One Nation One Election । ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఒకే దేశం.. ఒకే ఎన్నిక బిల్లు?
ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నప్పటికీ.. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇందుకు ఉద్దేశించిన బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో లేదా తదుపరి సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.

One Nation One Election । ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నప్పటికీ.. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇందుకు ఉద్దేశించిన బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో లేదా తదుపరి సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలలను ఏకకాలంలో నిర్వహించేందుకు ఈ బిల్లును తీసుకురానున్నారు. మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సిఫారసుల మేరకు రూపొందించిన బిల్లుకు ఇప్పటికే కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభించింది.
దీనిపై తీవ్ర అభ్యంతరాలు ఉన్న నేపథ్యంలో బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపుతారని సమాచారం.
దీనిపై జేపీసీ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చలు, సంప్రదింపులు జరుపనున్నది. విస్తృత స్థాయిలో భాగస్వామ్య పక్షాలను కూడా ఈ చర్చల్లో భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో కేంద్రం ఉన్నదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై అన్ని రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్‌లను కూడా ఆహ్వానించి, వారి అభిప్రాయాలు కూడా తీసుకోనున్నారు. వారితోపాటు దేశంలోని మేధావులు, నిపుణులు, ఇతర పౌర సమాజ ప్రతినిధుల అభిప్రాయాలను కూడా స్వీకరిస్తారని ఆ వర్గాలు తెలిపాయి. వీటికి తోడు సాధారణ ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం దేశంలో తీవ్రస్థాయి రాజకీయ చర్చలకు తెర లేపింది. ఈ విధానంలో అనేక లొసుగులు, ఇబ్బందులు ఉంటాయని, సమాఖ్య స్ఫూర్తిని ఇది దెబ్బతీస్తుందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానంతో ప్రజల సమయాన్ని ఆదా చేస్తుందని, రెండు సార్లు కాకుండా ఒకేసారి ఓటు వేసేందుకు ప్రజలకు వీలు కల్పిస్తుందని బీజేపీ నేత గౌరవ్ భాటియా అన్నారు. అయితే.. ఇది రాజ్యాంగంపై నేరుగా దాడి చేయడం వంటిదేనని కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనటే అభివర్ణించారు. అదొక వేడిగాలితో కూడిన బెలూన్ వంటిదని, దానికి సహజ మరణం తప్పదని వ్యాఖ్యానించారు.