చేనేత వస్త్రాలతో రీల్స్ చేయండి: యువతకు ప్రధాని మోదీ పిలుపు

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్రాలు ధరించి GRWM రీల్స్ రూపొందించి #NationalHandloomDay తో సోషల్ మీడియాలో షేర్ చేయాలని యువతకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

నీట్ పేపర్ లీకేజీతో విద్యార్థి, యువతలో తన ప్రభుత్వం పట్ల నెలకొన్న ఆగ్రహాన్ని గ్రహించిన ప్రధాని మోదీ వారిని ఆకర్షించే మార్గాలపై ఫోకస్ పెట్టారు. జెన్ జీ యువతను ఉద్దేశించి వరుసగా సెల్ఫీ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ను, విడుదల చేస్తున్నారు. తాజాగా జాతీయ చేనేత దినోత్సం సందర్బంగా ప్రధాని మోదీ విడుదల చేసిన వీడియోలోనూ జెన్ జీ యువతకు సందేశం ఇచ్చారు. “ఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం. భారతదేశ చేనేత వైవిధ్యాన్ని ప్రాచుర్యంలోకి తెద్దాం” అని విజ్ఞప్తి చేశారు.1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం ప్రారంభమైందని, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తూ ఐక్యంగా ముందుకు వచ్చిన రోజు ఇదేనని వివరించారు.

చేనేత కార్మికులను, చేనేత వస్త్ర ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు జెన్ జీ యువత చేనేత వస్త్రాలను ధరించి GRWM(Get Ready With Me) రీల్స్ చేయాలని ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ ద్వారా కోరారు. తమకు ఇష్టమైన హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ధరించి “GRWM (Get Ready With Me)” శైలిలో రీల్స్ రూపొందించి #NationalHandloomDay హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో షేర్ చేయాలని యువతకు పిలుపునిచ్చారు. భారతీయ హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ప్రోత్సహించడంతో పాటు స్థానిక నేతకారులకు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని మోదీ సూచించారు. చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, పేద నేత కార్మిక కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని ప్రధాని తెలిపారు.

Latest News