్‌ ముగిసింది. మొదటి దశలో 102 స్థానాలకు, రెండో దశలో 88 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. మూడో దశలో 94 స్థానాలకు పోలింగ్‌ మే7న జరగనున్నది

కేంద్రంలో సంకీర్ణ సర్కారేనా?

‘ఎన్డీఏ’ సంకీర్ణంలోకి బీఆరెస్?
నామా కేంద్ర మంత్రి అవుతారన్న కేసీఆర్‌ మాటల వెనుక మర్మమిదేనా!
బీజేపీకి తేడా కొడితే.. కేసీఆర్‌ ఆదుకుంటారా?
బీఆరెస్‌, బీజేపీ రహస్య మైత్రిపై ఆరోపణలు
అందుకే డమ్మీలను పెట్టారన్న రేవంత్‌రెడ్డి
కేసీఆర్‌ చిత్తశుద్ధిపై ఢిల్లీలో అనుమానాలు
ఇప్పటికే ‘ఇండియా’కు దూరం పెట్టిన నేతలు
కేంద్రంలో వస్తే ఇండియా లేదంటే ఎన్డీయే
మెజార్టీపై విశ్వాసంతో కూటమి నేతలు
తేడా వస్తే కేసీఆర్‌ ఎన్డీయే సర్కారులోనే!
మొన్నటిదాకా హ్యాట్రిక్‌పై బీజేపీ ధీమా
ఇప్పుడు కూటమిని ఓడించాలని పిలుపులు
బీజేపీ ఓడిపోతున్నదనేందుకు సంకేతాలా?

(విధాత ప్రత్యేకం)

సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండు దశల పోలింగ్‌ ముగిసింది. మొదటి దశలో 102 స్థానాలకు, రెండో దశలో 88 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. మూడో దశలో 94 స్థానాలకు పోలింగ్‌ మే7న జరగనున్నది. ఈ మూడు ఫేజ్‌లతో కలిపి 284 స్థానాలకు పోలింగ్‌ పూర్తవుతుంది. కీలకమైన నాలుగో విడుతలో 96 లోక్‌సభ సీట్లతోపాటు ఏపీలోని 175, అరుణాచల్‌ప్రదేశ్‌లోని 60, సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ ఫేజ్‌లోనే తెలంగాణ, ఏపీలలోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలున్నాయి.. వీటితోపాటు దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు కూడా జరగనున్నాయి. నాలుగో విడుతతో మొత్తం 380 స్థానాలకు పోలింగ్‌ పూర్తవుతుంది.

కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి రాబోతున్నదనే దానిపై అప్పటికి ఒక ప్రాథమిక స్పష్టత వస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే.. ఈలోపే ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతల ఉపన్యాసాలు వారి పార్టీకి మెజార్టీకి తగినన్ని సీట్లు సాధించే అవకాశం లేదన్న అనుమానాలను ప్రతిబింబిస్తున్నాయన్న చర్చ సర్వత్రా జరుగుతున్నది. ఇదే సమయంలో కేసీఆర్‌ ఖమ్మం సభలో చేసిన వ్యాఖ్య ఆయన రాజకీయ వైఖరిపై కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీకి 200 సీట్లలోపే వస్తాయనే అభిప్రాయం బలంగా వినిపిస్తున్న సమయంలో, స్వయంగా కేసీఆర్‌ ఆ మాట అంటున్న నేపథ్యంలో.. సమయంలో ఆ పార్టీని ఆదుకునేవారిలో బీఆరెస్‌ ఒకటని అంచనా వేస్తున్నారు.

ఆసక్తి రేపిన కేసీఆర్‌ వ్యాఖ్యలు

మొదటి రెండు దశల పోలింగ్‌ సరళిని అంచనా వేస్తున్న విశ్లేషకులు ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చిందంటున్నారు. మూడవ, నాలుగవ ఫేజ్‌లలోనూ ఇదే కంటిన్యూ అయితే మూడోసారి అధికారంలోకి రావాలని కలలు కంటున్న ఎన్డీఏ ఆశలు నెరవేరే అవకాశాలు తగ్గిపోతాయంటున్నారు. వీళ్లే కాదు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూడా కేంద్రంలో బీజేపీకి 200 సీట్లు కూడా రావని, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతున్నదని, ఆ ప్రభుత్వంలో నామా నాగేశ్వర్‌రావు కేంద్ర మంత్రి అవుతారని కూడా అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడిన ఆ పార్టీ లోక్‌సభ ఎన్నికల తర్వాత ఉనికే ఉండదని కాంగ్రెస్‌, బీజేపీ నేతలు అంటున్నారు. రెండు సీట్లు గెలిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కోమటిరెడ్డి సవాల్‌ చేశారు. వీటన్నింటి నేపథ్యంలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మూడు నుంచి ఐదు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. అంతేకాదు సంకీర్ణ ప్రభుత్వంలో బీఆర్‌ఎస్‌ కీలక పాత్ర పోషిస్తుంది అంటున్నారు. అయితే.. బీఆరెస్‌ అధినేత మోదీకి 200 సీట్లు రావని చెబుతున్నా.. బీజేపీ మీద, ప్రత్యేకించి మోదీపైనా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం లేదని పలువురు ప్రస్తావిస్తున్నారు. ప్రధానంగా రిజర్వేషన్లు, రాజ్యాంగం విషయంలో కేసీఆర్‌ నోరుమెదపడం లేదని, రొటీన్‌ ఆరోపణలతో సరిపెడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మోదీకి ఏ మేరకు సీట్లు తగ్గితే ఆ మేరకు వైసీపీ, టీడీపీ, బీజేడీతోపాటు.. బీఆరెస్‌ కూడా సహకరిస్తుందని అంచనా వేస్తున్నారు. చివరకు బీఎస్పీ సైతం ఎన్డీయేవైపు మొగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. బీజేపీ, బీఆరెస్‌ మధ్య రహస్యబంధం ఉన్నదని కాంగ్రెస్‌ గట్టిగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే మోదీ విద్వేష ప్రసంగాలపైన, ఎలక్టోరల్‌ బాండ్ల బాగోతంపైన బీఆరెస్‌ మాట్లడటం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కేసీఆర్‌ తరచూ వైఖరి మార్చుతారన్న అపవాదు ఢిల్లీ రాజకీయవర్గాల్లో బలంగానే ఉన్నది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలోకి బీఆరెస్‌ వచ్చే అవకాశాల్లేవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక బీఆరెస్‌కు మిగిలింది బీజేపీకి మద్దతు ఇవ్వడమేనని అంటున్నారు.

గతంలో దేశ ప్రయోజనాల కోసం బీజేపీ బిల్లులకు మద్దతు ఇచ్చామని చెప్పుకొన్న విధంగానే ఇప్పుడు కూడా తప్పని పరిస్థితిలో బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు చెబుతారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇదంతా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతి స్థితి. ఇప్పటికి మాత్రం మోదీ, అమిత్‌షా వంటి బీజేపీ అగ్రనేతల మాటలు చూస్తే ఆ పార్టీకి సొంతగా మెజార్టీ కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని, అది సంకీర్ణానికి దారి తీసే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రధాని అభ్యర్థిపై చర్చ

మొన్నటిదాకా మూడోసారి మోదీనే ప్రధాని కాబోతున్నారని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. తాను మరోసారి అధికారంలో వస్తున్నానని మోదీ సైతం చెప్పుకొన్నారు. బీజేపీకి 370 సీట్లు అడిగారు.. ఎన్డీయే ఈసారి చార్‌సౌ పార్‌ అన్నారు. కానీ.. ఇప్పుడు సాధ్యమైనంత ఎదురుదాడికి దిగుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ‘ఇండియా కూటమిని గెలిపిస్తే ఏదేదో జరిగిపోతుందని చెప్పి భయపెడుతున్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే ఆస్తులు గుంజుకుంటుందని బెదిరిస్తున్నారు. ఏదైనా చెప్పి.. ఇండియా కూటమిని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా మాట్లాడుతున్నారు’ అని ఒక సీనియర్‌ జర్నలిస్టు చెప్పారు. అంతేకాకుండా తామైతేనే స్థిరంగా పాలిస్తామని, ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థే లేడని బీజేపీ నాయకులు చెబుతున్నారు.

కర్ణాటక, మహారాష్ట్ర ప్రచార సభల్లో ప్రధాని మాట్లాడుతూ.. విపక్ష కూటమి ఐదేళ్లకు ఐదుగురు ప్రధానమంత్రుల ఫార్ములతో ఒప్పందానికి వచ్చాయని చెబుతూ.. ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకోలేని వారి చేతికి దేశ పాలనా పగ్గాలు అందించి మళ్లీ ఆ తప్పు చేస్తారా? అని ప్రశ్నించారు. బీహార్‌లోని ఝంఝూర్‌పూర్‌ సభలో అమిత్‌ షా మాట్లాడుతూ.. ‘ఒకవేళ పొరపాటున ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎంకే స్టాలిన్‌, శరద్‌ పవార్‌, లాలూప్రసాద్‌ యాదవ్‌, మమతా బెనర్జీ ఒక్కో ఏడాది చొప్పున ప్రధాని కుర్చీని పంచుకుంటారు. ఇక ఎంత మిగిలితే అంతకాలంతో రాహుల్‌ గాంధీ సర్దుకుపోవాలి. దేశాన్ని నడిపేది అలాగేనా?’ అని ప్రశ్నించారు. అమిత్‌ షా వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్‌ కౌంటర్‌ ఇచ్చారు. ప్రధాని పదవిని విపక్షంలో ఎవరెవరు పంచుకుంటారో ఆయన చెప్పారంటే ఓటమిని బీజేపీ కూటమి అంగీకరించినట్లేగా? అన్నారు. 400 సీట్ల గురించి చెప్పినవాళ్లే ఇప్పుడు తర్వాత సర్కార్‌ ఇండియా కూటమిదేనని ఒప్పుకుంటున్నారని, దానికి ఆమె వాళ్లకు కృతజ్ఞతలు చెప్పారు.

కేంద్రంలో అధికారాన్ని తేల్చేది నాలుగు రాష్ట్రాలే

కేంద్రంలో అధికారంలో చేపట్టాలంటే అత్యధిక స్థానాలున్న యూపీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, బీహార్‌ రాష్ట్రాల్లో వచ్చే సీట్లే తేలుస్తాయి. ఎందుకంటే ఈ నాలుగు రాష్ట్రాల్లో 210 స్థానాలున్నాయి. యూపీలో గతంలో 62 స్థానాలు గెలుచుకున్న బీజేపీ అంచనాలు ఈసారి తారుమారవుతాయని అంటున్నారు. బీహార్‌లో ఎన్డీఏ గత ఎన్నికల్లో 40 స్థానాలకు గాను 39 చోట్ల జయకేతనం ఎగురవేసింది. నితీశ్ మహాఘట్‌బంధన్‌ వీడి పొరపాటు చేశారని ఎక్కుమంది ప్రజలు అభిప్రాయపడుతున్నారని పరిశీలకులు అంటున్నారు. ఆయన అధికారం కోసం ఎన్డీఏ కూటమిలో చేరడం వల్ల రాష్ట్రానికి ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదనేది అక్కడి ప్రజల భావన. దీనికి తోడు ఎన్నికల షెడ్యూల్‌ తర్వాత అక్కడ కూటముల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.

నితీశ్‌ ప్రభ మసకబారడటం, ఇండియా కూటమి బలంగా ఉండటంతో అక్కడ ఊహకందని తీర్పు ఉంటుందంటున్నారు. మరో కీలకమైన మహారాష్ట్రలో మొత్తం 48 స్థానాలకు 41 చోట్ల గెలిచింది. రాష్ట్రంలో అధికారం కోసం బీజేపీ చేసిన రాజకీయ విన్యాసాలు లోక్‌సభ ఎన్నికల నాటికి కూటమిలో చీలికలు తెచ్చాయి. ఇవి కమలనాథులను కలవర పెడుతున్నాయి. సీట్ల సర్దుబాటు విషయంలో ఇండియా కూటమి విభేదాలు వచ్చినా చర్చల ద్వారా పరిష్కరించుకుని ఎన్డీఏ కూటమికి సవాల్ విసురుతున్నది. బెంగాల్‌లో తృణమూల్‌, బీజేపీ మధ్యే పోటీ నెలకొన్నది. ఆ రాష్ట్రంలో జరిపిన సర్వేలు 2019 ఫలితాలే కొంచెం అటుఇటుగా వస్తాయని అంచనా వేశాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో పరిణామాలను చూస్తే బీజేపీకి ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి విశ్లేషకులు చెబుతున్నారు.