Line Of Control | నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులు..
Line Of Control | పహల్గం ఉగ్రదాడితో భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాక్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు.

Line Of Control | జమ్మూకశ్మీర్ : పహల్గం ఉగ్రదాడితో భారత్ – పాకిస్థాన్ సరిహద్దుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాక్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. గురువారం అర్ధరాత్రి నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. పాక్ రేంజర్ల కాల్పులను భారత్ ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. పాక్ సైన్యం కాల్పులకు ఇండియన్ ఆర్మీ ధీటుగా బదులిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. భారత సైన్యంలో ఎవరికీ గాయాలు కాలేదని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు.
మరో వైపు జమ్మూకశ్మీర్‌లోని బందిపోరాలో శుక్రవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. కుల్నార్ బజిపోరా ఏరియాలో ఉగ్రవాదులు తల దాచుకున్నట్లు నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందింది. దీంతో భారత సైన్యం అక్కడ కూంబింగ్ చేపట్టారు. జవాన్లను చూసిన ఉగ్రవాదులు కాల్పులు జరిపి పారిపోయేందుకు యత్నించారు. ముష్కరులను మట్టుబెట్టేందుకు సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఎన్‌కౌంటర్‌పై పూర్తిస్థాయి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ నెల 22న పహల్గాంలో ఉగ్రవాదులు 26 మందిని పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో భారత్, పాకిస్థాన్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్‌తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ చర్యలతో దాయాది అక్కసు వెళ్లగక్కింది. సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కనబెడుతున్నట్లు ప్రకటించింది. తమ గగనతలంలో భారత్‌కు చెందిన విమానాలకు అనుమతిని నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.